ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతంరెడ్డి ఫిట్ నెస్‌కు ప్రాధాన్యం ఇస్తారు. ఆయన బాడీ చూస్తేనే తెలుస్తుంది. కానీ ఆయనకు ఇలా గుండెపోటు వచ్చింది. అలా చనిపోయారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా అంతే. వీరు ప్రముఖులు కానీ సామాన్యులు కూడా ఎంతో మంది హఠాత్తుగా గుండెపోటుకు గురై వెంటనే ప్రాణాలు వదులుతున్నారు. అప్పటి వరకు ఉత్సాహంగా కనిపించిన వారు ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో యువకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్, అదోనీల్లో జిమ్ చేస్తూ నిండా పాతికేళ్లు లేని ఇద్దరు అసువులు బాశారు. నిర్మల్ లో డాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. ఆ యువకుడికి ఇరవై ఏళ్లు కూడా లేవు. ఇవన్నీ ఇటీవల జరిగినవే. దేశవ్యావ్తంగా ఇలాంటి మరణాల సంఖ్య పెరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ మరణాలు ఇప్పుడే ఎందుకు చోటు చేసుకుంటున్నాయి. జీవశైలిలో వచ్చిన మార్పులే కారణమా. లేకపోతే పుకార్లు వస్తున్నట్లుగా కరోనా వ్యాక్సిన్ కారణం అవుతోందా.
ఆరోగ్యంగా ఉండాలంటే కసరత్తులు చేయాలని వైద్యులు చెబుతూంటారు. నడక. జిమ్ ఏదైనా సరే శరీరానికి శ్రమ ఉండాలంటారు. నిన్నామొన్నటి వరకూ అది మంచిదే. యువత కూడా ఇలా కసరత్తులు చేసి బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి శ్రమ పడుతూంటారు. కానీ ఇలా పర్ ఫెక్ట్ వర్కవుట్ లు చేస్తూ హఠాత్తుగా చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జిమ్‌లలో సీసీ కెమెరాలు ఉన్న చోట్ల దృశ్యాలు బయటకు వస్తున్నాయి. ఇంతగా కసరత్తులు చేస్తున్న వ్యక్తి ఒక్క సారిగా ఎలా అలా కుప్పకూలిపోతున్నాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. హార్ట్ ఎటాక్ వస్తోందని వెంటనే ప్రాణాలు పోతున్నాయని వైద్యుల పరిశీలనలో తేలుతోంది. ఇంత కాలం లేని ఈ సడెన్ జిమ్ మరణాలు ఆరోగ్య పరంగా ఎంతో పుష్టిగా ఉండే వారికిఈ గుండె పోట్లు ఎందుకు వస్తున్నాయి. ముందస్తుగా ఎలాంటి సంకేతాలు లేకుండా ఎందుకిలా జరుగుతోంది.
యువతలో గుండెపోటుకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవన శైలి ఆధునిక జీవనంతో కూడిన పని ఒత్తిడి అని చాలా మంది విశ్లేషిస్తూ ఉంటారు. కానీ ఇటీవల చనిపోతున్న వారి వృత్తి, వ్యాపారాలు ఇతర వ్యాపకాలను చూస్తే వారెవరూ ఇంకా ఒత్తిడి జీవితంలోకి అడుగు పెట్టని వారే. ఎలాంటి బాధ్యతలు లేకుండా ఉన్నవారే. అదే సమయంలో వారేమీ తిండి విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ నిర్లక్ష్యంగా ఉండేవారు కాదు. అందుకే వారి మరణాల వెనుక ఆధునిక జీవనశైలి అనారోగ్య ఆహారపు అలవాట్లు ఉన్నాయని చెప్పలేం. అతిగా వ్యాయామం చేసే ధోరణి కూడా ఓ కారణం అని మరికొంత మంది చెబుతున్నారు. శారీరకవ్యాయామం చాలా ముఖ్యమే అయినప్పటికీ అది శారీరక పరిమితులకు లోబడి ఉండాలని సలహాలిస్తున్నారు. జిమ్‌లో ట్రైనర్స్ ఉంటారు వారు ఎవరికి ఎంత జిమ్ చేయాలో స్పష్టంగా చెబుతారు. నిజానికి అకాల మరణాలకు అధిక జిమ్ అనేది కారణం కానే కాదని అర్థం చేసుకోవచ్చు.
కొత్త శతాబ్దంలో మానవాళిని వణికించిన వైరస్ కరోనా. కరోనా తగ్గిపోయినా ఆ ప్రభావం ఉంటుందని చాలా కాలంగా వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1918లో స్పానిష్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణ తర్వాత వరుసగా గుండె పోటు కేసులు కూడా పెరుగుతూ వెళ్లాయి. 1940 నుంచి 1959 మధ్య ఒక్కసారిగా ఈ కేసుల్లో పెరుగుదల కనిపించింది. ఆ ఫ్లూ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ లక్షణాలు కోవిడ్-19 వ్యాప్తి తర్వాత చాలా మందిలో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఫ్లూ మహమ్మారే దీనికి కారణమని ఆ తర్వాత పరిశోధనల్లో తేలింది స్పానిష్ ఫ్లూ వైరస్ సోకిన తర్వాత ఆ బాధితుల్లో ఒక న్ఫెక్షన్ వదిలివెళ్లింది. పురుషుల్లో ఎక్కువగా ఈ గుండెపోటు కేసులు కనిపించాయి. ఇప్పుడు కోవిడ్-19 వ్యాప్తి తర్వాత కూడా గుండెపోటు కేసులు ఎక్కువగా మగవారిలోనే వెలుగుచూస్తున్నాయని అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ విశ్లేషిస్తున్నాయి.
కరోనా వ్యాక్సిన్ల కారణంగా ఇలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రజలు చనిపోతున్నారని సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇంత వరకూ అది నిజమే పరిశోధనలు వెలుగు చూడలేదు. కొంత మంది వ్యక్తిగత స్థాయిలో ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అసలు కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు హృద్రోగాలకు మధ్య సంబంధం ఏమిటి అనేది పరిశోధనలే వెల్డించాల్సి ఉది. కోవిడ్-19 వల్ల శ్వాసకోశ వ్యాధులతోపాటు గుండె పోటు లాంటి ముప్పులు కూడా పెరుగుతాయని ఇదివరకటి అధ్యయనాలు చెబుతున్నాయి కానీ వ్యాక్సిన్ల వల్ల కాదు. మహమ్మారుల వ్యాప్తికి సంబంధించిన అధ్యయనాలను పరిశీలించినప్పుడు అకాల మరణ ముప్పు జీవిత కాలం తగ్గిపోవడం లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశముందని తేలింది. ఇదీ అందులో ఒకటిగానే చూడాల్సి ఉంది.
సడెన్ మరణాలకు కారణం కరోనానా. కరోనాను తగ్గించుకునేందుకు వేయించుకున్న వ్యాక్సినా అన్నది తర్వాత సంగతి. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఇప్పడు ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. ఎందుకంటే ఒక్క మరణం కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తుంది.