ఒక్కరి కోసం మూడు పార్టీలు మనసు పారేసుకున్నాయి. ఆ ఒక్కరు మాత్రం ఒక్క పార్టీకు లవ్ యూ చెప్పారు. చాలా మంది సూపర్ స్టార్లు ఉండగా ఒక్కరి కోసమే రెండు జాతీయ పార్టీలు ఓ ప్రాంతీయ పార్టీ వెంటపడ్డం విశేషం. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరు ఏంటి ఆయనలో ఉన్న అంత స్పెషాలిటీ.. కర్నాటక లో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ బిజెపిలతో పాటు జేడీఎస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోడానికి ఎవరూ సిద్దంగా లేరు. ప్రస్తుత ఎన్నికల్లో ఒక వ్యక్తి తమ పార్టీ తరపున ప్రచారం చేస్తే తమకిక తిరుగే ఉండదని మూడు పార్టీలూ భావిస్తున్నాయి. చాలా కాలంగా ఈ మూడు పార్టీలు కూడా ఆ ఒక్కరితో వన్ సైడ్ లవ్ స్టోరీ నడిపాయి కూడా. కాకపోతే ఫైనల్ గా ఆ ఒక్కరు బిజెపి తరపున ప్రచారం చేయడానికి సై అని మిగతా రెండు పార్టీల మనసులు దెబ్బకొట్టాడు.
కన్నడ నాట విలక్షణ నటుడిగా పాపులర్ అయిన కిచ్చా సుదీప్ ఇపుడు మోస్ట్ వాంటెడ్ స్టార్ అయిపోయాడు. నిర్మాతలకూ హీరోయిన్లకే కాదు రాజకీయ పార్టీలకు కూడా కిచ్చా సుదీపే కావాలనిపిస్తోంది. కర్నాటక ఎన్నికల ప్రచారంలో కిచ్చా సుదీప్ చేత ప్రచారం చేయించుకోవాలని కాంగ్రెస్ బిజెపి జేడీఎస్ లు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఎవ్వరికీ ఏ భరోసా ఇవ్వని సుదీప్ చివరి నిముషంలో బిజెపికి సై అన్నాడు. కర్నాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన కిచ్చా సుదీప్ వాల్మీకి నాయక సామాజిక వర్గానికి చెందిన వారు. సినీ రంగంలో అడుగు పెట్టి ఇంచుమించు మూడు దశాబ్దాలు అవుతోంది. గాడ్ ఫాదర్స్ లేకపోయినా స్వశక్తితో ఎదుగుతూ వచ్చిన కిచ్చా సూపర్ స్టార్ స్థాయిని అందుకున్నాడు. కన్నడ నాటే కాదు ఇతర భాషల్లోనూ మెరుస్తున్నాడు. తెలుగులో ఈగ సినిమాలో అద్భుత నటనతో తెలుగు వారి మనసులు దోచుకున్నాడు కిచ్చా. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి రాజమౌళి దర్శకత్వంలోని బాహుబలి సినిమాల్లోనూ అదరగొట్టాడు. కర్నాటకలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి 31 నియోజక వర్గాలు రిజర్వు అయి ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో కిచ్చా సుదీప్ కు తిరుగులేని ఫ్యాన్ ఫేర్ ఉంది. అందుకే కిచ్చా తమ జెండా పట్టుకుంటే చాలు ఓట్ల వర్షం కురుస్తుందని అన్ని పార్టీలూ నమ్ముతున్నాయి.
చాలా కాలం క్రితమే కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డి.కె.శికుమార్ స్వయంగా కిచ్చా సుదీప్ ను పిలిపించుకుని చాలా సేపు చర్చించారు. అయితే ఏం మాట్లాడారో బయటకు చెప్పలేదు కానీ విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం కాంగ్రెస్ తరపున ఎక్కడ కావాలంటే అక్కడ టికెట్ ఇస్తామని సిద్ధరామయ్య ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ ఆఫర్ ని కిచ్చా సుదీప్ సున్నితంగానే తిరస్కరించారట. సినీ రంగంలో ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉందని రాజకీయాలపై ఇప్పుడే ఆసక్తి లేదని కిచ్చా చెప్పారట. 2018 ఎన్నికల్లో జేడీఎస్ నేత కుమార స్వామి కూడా కిచ్చా సుదీప్ కు ఎక్కడి నుండి టికెట్ కావాలి అని నేరుగానే అడిగారట. అప్పుడూ కిచ్చా సుదీప్ నవ్వేసి ఓ దండం పెట్టి లేదు సార్ నేను రాజకీయాల్లోకి రాలేను అని బదులిచ్చారట. తాజాగా బిజెపి నేతలు కిచ్చా సుదీప్ ను సంప్రదించి తమ పార్టీ తరపున ప్రచారం చేయాలని కోరారట. సుదీర్ఘంగా ఆలోచించిన కిచ్చా సుదీప్ ఈ సారి మాత్రం బిజెపి తరపున ప్రచారం చేయడానికి ఒప్పుకున్నారు. దీంతో బిజెపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఒక్క కిచ్చా మన వైపు ఉంటే చాలు ఎన్నికల్లో విజయం మనదే అని కమలనాధులు ఎగిరి గంతేస్తున్నారట.
కిచ్చా సుదీప్ తెలుగు సినిమాల్లోనూ నటించి తెలుగు ప్రేక్షకులకూ దగ్గర కావడంతో కర్నాటకలోని తెలుగు ప్రజలు ఉండే ప్రాంతాల్లోనూ ప్రచారం చేయించుకోవచ్చునని బిజెపి వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఎందుకంటే కర్నాటకలో 12 జిల్లాల్లో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 60కి పైగా నియోజక వర్గాల్లో తెలుగు ఓటర్లే గెలుపు ఓటములను నిర్దేశిస్తారు. అందుకే టాలీవుడ్ నటులతో పాటు కిచ్చా సుదీప్ ను కూడా తెలుగు ఓటర్లు ఉండే ప్రాంతాల్లో ప్రచారంలో వినియోగించుకోవాలని బిజెపి భావిస్తోంది. కిచ్చా బిజెపి వైపు మొగ్గు చూపడంతో కాంగ్రెస్ జేడీఎస్ శిబిరాల్లో కాస్త నిరాశ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కిచ్చా సుదీప్ మాత్రం తాను ఇప్పటికీ రాజకీయాల్లోకి రావడం లేదని ఎక్కడా తాను పోటీ చేయబోవడం లేదని అంటున్నారు. కేవలం ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొంటున్నానని ఆయన వివరిస్తున్నారు.