IIT నిరుద్యోగులు

By KTV Telugu On 30 May, 2024
image

KTV TELUGU :-

ఐఐటీల్లో సీటు  కొడితే జీవితం సెటిల్ అయిపోయినట్లే అనుకుంటారు.  అంతర్జాతీయ సంస్థలు, ఎమ్మెన్సీలు ఐఐటీ విద్యార్థులను క్యాంపస్ లోనే భారీ మొత్తంలో ఆఫర్ ఇచ్చి రిక్రూట్ చేసుకుంటాయి. కానీ ఇది గతం. ఇప్పుడు ఐఐటీల్లో చదివిన వారికి చాలా మంది కనీసం ఉద్యోగం రావడం లేదు. తాజా గణాంకాలు ఈ విషయాలను నిరూపిస్తున్నాయి.  తమ పిల్లలు ఐఐటీల్లో సీటు కొట్టాలని ఆశపడుతూ.. సర్వం ధారబోస్తున్న తల్లిదండ్రుల ఆశలకు గండికొడుతున్నాయి.

భారత దేశంలో విద్యా సంస్థల్లో ఐఐటిలకు ప్రత్యేక స్థానం ఉంది. ఐఐటిల్లో చదివిన వారికి  లక్షల్లో వేతనాలు వచ్చే ఉద్యోగాలు వస్తాయి.  ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. దేశంలోని వివిధ ఐఐటిల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో ఈ ఏడాది దాదాపు 38 శాతం మందికి క్యాంపస్‌ ఉద్యోగాలు దక్కలేదు. దేశంలో 61 శాతం పోస్ట్‌ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కలేదు.  సమాచార హక్కు చట్టం  ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఓ ఐఐటీ పూర్వ విద్యార్థి సేకరించిన సమాచారంలో  ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటి క్యాంపస్‌ ల్లో దాదాపు 8 వేల మంది  ఐఐటి విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదని తేలింది. 2024లో 21,500 మంది విద్యార్థులు ఉద్యోగాలు కోసం నమోదు చేసుకోగా, కేవలం 13,400 మంది మాత్రమే ఉద్యోగాలు సాధించారు. మిగతా వారు  ఇంకా కొలువుల కోసం అన్వేషిస్తున్నారు.  రెండేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఈ పరిస్థితి దాదాపు రెట్టింపు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి.

కొత్త ఐఐటీల్లోనే కాదు పాత  ఐఐటిల్లో కూడా ఇదే పరిస్థితి.  టాప్ నైన్ ఐఐటీల్లో  ఈ ఏడాది 16,400 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా, వారిలో 6,050  అంటే 37 శాతం మందికి ఇంకా ఉద్యోగాలు దక్కలేదు. కొత్త 14 ఐఐటిల్లో అయితే ఈ పరిస్థితి మరింత క్షీణించింది. 5,100 మంది ఉద్యోగాలు కోసం నమోదు చేసుకోగా, ఇంకా 2,040 మందికి కొలువులు రాలేదని తేలింది. గతేడాది ఖరగ్‌పూర్‌ ఐఐటిల్లో 33 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదని రికార్డులు చెబుతున్నాయి.  ఉద్యోగ నియామకాల్లో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇంకా ఉద్యోగాలు రాని విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, నిస్సహాయతలో పడుతున్నారు.  ఉద్యోగాలురాని విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడం దేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అనిశ్చిత స్థితిని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  దాదాపు 61 శాతం పోస్ట్‌గ్రాడ్యుయేట్‌లు ఇప్పటికీ చోటు చేసుకోలేదు. ఇది ప్రధాన కళాశాలలు, యువ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంక్షోభం నెలకొందని అంచనా వేస్తున్నారు.

ఐఐటి ఢిల్లీలో గత ఐదేళ్లలో 22 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కకపోగా, 2024కు వచ్చేసరికి 40 శాతం మందికి అదే పరిస్థితి ఎదురైంది. గత రెండేళ్లలో 600 మందికి ఉద్యోగాలు దక్కలేదు. 2022 నుంచి 2024 వరకు పాత తొమ్మిది ఐఐటిల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 1.2 రెట్లు పెరగ్గా, ఉద్యోగాలు సాధించనివారి సంఖ్య 2.1 రెట్లు పెరిగింది. అలాగే, నూతన ఐఐటిల్లో నమోదిత విద్యార్థుల సంఖ్య 1.3 రెట్లు పెరిగింది. కానీ ఉద్యోగాలు దక్కని విద్యార్థుల సంఖ్య కూడా 3.8 రెట్లు పెరిగింది. ఈ సంక్షోభం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఆరుగురు ఐఐటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, అనేక మంది తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్ కుంచించుకుపోతోంది. చాట్ జీపీటీలు, ఏఐలు వచ్చిన తర్వాత వాటికి  తగ్గట్లుగా నైపుణ్యాలను పెంచుకునేవారికే ప్రయోజనం ఉంటోంది.  పాత తరహా ఉద్యోగాలకు డిమాండ్ పడిపోయింది. ఈ క్రమంలో ఐఐటీలు కూడా తమ విద్యార్థులను భావి ప్రయోజకులుగా క్రియేటర్లుగా తీర్చిదిద్దే క్రమంలో కాలానికి మించి ముందుగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడినట్లుగా పరిస్థితులు నిరూపిస్తున్నాయి. ఉన్నత స్థితికి ఎదగడానికి ఐఐటీలు మాత్రమే మార్గం కాదని తాజా పరిణామాలు అర్థం అయ్యేలా చేస్తున్నాయి.

కాలానికి తగ్గట్లుగా మారితేనే అనుకున్న స్థాయిలో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. మారకపోతే .. వెనుకబడిపోతారు. ఐఐటీలు కూడా అదే నిరూపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి