కొత్త ఏడాదిలో అయినా తమకు మంచి ఉద్యోగం వస్తుందని యువత ఆశల పల్లకీలో ఊరేగుతూ ఉంటారు. కానీ గత ఏడాది కన్నా ఈ ఏడాది ఇంకా ఘోరంగా ఉండబోతోందని ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ట్రెండ్ నిరూపిస్తోంది. బడా కంపెనీలన్నీ రిక్రూట్‌మెంట్లు తగ్గించుకోవడమే కాదు మాస్ లే ఆఫ్స్ కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు కంపెనీ పని ప్రారంభించాయి కూడా. ఈ ఏడాది యువతకు.. టెక్ దిగ్గజ కంపెనీల్లో పని చేసే వారికి రక్తకన్నీరు ఖాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ప్రపంచంలో టెక్నాలజీ విప్లవం వచ్చిన తర్వాత భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చాయి. అలాంటి ఉద్యోగాలను అందుకోవడంలో భారత యువత ముందున్నారు. ఎత్తుపల్లాలు ఉన్నా అవకాశాల్ని అంది పుచ్చుకుంటూనే ఉన్నారు. అయితే ఈ రంగంలో ఉద్యోగ భద్రత అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. 70, 80ల్లో అప్పుడే ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న కంపెనీలు తమ ఉద్యోగులకు వీలైనంత భద్రత కల్పించేవి. ప్రాజెక్టులతో సంబంధం లేకుండా ఉద్యోగం ఎక్కడికీ పోదన్న నమ్మకాన్ని కలిగించేవారు. కానీ మారుతున్న కాలంతోపాటే ఆ కంపెనీలు మారిపోయాయి. బరువుగా మారిన వారిని భరించేందుకు సిద్ధంగా లేవు. వెంటనే వదిలించుకుంటున్నారు. ఇది క్రమంగా పెరుగుతోంది. 2023లో ఎవరూ ఊహించని విధంగా ప్రపంచం మొత్తం మీద 32 శాతం కంపెనీలు లే ఆఫ్ ప్రకటించాయి. ఈ ఏడాది ఆ సంఖ్య యాభై శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదు.
2024లో మొదటి నెల పూర్తి కాక ముందే టెక్ దిగ్గజ కంపెనీలు వేల మంది ఉద్యోగుల్ని తొలగించాయి. కంపెనీ పునర్వ్యవస్ధీకరణ, వ్యయ నియంత్రణ చర్యలు, ఆర్ధిక మందగమనం పేరుతో వందలాది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నాయి. జనవరి ప్రధమార్ధంలోనే పలు విభాగాల్లో ఆయా కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో మాస్ లేఆఫ్స్‌కు ఈ ట్రెండ్ సంకేతమని టెకీల్లో గుబులు రేగుతోంది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ జనవరిలో పలు విభాగాల్లో 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. యూట్యూబ్ 100 మంది ఉద్యోగులను తొలగించింది. అల్ఫాబెట్ గ్రూప్ పునర్వ్యవస్ధీకరణలో భాగంగా కొలువుల కోత చేపట్టినట్టు కంపెనీ వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియో డివిజన్స్‌లో ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం మాతృసంస్ధ మెటా ఈ ఏడాది ఆరంభంలోనే లేఆఫ్స్ ప్రకటించింది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం డిస్కార్డ్ 17 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇంకా అనేక కంపెనీలు ఈ జాబితాలో చేరుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల 2024 జనవరి మొదటి మూడు వారాల్లోనే బడా టెక్ కంపెనీలు 7500 ఉద్యోగాలను తొలగించాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
గత ఏడాది గూగుల్ పలు విభాగాల్లో 12,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించింది. 2024 నియామకాల తగ్గి, లే ఆఫ్స్ పెరగడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ల ప్రభావం తీవ్రంగా ఉండటమే కారణం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. “మెరుగైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, కృత్రిమ మేధను స్వీకరించడానికి ఓపెన్ మైండ్ సెట్ ను డెవలప్ చేసుకోవడం ఇప్పుడు ఉద్యోగుల ముందు ఉన్న ప్రధాన సవాలు” గా మారిందని చెబుతున్నారు. ఈ మాస్ లేఆఫ్స్‌కు ఇతర కారణఆలు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో మార్కెట్ పరిస్థితుల్ని ఎక్కువగా ఊహించుకుని కంపెనీలు పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకున్నాయి. ఇప్పుడు మ్యాన్ పవర్‌కు తగ్గ ప్రాజెక్టులు లేకపోవడంతో మెల్లగా వదిలించుకుంటున్నాయి. ఈ ట్రెండ్ ఈ ఏడాది పెరగనుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో టెక్ ఇండస్ట్రీలో ఓ ఉద్యోగం పొగొట్టుకుంటే మరో చోట పొందం అంత తేలిక కాదు. ఎందుకంటే దాదాపుగా అన్ని కంపెనీలు లే ఆఫ్ ఆలోచనల్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా రిక్రూట్ చేసుకోవాలంటే.. ఆ ఉద్యోగి తమకు అంతకు మించి ఉపయోగపడతాడన్న అంచనాకు రావాలి. అలాంటి పరిస్థితి రావాలంటే ఉద్యోగి ఎన్నో స్కిల్స్ ను ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి. నిజానికి టెక్ కంపెనీలు నిపుణులైన వారిని వదులుకునేందుకు ఇష్టపడవు. వారి కోసం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాయి. కానీ కంపెనీకి భారం అనుకున్న వారిని మాత్రం రోజుల్లోనే వదిలించుకోవడానికి వెనుకాడటం లేదు.
నిజానికి లే ఆఫ్‌లకు కంపెనీల లాభనష్టాలకు సంబంధం లేదు. ప్రధానమైన టెక్ కంపెనీల ఆదాయాలన్నీ ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. లాభాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఆదాయం లాభం వస్తుంది కదా అని.. ఆ కంపెనీలు ఉద్యోగుల్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఉద్యోగ భద్రతను తమ ప్రాధాన్యాంశంగా తీసుకోవడం లేదు. టెక్ ఇండస్ట్రీలో లే ఆఫ్‌ల ప్రభావం ఇతర రంగాలపై పడుతుంది. ఈ విషయం ఈ ఏడాది పరిణామాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…