నెలకు రూ.2 లక్షల కోట్ల జీఎస్టీ – అభివృద్ధా? ప్రజలను నిలువు దోపిడీ చేయడమా ?

By KTV Telugu On 8 May, 2023
image

 

ఏప్రిల్‌లో రూ. లక్షా ఎనభై వేల కోట్లకుపైగా జీఎస్టీ రూపంలో వసూలు అయిందని కేంద్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతోందని సంబర పడింది. పన్నుల వసూళ్లు అంటే అంత పెద్ద స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని అందుకే అభివృద్ధి అని చెబుతోంది. కానీ వాస్తవంగా ప్రభుత్వం చేస్తోంది నిలువు దోపిడీ. ప్రజల ఆదాయాన్ని పూర్తి స్థాయిలో లాగేసుకుంటోంది కేంద్రం. కానీ ఆ దోపిడీకి అభివృద్ధి ముసుగు వేస్తోంది. కేంద్రం ప్రకటించే లెక్కల్లో తమ సొంత సొమ్ము ఎంత ఉందో తెలుసుకున్న వారు కోపంతో రగిలిపోతారు కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే పేదవాడి కోపం కడుపుకు చేటు అంటారు. అసలు మనల్ని ప్రభుత్వాలు ఎంతలా పీల్చిపిప్పి చేస్తున్నాయో తెలుసా.

ఏడాదిలో జీఎస్టీ వసూ్ళ్లు రెట్టింపు అయ్యాయి. ఎందుకు అయ్యాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరిందా అంటే లేదు. ధరలు పెరిగాయి అందుకే పన్నులు పెరిగాయి. జీఎస్టీని ఎలా వసూలు చేస్తారు. ధర మీద వసూలు చేస్తారు. అంటే ఓ ఆయిల్ ప్యాకెట్ ధర వంద రూపాయలు ఉందనుకుందాం. దానిపై జీఎస్టీ పద్దెనిమిది శాతం అనుకుంటే పద్దెనిమిది రూపాయలు. మొత్తం నూట పద్దెనిమిది రూపాయలు అవుతుంది. అదే ఆయిల్ ప్యాకెట్ ధర రెండు వందలు అయితే జీఎస్టీ 36 రూపాయలు. ఏడాది క్రితం వంద ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు రెండు వందలు అయితే జీఎస్టీ కూడా డబుల్ అయింది. మరి ఇప్పుడు వినియోగం పెరిగినట్లా అభివృద్ధి జరిగినట్లా. కానే కాదు రేట్లు పెరగడం వల్ల జీఎస్టీ పెరిగింది. ప్రజలపై అటు రేట్ల భారం దాని వల్ల పన్నుల భారం పెరిగి ఆదాయంలో మరింత ఖర్చు పెట్టేసుకుంటున్నారు. ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఇది మాత్రం కేంద్రం చెప్పడం లేదు.

దేశంలో పన్నులు కట్టే వారి శాతం ఐదారులోపలే ఉందని కేంద్రం అప్పుడప్పుడూ మెసలి కన్నీళ్లు కారుస్తుంది. కానీ అసలు నిజం ఏమిటంటే దేశంలో బిచ్చగాడినీ వదలక కుండా పన్నులు వసూలు చేస్తతోంది. ప్రభుత్వం పన్నులు కడతారని చెబుతున్న వారి దగ్గర డబుల్ వసూలు చేస్తోంది. ఇన్ కంట్యాక్స్ పేయర్ దగ్గర దగ్గర పన్నుల మీద పన్నులు వసూలు చేస్తారు. ఓ మధ్య తరగతి జీవి రూ.ఐదు లక్షల జీతం వచ్చిందనుకుంటోంది. అందులో రెండున్నర లక్షలకు పన్నేస్తారు. ఎంత ఆదాయం పెరిగితే అంత శ్లాబ్ పెరుగుతుంది. పొరపాటున పది లక్షలు సంపాదించుకున్నారంటే అది ముఫ్పై శాతం అవుతుంది. అంత మేర ఆదాయపు పన్ను శాలరీ నుంచే కట్ చేసుకుని కేంద్రం తీసేసుకుంటుంది. హమ్మయ్య పన్ను కట్టేశా ఇక మిగిలిన డబ్బులతో ఎవరికీ పన్నులు కట్టకుండా గడపొచ్చనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదు. అసలు పన్నుపోటు ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఏ వస్తువు కొన్నా ఇప్పుడు జీఎస్టీ ఉంది. జీఎస్టీ లేని వస్తువంటూ లేదు. ఒక వేల బిల్లు వేయని దగ్గర కొన్నా ఆ వస్తువులో జీఎస్టీ పన్ను కూడా కలిపేసి ఉంటుంది.

ఈ సైకిల్ చూస్తే సంపాదించుకున్నదానికి పన్ను కట్టడమే కాకుండా ఖర్చు పెడుతున్న ప్రతీ దానికి పన్నులు కట్టాలన్నమాట. తినే తిండి దగ్గర్నుంచి ప్రతీ దానికి పన్ను కట్టాలి. అంతేనా ఇంకా బల్క్‌గా ప్రజల్ని దోచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పన్నులు ఉండనే ఉన్నాయి. దీనికి జీఎస్టీలో చోటు లేదు అంటే విడిగా పన్నులు బాదేస్తారన్నమాట. దీని ద్వారా కేంద్రానికి ఏటా మూడు, నాలుగు లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే ప్రజల సంపద ఎంతగా పీల్చుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదాయపు పన్ను కట్టి బయట ఏం కొన్నాజీఎస్టీలు కట్టి చివరికి అరవై శాతం పన్నులు కట్టి పెట్రోల్, డీజిల్ లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంకా రాష్ట్రాలు స్థానిక సంస్థలు ఉండనే ఉన్నాయి. మనకు తెలియకుండానే మనం వేలకు వేలు పన్నుల రూపంలో చెల్లిస్తూ పోతూండాలి. ఆ సైకిల్ ఎక్కడ అంతమవుతుందో తెలియదు. కానీ ఎంత కట్టినా మీరు ఫలనా పన్ను బాకీ ఉన్నారని సమాచారం రావడం మాత్రం ఖాయం. కేంద్రం ఒక్కటే ఇలా పన్నులు వసూలు చేస్తుందనుకుంటే కాస్త బెటరే అనుకోవచ్చు. కానీ రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకూ ఎన్ని రూపాల్లో మధ్యతరగతి జీవి మీద పన్నుల పేరుతో దాడి జరుగుతుందో అంచనా వేస్తే విరక్తి పుట్టడం సహజం. రాష్ట్రాలు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నాయి. పెట్రోల్, డిజిల్‌పై అదనపు భారం వేయడమే కాకుండా మద్యం ధరలతో మధ్య తరగతి జీవితాలను పేదరికంలోకి నింపేస్తోంది. దీనికి మద్యం అదనం. ఒక్కో ప్రభుత్వం ముఫ్పై వేల కోట్ల మద్యం ఆదాయాన్ని ఆశిస్తున్నారంటే ప్రజల ఆదాయాన్ని ఎలా పీలుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాలే కాదు ఇక స్థానిక సంస్థలూ పిండేస్తాయి. ఆ పన్ను ఈ పన్ను అని నెల నెలా వసూళ్లకు దిగుతాయి.

నెల నెలా రెండు లక్షల కోట్ల జీఎస్టీ వస్తోంది. పెట్రో పన్నులు అదనం. ఇన్ కంట్యాక్స్ అదనం. ఇంకా ప్రభుత్వానికి అనేక రకాల వనరులు ఉంటాయి. ఇన్ని లక్షల కోట్ల పన్నులు ప్రజల ఆదాయం నుంచి లాగేసుకుంటున్న ప్రభుత్వాలు ఆ సొమ్మును ఏం చేస్తున్నాయి. ఇప్పుడు దేశంలో కనీసం పది శాతం మందికైనా ఉచిత విద్య వైద్యం అందిస్తున్నాయా అందించే విద్య అయినా కాస్త క్వాలిటీగా ఉంటుందా.. తప్పని సరిగా చేయాలన్నట్లుగా చేస్తోంది కానీ ప్రభుత్వం బాధ్యతగా పైసా కూడా ఖర్చు పెట్టడం లేదు. అదే సమయంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తమ సొంత సొమ్ములా ఖర్చు చేసేస్తున్నాయి. అత్యంత నిరుపేదలను ప్రభుత్వాలు కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాయి. అత్యంత ధనికులు రాజకీయ పార్టీల ఆర్థిక అవసరాలకు ఖజానాలాగా ఉపయోగపడుతూ తమ ఖజానాను నింపుకుంటున్నాయి. కానీ మధ్య తరగతి జీవులు మాత్రమే ఎటూ కాకుండా పోయారు. ఇరవై నాలుగు గంటలు కష్టపడటం వారి సంపాదన నుంచి ప్రభుత్వానికి ఆదాయం అందించడం తప్ప వారికి మరో వ్యాపకం లేకుండా పోయింది.

ప్రజల సొమ్మును పన్నుల రూపంలో ఎంత ఎక్కువగా వసూలు చేసుకుంటే అంత అభివృద్ధి అని ప్రభుత్వం చెబుతోంది. బాకాలు ఊదేవాళ్లు ఊదుతున్నారు. కానీ నిజం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఎందుకంటే అలా మాట్లాడాల్సిన వారు ప్రభుత్వానికి పన్నులు కట్టడానికి రేయింబవళ్లు పని చేస్తున్నారు. వారికి తీరిక లేదు. రాజకీయ నాయకులకు కావాల్సింది కూడా అదే.