ఇస్రో మరో ప్రయోగం.. ఈసారి 36 ఉపగ్రహాలు

By KTV Telugu On 27 March, 2023
image

ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయిలా నిలిచే ప్రయోగం విజయవంతమైంది. వెహికల్ మార్క్-3 రాకెట్‌తో ఏకకాలంలో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. శ్రీహరికోట సతీష్‌ ధావన్ స్పేస్‌ సెంటర్‌లో ఇస్రో రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో పంపిన 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 రాకెట్ కక్ష్యలోకి చేర్చింది. దాదాపు 20 నిమిషాల ప్రయాణం తర్వాత భూమి ఉపరితలం నుంచి 450 కిలోమీటర్ల దూరం చేరుకుంది. వన్ వెబ్‌కి చెందిన మొత్తం 36 ఉపగ్రహాలను వృత్తాకార కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టింది. ఒక్కో శాటిలైట్‌ బరువు 150 కిలోలు. ఇస్రో రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ శాస్త్రవేత్తలను అభినందించారు. మార్క్‌-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశామన్నారు. ఈ ప్రయోగంతో వాణిజ్య ప్రయోగాల్లోనూ మన దేశానికి తిరుగులేదని మరోసారి రుజువైంది.

బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్‌ సంస్థతో ఇస్రో 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గతేడాది అక్టోబర్‌ 23న 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఇస్రో ఇప్పుడు మరో 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. భూమికి తక్కువ ఎత్తులోని కక్ష్యలోకి చేర్చిన ఈ ఉపగ్రహాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్‌ అందించాలన్నది లక్ష్యం. వన్‌వెబ్‌ సంస్థకు భారత్‌కు చెందిన భారతి గ్లోబల్‌ ఫ్రాన్స్‌కు చెందిన యూటెల్‌శాట్‌ బ్రిటన్‌ ప్రభుత్వానికి జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకుకు వాటాలున్నాయి. ఉపగ్రహ ప్రయోగాల కోసం రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్‌తో వన్‌వెబ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఉక్రెయిన్‌ యుద్ధంతో బ్రిటన్‌ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇస్రో ద్వారా చేపట్టిన 36 ఉపగ్రహాల ప్రయోగంతో వన్‌వెబ్‌ సంస్థ 648 ఉపగ్రహాలను ఇప్పటిదాకా ప్రయోగించినట్లయింది.