భారత్ ఆర్థిక వ్యవస్థ అసలు నిజాలు ! ఇంత మోసమా ?

By KTV Telugu On 24 August, 2023
image

KTV TELUGU :-

ప్రధాని నరేంద్రమోడి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా తాము వరుసగా మూడోసారి అధికారంలో కొస్తే ఐదేళ్ళలోగా భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానానికి చేరుకుంటుందని ప్రజల్ని ఆశపెట్టారు. భారత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉందని చెబుతున్నారు. మన ముందు అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీలున్నాయి. గతేడాది వరకు భారత్‌ ఆరోస్థానంలో ఉండగా అప్పటి వరకు ఐదో స్థానంలో ఉన్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అంటే బ్రిటన్ ను వెనక్కినెట్టి ఆ స్థానంలోకి భారత్‌ చేరింది. అంటే మనం బ్రిటన్ కంటే ధనవంతులమైపోయామా ? అమెరికా, చైనా, జపాన్, జర్మనీల తర్వాత నిజంగా మనమేనా ?. మరి మన దేశాన్ని ఇంకా ఎందుకు పేద దేశంగా పిలుస్తున్నారు ? అభివృద్ధి చెందిన దేశం అని ఎందుకు అనడం లేదు ? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.

బ్రిటన్ పౌరుల జీవన ప్రమాణాలు, భారతీయల జీవన ప్రమాణాలను పక్క పక్కన పెట్టి చూస్త హస్తిమ శకాంతరం కనిపిస్తుంది. బ్రిటన్ పౌరులకు చీకూచింతా ఉండదు. ఎక్కడా మురికి వాడల్లో నివసించరు. అద్భుతమైన మౌలిక సదుపాయాలుటాయి. దేశం మొత్తం ఎక్కడ చూసినా రిచ్ నెస్ కనిపిస్తుంది. మరి అలాంటి దేశం కంటే భారత్ గొప్ప అని ఎలా చెబుతున్నారు. దేశంలో పరిస్థితులు రాను రాను దిగజారిపోతున్నాయని.. పెరుగుతున్న ధరలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని వస్తున్న విశ్లేషణలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు. అసలు ఈ లెక్కల్లో మాయ, మర్మం తెలిస్తే.. నోరెళ్లబెట్టక తప్పదు.

భారత ఆర్థిక వ్యవస్థను అద్దంలో చూపిస్తున్న పాలకులు
చిన్న గుట్టను కొండలా చూపించి ప్రజల్ని మోసం చేస్తున్న వైనం
దేశ ఆర్థిక వ్యవస్థ అంటే 140 కోట్ల మంది సృష్టించే సంపద
బ్రిటన్ లో 7 కోట్ల మంది సృష్టించే సంపదతో సమానం
బ్రిటన్ ను దాటేసినట్లే అవుతుందా ?
బ్రిటన్ పౌరుల తలసరి ఆదాయం రూ. 35 లక్షలు
ఇండియా పౌరుల తలసరి ఆదాయం రూ. రెండు లక్షలకు కాస్త ఎక్కువ
ప్రజల తలసరి ఆదాయంలో, ప్రపంచంలోని 197 దేశాలలో 142వ స్థానంలో భారత్
మరి టాప్ త్రీ ఆర్థిక వ్యవస్థగా మారామని చెప్పుకోవడం ఎలా సాధ్యం ?

2014లో ఎన్‌డీఏ అధికారం చేపట్టేనాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ పదోస్థానంలో ఉండేదని ఎన్డీఏ పదేళ్ల పాలనతో బ్రిటన్ ను కూడా కొట్టేసి… పైకి ఎదిగిపోయామని ఐదో స్థానానికి చేరామని ఉదరకొడుతున్నారు. బెంగళూరులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ యూనివర్శిటీ కూడా రాబోయే ఏళ్ళలో భారత్‌ ఏడు శాతం స్థూల జాతీయోత్పత్తిలో అభివృద్ధినమోదు చేస్తుందని విశ్లేషించింది. 2023చివరి నాటికి భారత్‌ 3.7ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది. అప్పటికి యునైటెడ్‌ కింగ్‌డమ్‌పై భారత్‌ తన ఆధిక్యతను కొనసాగిస్తూనే ఉంటుంది. ఇంటర్నేషనల్‌ మోనిటరీ ఫండ్‌ అంచనాల మేరకు 2025నాటికి భారత్‌ జర్మనీ ఆర్థిక వ్యవస్థను దాటేస్తుంది. 2027నాటికి 5.4ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది. జపాన్‌ ఆర్థిక వ్యవస్థను మించిపోతుందని అంచనా. అంటే బ్రిటన్ , జర్మనీ, జపాన్ కన్నా ధనిక దేశమైనట్లే అనుకుంటే… అంతకు మించిన ఆర్థిక అమాయకత్వం మరొకటి ఉండదు. .

స్థూల జాతీయోత్పత్తి లో భారత్ బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్లూమ్‌బర్గ్ సంస్థ ఇటీవల డేటా వెల్లడించింది. బ్లూమ్‌బర్గ్ చెప్పిన దాని ప్రకారం, ఈ ఏడాది మార్చి చివరి నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ విలువ 854.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఒక ఇంట్లో వంద మంది ఉన్నారు. వారందరూ కలిసి పనులకు వెళ్లి నెలకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారనుకుందాం. అదే సమయలో మరొకరి ఇంట్లో ఏడుగురే ఉంటారు. వారు కూడా పనికి వెళ్లి వెయ్యి రూపాయలు సంపాదిస్తారు. ఇప్పుడు ఎవరు ధనవంతులు అవుతారు. వంద మందితో వెయ్యి రూపాయలు సంపాదిచే వారా లేకపోతే.. ఏడుగురుతోనే వెయ్యి రూపాయలు సంపాదించేవారా. ..? . చాలా సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది.. ఏడుగురితో వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న వారే గొప్ప. అంతే కానీ వంద మందితో వెయ్యి సంపాదిస్తే.. అది వారి తిండితిప్పలకైనా సరిపోతుంది. ఇదే ఫార్ములా ప్రకారం ఆలోచిస్తే.. భారత ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న డొల్ల మాటలన్నీ అర్థమైపోతాయి.

బ్రిటన్ జనాభా దాదాపు 7 కోట్లు కాగా, అంచనాల ప్రకారం ప్రస్తుతం భారతదేశ జనాభా దాదాపు 140 కోట్లు. కానీ బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లు. 140 కోట్లు… అంటే కనీసం ఒక్క తెలుగు రాష్ట్ర జనాభా అంత లేని బ్రిటన్ ఆదాయం మొత్తం భారత్ సృష్టించే అంత సంపద సృష్టిస్తోంది. ఇప్పుడు నిజాయితీగా ఆలోచిస్తే బ్రిటన్ ను దాటేశామో లేదో స్పష్టతకు వస్తుంది. ప్రజల తలసరి ఆదాయంలో, ప్రపంచంలోని 197 దేశాలలో భారతదేశం 142వ స్థానంలో ఉంది. అమెరికా సగటు తలసరి ఆదాయం భారత్ కంటే 31 రెట్లు ఎక్కువ. జర్మనీ, కెనడా తలసరి ఆదాయం భారతదేశం కంటే 20 రెట్లు ఎక్కువ. భారత్ అంత జనాభా ఉన్న చైనాలో పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌ కూడా భారత తలసరి ఆదాయం కంటే 5 రెట్లు ఎక్కువ.

దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నామని చెప్పడానికి రాజకీయ పార్టీల నేతలు … గణాంకాలను తమ ఇష్టం వచ్చినంత వరకూ చూపిస్తూంటారు.. చెబుతూంటారు. బీజేపీ కూడా అదే చెబుతోంది. లెక్క ప్రకారం చూస్తే.. వాస్తవికంగా ఆలోచిస్తే దేశ ప్రజలు చాలా వేగంగా వెనుకబడిపోతున్నారు.

భారత్ ను పరిపాలించిన బ్రిటన్ ను దాటిపోయాయని.. ఇక అమెరికానే టార్గెట్ అని కొంత మంది విచిత్రమైన వాదనలు వినిపిస్తూ ఉంటారు. కానీ అసలు విషయం… నిజాలను పరిశీలిస్తే.. వారికి మైండ్ బ్లాంక్ అవుతుంది. సగట బ్రిటన్ పౌరుడి తలసరి ఆదాయం 45 వేల డాలర్లు.. రూపాయల్లో 38 లక్షల రూపాయలు అనుకోవచ్చు. ఎలా చూసినా… ఒక బ్రిటన్ పౌరుడి వార్షిక సంపాదన ముఫ్పై లక్షల రూపాయలపైనే ఉంటుంది. మరి మన దేశంలో.. రెండు వేల డాలర్లు.. అంటే.. అటూ ఇటూగా మూడు లక్షలు. ముఫ్పై లక్షలు ఎక్కడ.. మూడు లక్షలు ఎక్కడ. ఇంత తేడా పెట్టుకుని బ్రిటన్ దాటిపోయామని… మళ్లీ గెలిస్తే మూడో స్థానంలోకి వచ్చి కూర్చుంటామని ఎలా ధీమాగా చెప్పగలరు ? రెండు దేశాల ఆర్ధిక వ్యవస్థలను పోల్చాలంటే తలసరి ఆదాయాలను పోల్చి చూడాలి. ఎందుకంటే దేశమంటే మట్టి కాదు.. మనుషులు. మన దగ్గర 140 కోట్ల మంది జనాభాతో చేసే ఉత్పత్తిని వారు ఏడు కోట్లతోనే చేస్తున్నారంటే.. మనం ఏ స్థాయిలో వెనుకబడ్డామో అర్థం చేసుకోవచ్చు.

‘తలసరి ఆదాయం విషయంలో భారతదేశం ఇప్పటికీ యూకే కన్నా చాలా వెనుకబడి ఉంది. తలసరి ఆదాయంలో భారతదేశం చాలా వెనుకబడిన దేశాల జాబితాలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పరంగా భారత్ బ్రిటన్‌ను అధిగమించిందని చెప్పడం సరికాదు.. అలాగే మూడో స్థానానికి వచ్చేస్తామని చెప్పడం కూడా అమాయకత్వమే. ‘భారత జనాభా బ్రిటన్ జనాభా కంటే ఇరవై రెట్లు ఎక్కువ. మన జీడీపీ వారి జీడీపీతో సమానంగా ఉన్నామంటే, తలసరి ఆదాయంలో మనం 20 రెట్లు వెనకబడి ఉన్నామని అర్ధం. యూకే ఆర్ధిక వ్యవస్థను, భారత ఆర్ధిక వ్యవస్థను పోల్చడం ఆర్థిక లెక్కల్లో తప్పుడు పని.

అసలు కేంద్ర ప్రభుత్వం వేస్తున్న లెక్కల్లోనే తేడా ఉందన్న విమర్శలు కూడా ఉన్నాయి. భారతదేశంలోని 94 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. అసంఘటిత రంగంలో స్థిరమైన క్షీణత ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. కేవలం వ్యవస్థీకృత రంగ గణాంకాలను చేర్చి అందరూ భారత్ బ్రిటన్ ను దాటేసిందనే లెక్కలు చెబుతున్నారు. భారతదేశపు లేబర్ పోర్టల్‌లో 27.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 94 శాతం మంది ప్రతి నెలా పది వేల రూపాయల లోపే సంపాదిస్తున్నారు. మరి దీని గురించి మాట్లాడుకంటే…. వీరిని అబివృద్ధి చేయకపోతే.. ఎప్పుడూ భారత్ ముదుకు వచ్చినట్లుగా కాదు.

ప్రభుత్వాలు మనది అభివృద్ధి చెందిన దేశం అనే ఓ మాయను ప్రజల కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. దేశంలో పెరిగిపోతున్న పేదరికం మాత్రం… ఆ మాటల్ని విని నిర్వేదంగా నవ్వుకుంటోంది. అంతకు మించి వారు ఏమీ చేయలేరు. వారే కాదు.. ఎవరూ ఏమీ చేయలేరు.. చెప్పే మాటలు వినడం తప్ప.

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి