ఈ పురుషాధిక్య సమాజంలో ఆడపిల్లలకు అడుగడుగునా గండమే. ఆరు నెలల పసిగుడ్డు నుంచి అరవై ఏళ్ల బామ్మ పై సైతం అత్యాచారాలకు తెగబడే కీచుకులు సర్వత్రా వ్యాపించి ఉన్నారు. చదువుల కోసం ఉద్యోగాల కోసం బయటకు వెళ్లే అమ్మాయిలు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆ తల్లిదండ్రులకు స్థిమితం ఉండదు. అయితే ఇంట్లో కూడా రక్షణ లేకపోతే ఆ ఆడపిల్ల పరిస్థితి ఏమిటి. అండగా ఉండాల్సిన కన్నతండ్రే కూతురిపై కన్నేస్తే ఎవరికి చెప్పుకుంటుంది. ఇప్పటికీ అక్కడక్కడా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే పరువు పోతుందనే భయంతో చాలామంది బయటపడరు. అయితే పసి వయసులో కలిగిన ఆ గాయం మాత్రం వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.
ఇటీవల ప్రముఖ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ కన్న తండ్రి చేతిలో తాను అనుభవంచిన నరకాన్ని బయటపెట్టారు. 8ఏళ్ల వయసులోనే తాను తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ఆమె చెప్పారు. ఆ వయసులో ఆయనను ఎదిరించే ధైర్యం లేక కుమిలిపోయానని వివరించారు. నేను ఎదురుతిరిగితే ఆ కోపం మా అమ్మపై నా ముగ్గురు అన్నయ్యలపై చూపిస్తారని భయమేసేది. అందుకే అన్నీ మౌనంగా భరించాను అని చెప్పారు ఖుష్బు. తనకు 15 ఏళ్ల వయసు వచ్చాక తండ్రిని ఎదిరించడం మొదలుపెట్టానని ఆ తర్వాత ఏడాదికే ఆయన తమను వదిలేసి వెళ్లిపోయారని ఖుష్బూ తెలిపారు. తన తండ్రి భార్యాపిల్లలను కొట్టడం తన జన్మహక్కుగా భావించేవారని సొంత కూతురిని లైంగికంగా వేధించడం కూడా తనకున్న హక్కుల్లో ఒకటి అనుకునేవారని ఆమె చెప్పారు.
ఖుష్బు చెప్పిన విషయాల గురించి చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల గురించి దేశమంతటా చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలో తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అన్నారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్. తాను నాలుగో తరగతి కి వచ్చేంతవరకు తండ్రితోనే కలిసే ఉన్నామని ఆయన తనను అకారణంగా కొట్టేవారని అన్నారు స్వాతి. కొన్నిసార్లు రక్తం కూడా వచ్చేదని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఇంట్లోకి వస్తున్నారంటే వణికిపోయేదానినని ఆయన లైంగిక వేధింపులు భరించలేక చాలాసార్లు మంచం కింద దాక్కున్నానని మాలివాల్ చెప్పారు. ఇన్నేళ్ల తరువాత అయినా ఖుష్బూ మాలివాల్ కన్న తండ్రి చేతుల్లో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడం చర్చకు దారితీసింది.