రాజీనామాతో కేజ్రీవాల్ కొత్త గేమ్…

By KTV Telugu On 16 September, 2024
image

KTV TELUGU :-

జైలు నుంచి బెయిల్ పై విడుదలైనదే తడవుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొత్త గేమ్ కు తెరతీశారు.ప్రధాని మోదీ, అమిత్ షా వేస్తున్న పాచికలకు ఎదురు పాచికగా ఆయన రాజీనామా అస్త్రాన్ని బయటకు తీశారు. మరో రెండు రోజుల్లో ఢిల్లీ సీఎం పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించి… అందరినీ ఆశ్చర్యపరిచారు. జైలులో ఉన్నప్పుడే రాజీనామా చేయని ఒక నాయకుడు.. బయటకు వచ్చిందే తడవుగా అలా చేస్తున్నారేమిటని ఆశ్చర్యపడిన వాళ్లూ ఉన్నారు. కాకపోతే ఎప్పటికప్పుడు కొత్త గేములు ఆడే అలవాటున్న కేజ్రీవాల్ కు ఇది మామూలు విషయమని జనం సరిపెట్టుకున్నారు. ఆప్‌ని ముక్కలు చేసేందుకే తనను జైలుకి పంపారని కేజ్రీవాల్ అన్నారు. ఆప్‌లో చీలిక తెచ్చి, ఢిల్లీ గద్దెనక్కాలనుకున్నారన్న కేజ్రీవాల్, వాళ్ల ఆటలు సాగలేదు అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే తాను ఇన్నాళ్లూ రాజీనామా చెయ్యలేదన్న కేజ్రీవాల్.. తాను సీఎంగా ఎందుకు కొనసాగకూడదని సుప్రీంకోర్టే ప్రశ్నించిందని తెలిపారు.రాజీనామా తర్వాత తిరిగి ప్రజల్లోకి వెళ్తానన్న కేజ్రీవాల్.. ఇంటింటికీ వెళ్లి.. ప్రజా తీర్పు కోరతాను అన్నారు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అన్న కేజ్రీవాల్.. ప్రజలు తనను తిరిగి గెలిపిస్తే, తాను నిర్దేషినే అన్నట్లు అవుతుందనే కాంటెస్ట్‌లో మాట్లాడారు.
తాను రాజీనామా చేశాక.. ఆప్ నుంచి మరొకరు సీఎం అవుతారు అని కేజ్రీవాల్ అన్నారు. నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. అప్పటి వరకూ వేరే వ్యక్తి సీఎంగా ఉంటారనీ.. నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీతోపాటూ.. ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరపాలని కేజ్రీవాల్ కోరారు. అంటే.. నవంబర్‌లో ఢిల్లీ అసెంబ్లీని కేజ్రీవాల్ రద్దు చేసే అవకాశం ఉంది. తాను నిర్దోషిని అని నమ్మితేనే తనకు ప్రజలు ఓట్లు వెయ్యాలని కేజ్రీవాల్ అన్నారు.

బీజేపీ తేరుకునే లోపే దెబ్బకొట్టాలన్నది కేజ్రీవాల్ ప్లాన్. వచ్చే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో అప్పుడైతే తమకు అంతగా సింపథీ రాదని కేజ్రీవాల్ అనుమానిస్తున్నారు. అందుకే గుక్కతిప్పుకోనివ్వకుండా నవంబరులోనే ఎన్నికలు జరగనిస్తే గెలుపు ఖాయమని, అప్పుడు బీజేపీ తాము వెక్కిరించే వీలు కూడా ఉంటుందని కేజ్రీవాల్ విశ్వసిస్తున్నారు. ఇప్పుడయితే ఆప్ కార్యకర్తలు కూడా వేడిమీద ఉన్నారని, నవంబరు ఎన్నికలకు బాగా పనిచేస్తారని ఆయన అంచనా వేసుకుంటున్నారు. తాను జైలు నుంచి విడుదలైనప్పుడు వచ్చిన జనమే అందుకు ఉదాహరణ అని లెక్కలేసుకుంటున్నారు. పైగా ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా తనకు ఎదురు లేకుండా ఉండాలంటే తక్షణమే ఎన్నికలు జరగాలని ఆయన కోరుకుంటున్నారు. తాను రాజీనామా చేసినప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి ఎక్కువ రోజులు ఉంటే పాతుకుపోయే అవకాశం ఉంటుందని, అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చూసుకోవాలన్నది కూడా కేజ్రీవాల్ ప్లాన్ గా కనిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో….