మీ వెనకాల మేముంటాం ధైర్యంగా రష్యాని కొట్టేయండి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ ను రెచ్చగొడుతున్నారు. మా జోలికి వస్తే అణు బాంబుల ప్రయోగానికి కూడా మేం వెనుకాడం యుద్ధానికి కారణం పశ్చిమ దేశాల కుట్రే అని పుతిన్ గర్జిస్తున్నారు. రష్యాకి చైనా ఆయుధాలు అందిస్తే మాత్రం ప్రపంచమే భస్మీపటలం అయిపోతుంది అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హెచ్చరిస్తున్నారు. యుద్ధం మొదలై ఏడాది పూర్తి అయినా ప్రపంచంలోని ఏ దేశమూ కూడా శాంతికోసం ప్రయత్నించకపోగా ఒకరినొకరు రెచ్చగొట్టేలా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేలా వ్యవహరిస్తున్నాయి. ఇదే ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే దారిన పోయేవాళ్లు ఏం చేస్తారు ఇద్దరినీ పక్కకు జరిపి దెబ్బలాట ఆపేందుకు ప్రయత్నిస్తారు. ఇద్దరికి నచ్చచెప్పి గొడవ పడకుండా చేస్తారు. అటువంటిది యావత్ ప్రపంచాన్నీ సంక్షోభంలోకి నెట్టేసేలా ఉక్రెయిన్ లో సాగుతోన్న యుద్ధ క్రీడను ఆపాల్సిన అగ్రరాజ్యలు మరింత మంట రాజేసేలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. రిఫరీలా వ్యవహరించాల్సిన ఐక్యరాజ్యసమితి ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. యుద్ధం కన్నా అది మిగిల్చే విషాదం కన్నా కూడా భయంకరమైనది ఈ నిర్లక్ష్యం. ఎంతో దురదృష్టకరమైనది ఈ బాధ్యతారాహిత్యం. సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 24న రష్యా హఠాత్తుగా ఉక్రెయిన్ పై మెరుపుదాడికి దిగింది. అప్పట్నుంచీ యుద్ధం సాగుతూనే ఉంది. నిజానికది యుద్ధం కాదు విధ్వంసం మానవ హననం మారణహోమం. నిరాటంకంగా సాగిపోతూ వస్తోంది.
ఎవ్వరూ దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయడం లేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో అత్యంత రహస్యంగా పర్యటించారు. ఉక్రెయిన్ ఆర్మీని భుజం తట్టి మెచ్చుకున్నారు. సెభాష్ యుద్ధం బాగా చేస్తున్నారు. అలాగే చేయండి. మీకు కావల్సిన ఆయుధాలు మేం అందిస్తాం. రష్యాని చితకబాదేయండి అని సలహా ఇచ్చారు. ప్రపంచానికి పెద్దన్నగా చెలామణీ అవుతోన్న అమెరికా అధ్యక్షుడు ఇవ్వాల్సిన సలహానా ఇది. యుద్ధాన్ని ఎలా ఆపాలో చూస్తారా లేక ఇంకా గట్టిగా యుద్ధం చేయండి ఇంకా ఎక్కువ శవాలు పోగేయండి. ఇప్పుడు పారుతోన్న నెత్తుటేరులు సరిపోవు. ఇంకా ఇంకా నెత్తురు పారాలి అని యుద్ధోన్మాదాన్ని ఎగదోస్తారా. ఏం చేయాలి ఏం చేశారు ఎంత సిగ్గుమాలిన వ్యవహారం ఇది ఎంత బరితెగింపు వ్యాఖ్యలివి ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఇవి.
బైడెన్ ఉక్రెయిన్ లో షో పుటప్ చేస్తున్న తరుణంలోనే రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ అమెరికాని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రసంగం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని రాజేసిందే పశ్చిమ దేశాలని పుతిన్ ఆరోపించారు. అగ్రరాజ్యం అమెరికా దురాలోచనతోనే ఇదంతా జరిగిందన్నారు. అమెరికా దుర్మార్గాలకు నిరసనగా 2010లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంతో రష్యా ఓ ఒప్పందం చేసుకుంది. వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందంగా దీన్ని అభివర్ణిస్తారు. ఆ ఒప్పందం నుండి తాము వైదొలగుతున్నట్లు పుతిన్ ఇపుడు ప్రకటించారు. అమెరికా నాటో దురాక్రమణకు తెగబడి మరింతగా ఉక్రెయిన్ ను రెచ్చగొట్టి యుద్ధాన్ని పెద్దది చేయాలనుకుంటే అవసరమైతే అణ్వాయుధాలకు కూడా వెనుకాడబోమని పుతిన్ హెచ్చరించారు. ఒక పక్క జో బైడెన్ ఏమో ఉక్రెయిన్ కు భరోసా ఇచ్చి యుద్ధాన్ని పెంచుతారు. మరో పక్క అమెరికాకి వార్నింగ్ ఇచ్చినట్లు ఇచ్చి రష్యా యుద్ధాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా చైనాకు ఓ విన్నపం లాంటి వార్నింగ్ ఇచ్చారు.
అన్ని రంగాల్లోనూ అమెరికాతో పోటీ పడుతోన్న చైనా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికాకు దీటుగా రష్యా కు అండగా నిలబడాలని అనుకుంటోంది. ఒక వేళ చైనా కనక రష్యాకి ఆయుధాలు అందిస్తే మూడో ప్రపంచ యుద్ధానికి బాధ్యులు అవుతారని జెలెన్ స్కీ అంటున్నారు. దయ చేసి రష్యాకి దూరంగా ఉండండి అని చైనాను వేడుకున్నారు జెలెన్ స్కీ.
ఉక్రెయిన్ లో పర్యటన అనంతరం బైడెన్ పోలండ్ రాజధాని వార్సాలో ఉక్రెయిన్ శరణార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రష్యాపై విరుచుకు పడ్డారు బైడెన్. మాతో చేసుకున్న న్యూ స్టార్ట్ అణుఒప్పందం నుండి వైదొలగాలని నిర్ణయించి పుతిన్ చాలా పెద్ద తప్పు చేశారని బైడెన్ వ్యాఖ్యానించారు. నాటో భాగస్వామ్య దేశాల నేతలతోనూ భేటీ అయిన బైడెన్ ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఉక్రెయిన్ కు అమెరికా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా విజయం సాధిస్తే ఆ తర్వాత తమపైనా దాడులకు దిగే ప్రమాదం ఉందని బుకారెస్టు దేశాలు భయపడుతున్నాయి.
అయితే ఉక్రెయిన్ పై రష్యా విజయం సాధించే ప్రసక్తే లేదని బైడెన్ కొట్టి పారేశారు. ఇక్కడ బైడెన్ ఇలా ఉంటే అక్కడ పుతిన్ యుద్ధానికి ఏడాది పూర్తియిన సందర్బాన్ని పురస్కరించుకుని ఏకంగా పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. అది కూడా మరింత హింసను పెంచేందుకే తప్ప శాంతి కుసుమాలు వికసించేందుకు కాదు. నిజానికి ఏడాది క్రితమే రష్యా ఉక్రెయిన్ పై దురాక్రమణకు ఓ అడుగు ముందుకు వేసినపుడే ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ కలిపి దాన్ని ఆపాలి. శాంతి చర్చలకు చొరవ తీసుకుని యుద్ధం ముందుకు సాగకుండా అడ్డుకోవాలి. వేలాది మంది ప్రాణాలు పోకుండా కాపాడాలి. కానీ ఏ దేశమూ అటువంటి ప్రయత్నమే చేయకపోవడం దుర్మార్గమే అంటున్నారు మేథావులు. ఏడాది తర్వాత కూడా అగ్రరాజ్యాలు యుద్ధాన్ని ఇంకెంత ఉధృతం చేయాలనే చూస్తున్నాయి తప్ప ఇప్పటికైనా ఆపేద్దాం అన్న ఆలోచన ఎవ్వరిలోనూ లేకుండా పోయిందని రక్షణ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.
అందరూ కలిసి ప్రపంచాన్ని రెండుగా చీల్చేద్దామని చూస్తున్నారు. చైనా అమెరికా చెరో చీలిక వైపు నిలబడి మూడో ప్రపంచ యుద్ధాన్ని రాజేసి ఆ మంటల్లో చలికాచుకోవాలని చూస్తున్నాయని మేథావులు దుయ్యబడుతున్నారు. ఈ విధ్వంసాన్ని ఇకనైనా ఆపేయాలని వారు కోరుతున్నారు.
నాటో కూటమిని తూర్పు దిశగా విస్తరించాలన్న అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష ఉక్రెయిన్ లో చిచ్చు రాజేసింది.
తమ పొరుగునే ఉన్న ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేర్చుకోవడం ద్వారా ఉక్రెయిన్ లో నాటో దళాలను మోహరించాలని అమెరికా చూస్తోందని రష్యా మండి పడింది. అది తమ భద్రతకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని అంచనా వేసింది. తమని తాము రక్షించుకోడానికి ఏదో ఒకటి చేయక తప్పదనుకున్న రష్యా నాటో కూటమిలో చేరద్దని ఉక్రెయిన్ ను వారించింది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాము నాటో కూటమిలో చేరి తీరతామని పట్టుబట్టారు. జెలెన్ స్కీ వెనక అమెరికా కుయుక్తులు ఉన్నాయని కనిపెట్టిన రష్యా ఉక్రెయిన్ లో రష్యన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రష్యన్లపై మారణహోమాలు పెరిగిపోతున్నాయన్న సాకుతో ఉక్రెయిన్ పై యుద్ధానికి కాలు దువ్వింది.
ఏడాది క్రితం ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై విరుచుకు పడింది.
ఉక్రెయిన్ ను నాటో చేరనీయకుండా అడ్డుపడుతోన్న రష్యాను దెబ్బతీయాలనుకున్న అమెరికా ఉక్రెయిన్ కు అండగా ఉంటామని ప్రకటించింది. ప్రకటించిందే తప్ప ఉక్రెయిన్ కు అండగా నాటో దళాలను పంపలేదు. చాలా కాలం అసలు ఆయుధాలు కూడా పంపలేదు. దాంతో ఉక్రెయిన్ ఉక్రోషంతో గొడవ చేయడంతో నెమ్మది నెమ్మదిగా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయడం మొదలు పెట్టింది అమెరికా. అమెరికాతో పాటు నాటో కూటమిలోని యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలిచాయి. రష్యాను ఆర్ధికంగానూ దెబ్బతీయాలనుకున్న అమెరికా రష్యా నుండి ఎటువంటి సరుకులు దిగుమతి చేసుకోవడానికి వీల్లేదంటూ నాటో దేశాలకు ఆంక్షలు విధించింది. అయితే దాని వల్ల యూరప్ దేశాలే ఇబ్బంది పడ్డాయి. ఇక యుద్ధం మొదలైన కొత్తలో వారం రోజుల్లో ఉక్రెయిన్ ను గుప్పెట్లోకి తెచ్చేసుకోవచ్చునని రష్యా అనుకుంది. అయితే రష్యా అంచనాలు తల్లకిందులయ్యాయి.
రోజులు గడిచినా ఉక్రెయిన్ దారికి రాలేదు. దాంతో రష్యన్ ఆర్మీలో అసహనం పెరిగి ఉక్రెయిన్ పై దుర్మార్గపు దాడులు పెంచింది పౌరులను కూడా చూడకుండా హతమార్చింది. గగన తలం నుంచి బాంబుల వర్షం కురిపించింది. క్షిపణి దాడులతో విధ్వంసాలు సృష్టించింది. నగరాలకు నగరాలను భస్మీపటలాలు చేసింది. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు సర్వనాశనం అయ్యాయి. లక్షలాది భవంతులు శిధిలాలు అయ్యాయి. యుద్ధం తాకిడితో ఉక్రెయిన్ నుండి 80 లక్షల మంది పొరుగు దేశాలకు తరలిపోయి తలదాచుకున్నారు. వేలాది మంది పౌరులు చనిపోయారు. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు. ఉక్రెయిన్ ఆర్మీ ఎదురు దాడిలో వేల సంఖ్యలో రష్యా సైనికులూ ప్రాణాలు కోల్పోయారు.
రష్యా ఆర్మీ దాడులను తట్టుకుంటూనే ఉక్రెయిన్ ఆర్మీ రెట్టించిన ఉత్సాహంతో భీకర పోరు చేసింది. ఈ క్రమంలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి ఉక్రెయిన్ ఆర్మీ తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది.
ఇలా ఏడాది పాటు యుద్ధం సాగుతూనే ఉంది. యుద్ధం ముసుగులో విధ్వంసం సాగుతూ ఉంది. యుద్ధం ప్రత్యక్షంగా ఉక్రెయిన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. యుద్ధానికి ముందుకు ఉరికి రష్యా కూడా భారీ మూల్యమే చెల్లించుకుంది.
తమ సైన్యాన్ని కోల్పోవడమే కాకుండా కోట్ల విలువ చేసే ఆయుధాలను యుద్ధంలో కోల్పోయింది. యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో ప్రజలు ఆందోళనలకు దిగారు. రష్యన్ ఆర్మీలోనూ అసంతృప్తి రగిలింది. పుతిన్ పై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. రష్యాపై ఆంక్షలు విధించడం ద్వారా యూరప్ దేశాలూ దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి రష్యా నుండి గ్యాస్ దిగుమతి చేసుకోనిదే రోజు గడవని జర్మనీ, ఫ్రాన్స్, యూకేలకు చుక్కలు కనిపించాయి. ఎందుకంటే రష్యానుండి గ్యాస్ దిగుమతికి చాలా తక్కువ ఖర్చుతోనే పని అయిపోయేది. రష్యా గ్యాస్ వద్దు అనుకుంటే అమెరికా నుండి గ్యాస్ కొనుక్కోవాలి అది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎక్కువ కాలం అలా చేస్తే యూరప్ దేశల ఆర్ధిక పరిస్థితి తల్లకిందులయ్యే ప్రమాదం ఉంది. గ్యాస్ తో పాటు యూరప్ దేశాలకు అత్యవసరమైన గోధుమలను రష్యా, ఉక్రెయిన్ ప్రాంతాల నుండే దిగుమతి చేసుకునేవి. యుద్దం కారణంగా ఉక్రెయిన్ లో గోధుమల సాగుపై ప్రభావం పడింది.
అయితే రష్యాలో ఆ ఇబ్బంది లేదు. కాకపోతే రష్యాపై ఆంక్షల కారణంగా యూరప్ దేశాల్లో గోధుమలకు కటకటలాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాను ఇబ్బంది పెట్టాలనుకుని నాటో దేశాలు తామే ఇబ్బందుల్లో పడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాయి. యుద్ధానికి ముందు కోవిడ్ కారణంగా చితికి పోయి ఉన్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలు ఉక్రెయిన్ వార్ తో మరింత దెబ్బతింది.అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మాంద్యం భయాలకు రష్యా ఉక్రెయిన్ యుద్ధమే ప్రధాన కారణం అంటున్నారు ఆర్థిక నిపుణులు. యుద్ధాన్ని తమ ఈగోల కోసమే పెంచి పోషిస్తున్నాయి అమెరికా రష్యాలు. యుద్ధంతో ఆయుధ వ్యాపారం పెంచుకోవచ్చునన్నది అమెరికా స్వార్ధం. అమెరికాకు చెక్ చెప్పడమే రష్యా లక్ష్యం. అంతే తప్ప ప్రపంచం ప్రశాంతంగా ఉండాలని కానీ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కానీ ఈ అగ్రరాజ్యాలకు లేనే లేనట్లుందని మేథావులు అంటున్నారు. వీళ్లు సరే మరి ఐక్యరాజ్యసమితి ఏం చేస్తున్నట్లు ఏడాదిగా యుద్ధం సాగుతూ ఉంటే ఏడాదిగా నెత్తురోడుతూఉంటే ఏడాదిగా ఒక దేశం గాయాల వనంగా మారిపోయి మూలుగుతూ ఉంటే ఐక్యరాజ్యసమితి ఏం చేస్తోందసలు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.