క్రెడిట్ కార్డుతో సిబిల్ స్కోర్ పెంచుకోండి ఇలా !

By KTV Telugu On 28 June, 2024
image

KTV TELUGU :-

ఇప్పుడు పర్సనల్ లోన్ కావాలన్నా సిబిల్ స్కోర్ ఉండాలి. చివరికి ఆస్తులు తాకట్టు  పెట్టి అప్పు తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ చూస్తారు. అది తక్కువ ఉంటే.. ఎక్కువ వడ్డీ వేస్తారు. అందుకే ఇప్పుడు ప్రతి మనిషికి సిబిల్ స్కోర్ అత్యంత కీలకం. సిబిల్ స్కోర్.. క్రెడిట్ స్కోర్ ఏదైనా ఒక్కటే.  ఒక్క ఈఎంఐని స్కిప్ చేసినా స్కోర్ తగ్గిపోతుంది. ఎక్కువగా క్రెడిట్ కార్డుల వల్ల మన సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది.  దాన్ని అదే క్రెడిట్ కార్డుతో ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డుని మనం వాడుకుంటే ఆర్థికంగా ఎంతో లాభం పొందవచ్చు. కానీ ఆ క్రెడిట్ కార్డు మనల్ని వాడేసుకునే పరిస్థితిని కల్పిస్తే మాత్రం ఊబిలో కూరుకుపోయినట్లే. క్రెడిట్ కార్డును వాడుకునే విధానంలో కిటుకుల్ని పట్టుకోవాలి.   మనం క్రెడిట్ కార్డును వాడుకుని సిబిల్ స్కోర్  భారీగా పెంచుకోవచ్చు.

మీ క్రెడిట్‌ స్కోర్ మీ ఆర్థిక స్థితిని, క్రెడిట్‌ బిహేవియర్‌ను సూచిస్తుంది. లోన్‌ కోసం మీరు అప్లై చేసుకున్నప్పుడు.. మీ క్రెడిట్‌ స్కోర్‌ను బట్టే మీ ఫైనాన్షియల్‌ స్టేటస్‌, రిపేమెంట్‌ బిహేవియర్‌ను బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు అంచనా వేస్తాయి. మీరు నమ్మమైన వ్యక్తా, కాదా; మీకు ఎంత లోన్‌ మంజూరు చేయవచ్చన్న విషయాన్ని క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగానే లెక్కగడతాయి. సిబిల్ లెక్క గట్టేదే క్రెడిట్ స్కోర్.

మంచి స్కోర్‌తో ఉంటే.. త్వరగా లోన్‌ రావడం, తక్కువ వడ్డీ రేటు సహా మరిన్ని చాలా ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. మరోవైపు, తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నవాళ్లకు అతి కష్టం మీద లోన్ వచ్చినా ఎక్కువ వడ్డీరేటుపడుతుంది.

తక్కువ వడ్డీ రేటుతో, సులభంగా లోన్‌ దక్కాలంటే క్రెడిట్ స్కోరు 750కి పైన ఉండాలి. ఒకవేళ మీ స్కోర్ 750 కంటే తక్కువలో ఉంటే, దాన్ని పెంచడానికి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలి మీ క్రెడిట్‌ స్కోర్‌ను తక్కువ కాలంలో 100 పాయింట్ల వరకు పెంచుకునేందుకు అనేక చిట్కాలు ఉన్నాయి. అందులో ఒకటి క్రెడిట్ కార్డు వినియోగం.    ఇప్పుడు ప్రతీ వ్యక్తి వ్యాలెట్ లో క్రెడిట్ కార్డు ఉంటుంది. క్రెడిట్ కార్డు ఇప్పుడు దాదాపు నిత్యావసరంగా మారింది.

క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో పూర్తిగా చెల్లించేలా చూసుకోండి. ఇది మీ క్రెడిట్ స్కోరును పెంచడంలో అత్యంత ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. సమయ పాలనతో చేసే చెల్లింపులు రుణదాతలను ఆకర్షిస్తాయి.   మీ క్రెడిట్ కార్డ్‌లోని లిమిట్‌ మొత్తాన్నీ వాడొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్‌లో సగం కంటే తక్కువ  మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. మీరు తరచుగా క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌ మొత్తాన్నీ వాడుతుంటే, అనవసర ఖర్చులు పెట్టే వ్యక్తిగా బ్యాంకులు మిమ్మల్ని పరిగణిస్తాయి. లోన్‌ ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటాయి. అంటే క్రెడిట్ కార్డు లిమిట్ రెండు లక్షలు ఉంటే.. 60వేలలోపే వాడి.. సమయానికి చెల్లింపులు చేయాలి.  క్రెడిట్ కార్డు అసలు వాడకపోయినా నష్టమే. ఎందుకంటే లావాదేవీలుంటేనే క్రెడిట్ స్కోర్ లో పెరుగుదల ఉంటుంది.

అలాగే నెల నెలా మీరు చెల్లించే EMIల మొత్తం మీ నెలవారీ జీతం లేదా మొత్తం ఆదాయంలో 50 శాతం దాటకుండా చూసుకోండి. ఇలాంటి నియంత్రణ పాటిస్తే గడువులోగా EMIలన్నీ వెళ్లిపోతాయి. క్రెడిట్‌ స్కోర్‌ సాఫీగా పెరుగుతుంది.  లోన్లు లేదా క్రెడిట్‌ కార్డుల కోసం పదేపదే అప్లై చేయొద్దు. ఇలా చేస్తే మీ మీద నెగెటివ్‌ ఇంపాక్ట్‌ పడుతుంది. మీరేదో అత్యవసరంలో ఉన్నారని, అప్పు తీసుకున్నాక చెల్లించే పరిస్థితి మీకు ఉంటుందో, లేదోనని ఆర్థిక సంస్థలు అనుమానిస్తాయి. మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లోనూ ఈ నెగెటివ్‌ రిమార్క్‌ పడుతుంది.  ఒకటికి మించిన క్రెడిట్ కార్డ్స్ ఉంటే, వాటిపై అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ లు ఉంటే, మొదట అత్యధిక వడ్డీ రేటు ఉన్న కార్డుల బ్యాలెన్స్ లను చెల్లించడంపై దృష్టి పెట్టాలి,  దీనివల్ల మీ మొత్తం వడ్డీ ఖర్చులు తగ్గుతాయి.

ఇప్పుడు ప్రతీ ఆర్థిక లావాదేవీకి సిబిల్ స్కోర్ కేంద్రంగా మారింది. ముఖ్యంగా బ్యాంక్ లోన్ పొందాలంటే మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. చివరకు, క్రెడిట్ కార్డ్ ను కూడా సిబిల్ స్కోర్ చూసే బ్యాంకులు ఇష్యూ చేస్తున్నాయి. అందువల్ల మంచి సిబిల్ స్కోర్ ను మెయింటైన్ చేయడం చాలా అవసరం.

క్రెడిట్ కార్డు ఉన్న వారికి ఆర్థిక  క్రమశిక్షణ ఉండాలి.  ప్లాన్ ఉండాలి. ఆ జాగ్రత్త ఉంటే క్రెడిట్ కార్డు వడ్డీలేని సొమ్ము మనకు అందుబాటులో ఉన్నట్లే.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి