రష్యాలో ప్రజాస్వామ్యం ఉందని అందరికీ తెలుసు. కానీ అక్కడ పుతిన్ తప్ప ఎవరూ గెలవరు. ఓటింగ్ జరుగుతుంది. ప్రజలు ఓట్లేస్తారు. కౌంటింగ్ జరుగుతుంది. కానీ పుతిన్ మాత్రమే గెలుస్తారు ?. అదే అక్కడి ప్రజాస్వామ్యంలో ప్రత్యేకత. ఇప్పుడు భారత్ కూడా అలాంటి ప్రజాస్వమ్యం దిశగానే వెళ్తోంది. అక్కడ పుతిన్‌లాగా ఇక్కడ మోదీ బలపడుతున్నారు. మరోసారి గెలిస్తే.. అలాంటిదే జరుగుతుందని విపక్షాలు అంటున్నాయి. జరుగుతున్న పరిణామాలు అవే సూచిస్తున్నాయా ?
రష్యాలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. వ్లాదిమిర్ పుతిన్ 80 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. తన గెలుపుతో రష్యా మరింత బలోపేతం అయిందని ఆయన ఘనంగా ప్రకటించుకున్నారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. అద్భుత విజయం సాధించారని అభినందించారు. రష్యాలోపేరుకు ప్రజాస్వామ్యమే ఉంది. ప్రజలు ఓట్లేశారు. మరి నిజంగా అవి ఎన్నికలేనా ఉంటే అంత కంటే కామెడీ ఉండదు. ప్రత్యర్థుల్ని పోటీ చేయనివ్వరు.. పుతిన్ ను వ్యతిరేకించే వారి ప్రాణాలకు గ్యారంటీ ఉండదు.. ఓట్లు వేసే వాళ్లకూ స్వతంత్రం ఉండదు. ప్రత్యర్థులుగా నిలబడిన వాళ్లు తమకు ఓట్లేయవద్దని.. పుతిన్ కే వేయాలని ప్రచారం చేయడం కామన్. ప్రపంచ దేశాలు.. అవేం ఎన్నికలని కామెంట్లు చేస్తే.. రష్యా నుంచి ఒక్కటే సమాధానం వస్తుంది.. మా దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని.. ఆ ఆన్సర్. ఇక ఎవరైనా నోర్మూసుకవాల్సిందే.
అలాంటి ప్రజాస్వామ్యం దిశగా భారత్ వెళ్తోందా ? అనే అనుమానాలు ప్రపంచదేశాలతో పాటు ఐక్య రాజ్యసమితికి కూడా వస్తున్నాయి. ఎందుకంటే.. రాజకీయ ప్రత్యర్థుల్ని అధికారంలో ఉన్న బీజేపీ అలాగే కట్టడి చేస్తోంది మరి. భారత్ లో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. బీజేపీపై గట్టిగా పోరాడుతున్న ఓ ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి జైలు పాలయ్యారు. అంతకు ముందే బెయిల్ ఇచ్చిన ఓ జడ్జి రాత్రికి రాత్రే బదిలీ అయ్యారు. తరవాత అరెస్టు జిగిపోయింది. ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి ముందు.. మరో రాష్ట్రం జార్ఖండ్ సీఎంను కూడా అరెస్ట్ చేశారు. ఆయన రాజీనామా చేసి వేరే వారికి సీఎం పగ్గాలిచ్చారు. కానీ ఢిల్లీ సీఎం మాత్రం తాను రాజీనామా చేసే ప్రశ్నేలేదంటున్నారు. అరెస్టుల బారిన పడింది వీరిద్దరేనా అంటే… చాలా మంది ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయ్యారు.ఆయనపై కేసులకు ప్రాథమిక ఆధారాలను కూడా కోర్టులో పెట్టలేకపోయారు.దాదాపుగా రెండు నెలలు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చి బీజేపీతో పొత్తులు పెట్టుుకున్నారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రూపాయి నిధులు అందకుండా ఖాతాల్ని బ్లాక్ చేశారు. న్యాయస్థానాల్లో ఊరట దక్కడం లేదు. తాజాగా వేల కోట్లు పన్ను బకాయిలు కట్టాలంటూ… ఎప్పుడో లెక్కలు తీసి నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ బయటకు కనిపిస్తున్నవి. కానీ ఈడీ అధికారులు ఎక్కడెక్క డ చేస్తున్న దాడులతో చెప్పుకోలేనంత భయానక వతావరణం వివిధ రాష్ట్రాల్లో ఉంది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య నియంతలు పాలిస్తున్న దేశాల్లో ఇదే జరుగుతుంది. వ్యవస్థలన్నింటినీ గుప్పిట పెట్టుకుని ప్రత్యర్థుల్ని జైలుకు పంపడం చేస్తూంటారు. ఇండియాలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ అవినీతి చేస్తే… రెండేళ్లుగా చేయని అరెస్టు ఇప్పుడే ఎందుకు చేశారో అర్థం చేసుకోవచ్చు. అందుకే భారత్ లో ప్రజాస్వామ్య హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయని ఆశిస్తామని ఐక్యరాజ్య సమితి అంటోంది. అంటే.. కేజ్రీవాల్ విషయంలో.. తప్పు జరిగిందని ఇండియాలో ఏదో జరుగుతోందని ఐక్యరాజ్య సమితి అనుమిస్తోంది.
భారత్ లో పరిణామాలపై.. అమెరికా, జర్మనీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇతర దేశాలు తమ అభిప్రాయాలను చెప్పడాన్ని భారత ప్రభుత్వం.. మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంగా అభివర్ణించి కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికా అంబాసిడర్ ను పిలిపించి హెచ్చరించింది. ఇవి మన దేశ ఇమేజ్ ను అంతర్జాతీయ సమాజంలో ఎలా నిలబెడతాయో పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఆ అభిప్రాయాలను మన దేశంపై జరుగుతున్న కుట్రగా కాకుండా.. అందులో నిజాల గురించి ప్రజలు.. బుద్ది జీవులు .. తమ రాజకీయ, కుల, మత, ప్రాంత భావనలకు అతీతంగా ఆలోచిస్తే దేశానికి మేలు జరుగుతుంది. పార్టీల మత్తులోనే ఉండిపోతే మాత్రం.. ఐక్యరాజ్య సమితి కూడా సానుభూతి చూపిస్తుంది తప్ప ఏమీ చేయలేదన్న వాదన కాంగ్రెస్ పార్టీ సహా అనేక విపక్షాలన్నీ అంటున్నాయి. నాలుగు వందల సీట్ల టార్గెట్ గా వెళ్తున్న బీజేపీకి.. ఆ మాత్రం సీట్లు వస్తే.. భారత్ మరో రష్యా తరహా ప్రజాస్వామ్యం అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడు మనకు ఈ విషయాలు చెప్పుకునేంత స్వేచ్చ కూడా ఉండదు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…