రూ. లక్ష కోట్లు ఎలక్షన్స్ ! – LOK SABHA – MP ELECTIONS

By KTV Telugu On 8 April, 2024
image

KTV TELUGU :-

లోక్‌సభ ఎన్నికల   ప్రక్రియ  ప్రారంభమయింది.   దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో  హడావుడి మరో రేంజ్ లో ఉంది. దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో ఎన్నికలు నిర్వహించడం అంత సులువేమీ కాదు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణ మరింత సుదీర్ఘ ప్రక్రియ.  ఈ మొత్తం ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్న పని. వెనకా ముందు ఆలోచించకుండా కోట్ల కొద్ది గుమ్మరించేస్తాయి పార్టీలు.  అందుకే ఈ సారి అందరూ కలిసి పెట్టే ఖర్చు లక్ష కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో అయిన ఖర్చు   అక్షరాలా  55 వేల కోట్లు. అప్పట్లో Centre for Media Studies ఈ గణాంకాలు వెల్లడించింది. మరో కీలక విషయం ఏంటంటే…ఈ ఖర్చులో సగం వాటా అధికార బీజేపీదే కావడం. 2019 నాటి ఎన్నికల ఖర్చులు..అంతకు ముందుతో పోల్చితే రెట్టింపు అయిపోయాయి. ఇప్పుడు ఆ రికార్డు కూడా కచ్చితంగా బద్దలవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. కొన్ని రిపోర్ట్‌లూ ఇదే అంచనా వేస్తున్నాయి. నిజానికి ఈ ఖర్చులు “ఇంత” అయ్యాయని అధికారికంగా ఎక్కడా లెక్కలు ఉండవు. కానీ అనధికారికంగా ఈ లెక్కలు బయటకు వచ్చేస్తుంటాయి. గత 20 ఏళ్లలో 6 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 1998-2019 వరకూ లెక్కలు చూస్తే ఎన్నికల ఖర్చులు ఆరు రెట్లు పెరిగాయి. 1998 నాటికి మొత్తంగా ఎన్నికల వ్యయం  .9 వేల కోట్లుగా ఉంటే…2019 నాటికి అది .55 వేల కోట్లకు పెరిగింది. ఈ స్థాయిలో ఖర్చులు పెరగడానికి కారణం…ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగడం.

సభలకు జనాలను సమీకరించడం నుంచి వాళ్లను ఇంట్లో దిగబెట్టేంత వరకూ అన్ని ఖర్చులూ పార్టీలే భరిస్తుంటాయి. చిన్న జెండాల నుంచి భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల వరకూ ఎన్నో తయారు చేయించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ తడిసి మోపెడవుతుంది. ఇవి కాకుండా ఆఫీస్‌ల రెంట్, కరెంట్ బిల్స్‌ అదనం. ఇలా చిల్లరమల్లర అన్నీ కలుపుకుని బాగానే ఖర్చు (Lok Sabha Elections Expenditure) చేయాల్సి ఉంటుంది. ఈ వ్యయాలే లోక్‌సభ ఎన్నికల్ని అత్యంత ఖరీదైనవిగా మార్చేస్తున్నాయి. ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారీ ఇది జరిగే చర్చే అయినప్పటికీ 2019 నాటి లెక్కలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అందుకే…ఈ సారి ఆ రికార్డ్‌లు బ్రేక్ అవుతాయా అన్న ఆసక్తి మొదలైంది. ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికలు మరింత కాస్ట్‌లీగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

1951లో ఎన్నికల ఖర్చు కేవలం 10 కోట్లు. 2014 నాటికి అది 3,870 కోట్లుగా ఉంది. కానీ…2019 వచ్చే సరికి ఇది ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. 1952 నుంచి 2019 వరకూ చూస్తే ఈ వ్యయం 5 రెట్లు ఎక్కువైంది. ఈ పదేళ్లలో ఇంత మార్పు రావడానికి కారణం EVMల నిర్వహణకు అయ్యే ఖర్చు పెరగడం. 2004 నుంచే వీటి వినియోగం ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ బడ్జెట్‌లో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ వస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన పద్దులో  .1,891 కోట్లు కేటాయించింది. ఇది కూడా చాలదన్న  వాదనలు వినిపించడం వల్ల ఆ బడ్జెట్‌ని మరి కొంత పెంచింది.

ఒకప్పుడు ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండేది. అప్పుడు నియోజకవర్గాలు తక్కువగా ఉండడం వల్ల ఆ మేరకే ఖర్చులు అయ్యేవి. కానీ…ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 543 నియోజకవర్గాలకు మొత్తంగా 8 వేల మందికి పైగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. 670కి పార్టీలు పోటీలో ఉంటున్నాయి. అంటే ఆ మేరకు ఖర్చులు పెరిగినట్టేగా. Centre for Media Studies 2024 లోక్‌సభ ఎన్నికల ఖర్చులపైనా ఓ అంచనా వేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో  .55 వేల కోట్లు ఖర్చుని దాటి మరీ ఈ సారి లక్ష కోట్ల వరకూ ఖర్చయ్యే అవకాశాలున్నాయని అంటోంది. ఈ నంబర్ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నా మరీ అనూహ్యమైతే కాదు. ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఖర్చులు పెరిగాయి.

2019 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ 75 రోజుల పాటు కొనసాగింది. ఈ సారి ఎన్నికల ప్రక్రియ 80 రోజులకు పైగానే ఉంది. ఈ గడువు పెరిగే కొద్దీ ఖర్చులూ పెరుగుతున్నాయి. భారీ బహిరంగ సభలు, ర్యాలీలతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి ఉంటుంది. వీటికీ ఖర్చులు గట్టిగానే పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే…ఈ మొత్తం ఖర్చుల్లో మూడో వంతు ప్రచారానికి అవుతుండగా…మిగతాది ఓటర్లకు ఇస్తున్న తాయిలాలకు సరిపోతోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓటర్లు ఏ పార్టీ ఎంతిస్తుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఇది అనైతికం అన్న విషయం తెలియంది కాదు. కానీ అటు పార్టీలు ఇవ్వడం అలవాటు చేశాయి. ఇటు ఓటర్లూ తీసుకోడానికి అలవాటు పడిపోయారు. ఇందులో ఎవర్నీ తప్పుబట్టలేం. ఈ వాదనల సంగతి పక్కన పెడితే…మొత్తం ఎన్నికల ఖర్చుల్లో 25 వాటా వీటిదే. ఈ ఖర్చు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారుతున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి