కొన్నాళ్ల తర్వాత జపాన్ అనే దేశం ఒకటి ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జపాన్ లో జనాభా అంత వేగంగా తగ్గిపోతున్నారు. ఇప్పటికే వృద్ధుల దేశంగా మారింది. జననాలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఏం చేసినా పెరగడం లేదు. దీంతో జపాన్ అదృశ్యమైపోతుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. నిజంగా జపాన్ ఇంత ప్రమాదంలో ఉందా ? జనాభా తగ్గుదల సమస్యకు పరిష్కారం ఉండదా ?
జపాన్‌లో జనాభా వేగంగా క్షీణిస్తోంది. జననాల రేటు తీవ్రంగా తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. జననాల రేటు క్షీణించడాన్ని తగ్గించకపోతే జపాన్ అదృశ్యమైపోతుందని స్వయంగా ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్ లో జనాభా ఊహించనంతగా తగ్గిపోతోంది. జననాల రేటు పడిపోతోంది. జపాన్ జనాభా 123.9 మిలియన్లు. గత ఏడాది జననాలు 727277 మాత్రమే. ఈ డేటాను ఆ దేశ ఆరోగ్య, ఉపాధి, సంక్షేమ శాఖ విడుదల చేసింది. జపాన్ ఫెర్టిలిటీ రేట్ 1.26 నుంచి ఇప్పుడు 1.20 కి పడిపోయింది. జపాన్ జనాభా నిలకడగా ఉండాలంటే ఫెర్టిలిటీ రేట్ 2.1 గా ఉండాలి. జననాల సంఖ్య కన్నా మరణాల సంఖ్య రెట్టింపుగా నమోదైంది. 2022లో 8 లక్షల జననాలు రికార్డయ్యాయి. అదే సమయంలో 15.8 లక్షల మరణాలు నమోదయ్యాయి. అంటే పుట్టిన వారి కన్నా చనిపోయిన వారు రెండింతలు. ఇదే కొనసాగుతోంది. అందుకే జపాన్ అదృశ్యమైపోతుందని ఆ దేశ పాలకులు ఆందోళన చెందుతున్నారు.
జపాన్ లో పనిచేసే వయస్సు జనాభా కూడా తగ్గిపోతోంది. అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గిపోతున్నాయి. గత ఏడాది తో పోల్చితే ఈ ఏడాది పెళ్ళిళ్లు 30 వేలు తగ్గిపోయాయి. జనాభా తగ్గిపోతున్న విషయాన్ని జపాన్ లోని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. జనాభాను పెంచడానికి జపాన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. గవర్నమెంట్ పెళ్లిలను ప్రోత్సహించేందుకు డేటింగ్ యాప్ ను కూడా తేబోతోంది. అది ఇప్పుడు పరీక్షలో ఉంది. యాప్ ద్వారా వర్క్-లైఫ్ బ్యాలెన్స్, చైల్డ్ కేర్, హౌజింగ్ అసిస్టెన్స్, కెరీర్ కౌన్సలింగ్ వంటివి కూడా చేపడతారు. జపాన్ ప్రస్తుత జనాభా 12.4 కోట్లు. జననాల రేటు క్షీణించడాన్ని అడ్డుకోకపోతే సామాజిక భద్రతా వ్యవస్థ కుప్పకూలడంతో పాటు ఆర్ధిక ప్రగతి కూడా దెబ్బతింటుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జననాల రేటు క్షీణత ఒకవైపు కలవరపెడుతుంటే మరోవైపు వృద్ధుల జనాభా మరో 29 శాతం దాకా పెరిగింది. జననాల రేటు క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు జపాన్ ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేయనుందని తెలుస్తోంది.
టెక్నాలజీ పరంగానే కాకుండా శాంతియుతమైన జీవితం గడిపే దేశంగా జపాన్‌కు పేరుంది. అదే సమయంలో మూడో అతి పెద్ద ఆర్ధిక శక్తి కూడా. అయినా అక్కడి ప్రజలు తమ జనాభాను వృద్ధి చేయడానికి ఆసక్తి చూపిండం లేదు. నగరాలకు నగరాలు ఖాళీ అయిపోతున్నాయి. జపాన్‌లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య 90 లక్షలకు చేరుకుంది. నివాస ఆస్తులలో 14 శాతం ఖాళీగా ఉన్నాయని వెల్లడైంది. జనం లేని ఇళ్లు గణనీయంగా పెరగడానికి జపాన్ జనాభా తగ్గడమే కారణం. జనం లేకుండా చాలా రోజులుగా వదిలేసిన పాడుబడిన ఇళ్లను జపాన్‌లో “అకియా” అని పిలుస్తారు. ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఇళ్లు కనిపించేవి. కానీ ఇప్పుడు టోక్యో, క్యోటో వంటి పెద్ద జపనీస్ నగరాల్లో ఇటువంటి ఇళ్ళు కనిపిస్తున్నాయి. అవసరానికి మించి ఎక్కువ ఇళ్లను నిర్మించడం వల్ల తలెత్తిన సమస్య కాదు. నివాస ప్రాంతాల్లో సరిపడా జనాభా లేకపోవడమే సమస్య అని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నయి.
జపాన్‌లో తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా చాలా మందికి వారసులు లేకపోవడంతో ఆస్తుల బదిలీ జరగడం లేదు. వారసత్వంగా ఆస్తులు పొందిన గ్రామీణ యువతరంలో చాలా మంది నగరాలకు వలస వెళ్లి.. తిరిగి రావడానికి ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితిని మార్చడానికి జపాన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది. దేశంలోకి వచ్చే వలసల విషయంలో జపాన్ ఇదివరకు బాగా జాగ్రత్తగా వ్యవహరించేది. ఈ సమస్యల దృష్ట్యా గత కొన్నేళ్లలో మాత్రం నిబంధనలు కాస్త సడలించింది. అయినా ప్రయోజనం ఉండటం లేదు.
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. ఈ సూత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న దేశాలు బాగానే ఉన్నాయి.. కానీ అతిగా ఊహించుకుని జనాభాను నియంత్రించిన దేశాలు మాత్రం ఉనికి సమస్యల్లో పడ్డాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…