త్వరలో అమెరికాలో అంతర్యుద్ధం? రష్యా మాజీ అధ్యక్షుడి జోస్యం

By KTV Telugu On 28 December, 2022
image

కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అని కొందరు జోతీష్యులు ముందుగానే భవిష్యవాణి వినిపిస్తారు. అవి నిజం అవుతాయా కాదా అన్నది ఎవరూ పట్టించుకోరు. అయితే కొందరు పెద్దపెద్ద హోదాల్లో పనిచేసిన వ్యక్తులు ఇలాంటి జోష్యాలు చెప్పినప్పుడు వారు చెప్పిన విషయాలపై అందరిలోనూ ఆసక్తి కలుగుతుంది. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్‌ కూడా కొత్త సంవత్సరంలో జరగబోయే పరిణామాలను వివరించారు. వచ్చే ఏడాది అమెరికాలో అంతర్యుద్ధం తప్పదని చెప్పారు. అంతేకాదు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికాకు అధ్యక్షుడు అవుతారని ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు. మెద్వ్‌దేవ్ 2008 నుంచి 2012 వరకు రష్యా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2012 నుంచి 2020 వరకు ప్రధానిగా పనిచేశారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆంతరంగికుడిగా రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన ఈవిధంగా జోష్యం చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కొత్త సంవత్సరంలో అమెరికాలో అంతర్యుద్ధం మొదలవుతుంది. ఫలితంగా రాష్ట్రాలు విడిపోతాయి. కాలిఫోర్నియా, టెక్సాస్‌లు స్వతంత్ర రాజ్యాలు అవుతాయి. అని మెద్వదేవ్‌ పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు పతనమవుతాయి. బ్రిటన్ తిరిగి యూరోపియన్ యూనియన్‌ -ఈయూలో చేరుతుంది. ఆ తర్వాత ఈయూ కూడా కుప్పకూలుతుందని ఆయన జోస్యం చెప్పారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఇలాంటి అసంబద్ధ అంచనాలను తానెప్పుడూ వినలేదన్నారు. ఇది అతని అవగాహనా లేమీకి నిదర్శనం అంటూ మెద్వదేవ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏడాది తర్వాత మళ్లీ వీటిని గుర్తు చేయాలని మెద్వ్‌దేవ్‌కు సూచించారు. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య పది నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. తమవద్ద ఉన్న అణ్వాయుధాలే తమను రక్షిస్తున్నాయని మెద్వదేవ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లో ఫాసిస్ట్‌ పాలన పోయేవరకు రష్యా యుద్ధం కొనసాగిస్తుందని ప్రకటించారు.