తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ పై పీకల దాకా ఉన్న విద్వేషాన్ని వెళ్లగక్కారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణా ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. పార్టీ పరాజయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు విర్రవీగితే అలాగే ఉంటుందంటూ ఏ మాత్రం హుందాతనం లేకుండా చౌకబారు వ్యాఖ్య చేశారు. అది కూడా రాజకీయాలు మాట్లాడకూడని చోట ఈ ప్రస్తావన తెచ్చి తన అల్పత్వాన్ని చాటుకున్నారు. అసలు కేసీయార్ పై చంద్రబాబుకు ఇంతటి ద్వేషం ఎందుకు? అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఓటమికి సవాలక్ష కారణాలుంటాయి. అధికారం కోల్పోయినంత మాత్రాన రాజకీయాల్లో ఓడినట్లు కాదు. అయినా చంద్రబాబు బి.ఆర్.ఎస్. ఓటమిని హేళన చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
ఏ వేదికని అయినా రాజకీయాలకోసం వాడుకోవడం చంద్రబాబుకు అలవాటు. తన పెద్ద బావ నందమూరి హరికృష్ణ హఠాన్మరణం చెందినపుడు కుటుంబ సభ్యులను పరామర్శించడానికని వచ్చిన చంద్రబాబు నాయుడు అప్పటి కేసీయార్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నం చేసి విమర్శల పాలయ్యారు. ఆయన వైఖరిని చూసి అప్పట్లో అందరూ ఏవగించుకున్నారు.అదే విధంగా ఇపుడు ఏపీలో తుపాను ప్రభావిత ప్రాంతంలో బాధిత రైతులను పరామర్శిస్తానని చెప్పి వెళ్లిన చంద్రబాబు రైతుల అంశాన్ని పక్కన పెట్టి రాజకీయాలు మాట్లాడారు. ఎవరైనా విర్రవీగితే ఏమవుతుందో చెప్పడానికి తెలంగాణా ఎన్నికలే నిదర్శనమని తనలోని విద్వేషాన్ని వెళ్లగక్కారు చంద్రబాబు.
ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాకపోతే 119 స్థానాలున్న తెలంగాణాలో 39 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే చంద్రబాబు మాత్రం కేసీయార్ అధికారాన్ని కోల్పోవడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైనా ఓడిపోతే అంత విద్వేషం అవసరమా అని రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. అయితే ఈ ద్వేషానికి కారణాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.2018 లో తెలంగాణా ఎన్నికల సమయంలో టి.ఆర్.ఎస్. తో పొత్తు కోసం ప్రయత్నించారు చంద్రబాబు. అయితే తాము ఎవరితోనూ పొత్తు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీయార్ భావించారు. అందుకే టి.ఆర్.ఎస్. అన్ని స్థానాలకు ఒంటరిగా బరిలో దిగింది.
2018 లో టిడిపితో పొత్తుకు కేసీయార్ సిద్ధంగా లేకపోవడంతో టి.ఆర్.ఎస్. ను ఓడిస్తానని శపథం చేసి కాంగ్రెస్ , కమ్యూనిస్టులతో కలిసి మహాకూటమి పెట్టారు చంద్రబాబు . అందరూ కలిసి ఎన్నికల బరిలో దిగారు. అయితే తెలంగాణా ప్రజలు కేసీయార్ కే బ్రహ్మరథం పట్టి అధికారాన్ని అప్పగించారు.అది చంద్రబాబులో ఉక్రోషాన్ని పెంచింది. అన్ని పార్టీలు కలిసినా కేసీయార్ ను ఓడించలేకపోయామన్న ఉక్రోషంతో ఆయన రగిలిపోయారు. తర్వాత తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీయార్ పార్టీని దెబ్బతీసేందుకు ఓటుకు నోటు వ్యవహారానికి తెరదీశారు చంద్రబాబు. దాన్ని తెలంగాణా ఏసీబీ పోలీసులు పకడ్బందీగా పట్టుకుని చంద్రబాబును రెడ్ హ్యాండెడ్ గా బోనులో నిలబెట్టారు. దీంతో చంద్రబాబుకు ఉన్న పిసరంత ప్రతిష్ఠ కూడా మసకబారిపోయింది.
ఓటుకు నోటు కేసు ఇపుడు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. తనపై కేసు పెట్టించారన్న కోపం చంద్రబాబులో ద్వేషాన్ని మరింతగా పెంచింది. ఈ కారణాల వల్లనే చంద్రబాబు నాయుడు తెలంగాణా ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. అధికారంలోకి రాకపోవడాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అదే విషయాన్ని ఏపీ లో తుపాను తాకిడి ప్రాంత రైతుల ముందు ప్రస్తావించారు. ఒక్కటి మాత్రం నిజం. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగితే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడికి 2019 ఎన్నికల్లో బాగా అనుభవంలోకి వచ్చిందని రాజకీయ పండితులు అంటున్నారు..175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు పార్టీకి వచ్చినవి కేవలం 23 స్థానాలు. నిజానికి తెలంగాణాలో బి.ఆర్.ఎస్. కు ఇంతటి ఘోర పరాజయం ఏమీ రాలేదు.
119 నియోజక వర్గాలున్న తెలంగాణాలో కేసీయార్ పార్టీకి 39 స్థానాలు ఆయన మిత్ర పక్షం అయిన మజ్లిస్ కు 7 స్థానాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు 2019లో ఘోర పరాజయం పొందినపుడు కేసీయార్ హేళన చేయలేదు. కానీ చంద్రబాబు మాత్రం తనకన్నా ఎన్నో రెట్లు గొప్ప విజయాలు సాధించిన కేసీయార్ పై మాత్రం విద్వేషం వెళ్లగక్కడం ద్వారా తన కుసంస్కారాన్ని చాటుకున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బి.ఆర్.ఎస్.ను ఓడించాలన్న లక్ష్యాన్ని కూడా చంద్రబాబు సాధించలేకపోయారు. టిడిపి బలంగాఉన్న నియోజక వర్గాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడమే దానికి నిదర్శనం. అయితే నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మరీ ఇంత నేలబారుగా ఆలోచన చేయడం కరెక్ట్ కాదంటున్నారు మేథావులు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…