మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలా.. వద్దా

By KTV Telugu On 25 February, 2023
image

అమ్మాయిలు రజస్వల అయినప్పటి నుంచి నెలనెలా పీరియడ్స్‌ తో ఇబ్బందులు తప్పవు. ఆ స‌మ‌యంలో మహిళలు తీవ్రమైన అసౌకర్యం కడుపు నొప్పి భావోద్వేగ సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. ప్రకృతి ధర్మంగా సంక్రమించిన పీరియడ్స్‌ గురించి మాట్లాడడానికి అమ్మాయిలు సంకోచిస్తారు. మగవాళ్లు కూడా ఆ విషయం ప్రస్తావనకు రాగానే ముఖం చిట్లిస్తారు. ఇక రోజూ ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేసే స్త్రీలు నెలనెలా పీరియడ్స్‌ సమయంలో పడే బాధ అంతా ఇంతా కాదు. నెలసరి రోజుల్లో సెలవు కావాలని అడగడం ఒక్కోసారి సెలవు దొరక్క ఇబ్బందులు పడడం తప్పదు. అందుకే మహిళలకు నెల‌కు రెండురోజులు నెల‌స‌రి సెల‌వులు ఇవ్వాల‌నే అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ పీరియడ్‌ లీవ్‌పై గత సంవత్సరం కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ స్థల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా నెలసరి సెలవు ఇచ్చే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని పేర్కొంది. 1972 నాటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ లో పిరియడ్ లీవ్ ప్రస్తావన లేదని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో వెల్లడించారు.

అయితే చాలా కొన్ని దేశాల్లో మాత్రమే నెలసరి సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నారు. జపాన్, తైవాన్, ఇండోనేషియాలాంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. దక్షిణ కొరియాలో ఒక రోజు ఇండోనేషియాలో రెండు రోజులు సెలవు ఇస్తున్నారు. ఉద్యోగం చేసే మహిళలకు మూడు రోజులు వేతన చెల్లింపుతో కూడిన ‘నెలసరి సెలవు’ ఇవ్వాలని స్పెయిన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మన దేశంలో కొన్ని ప్రయివేటు సంస్థలు తమ మహిళా ఉద్యోగుల కోసం పీరియడ్‌ లీవ్‌ను అమలు చేస్తున్నాయి. గత సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ సంస్థ తమ కంపెనీలో పనిచేసే మహిళలకు పీరియడ్స్ లీవ్ పాలసీ ప్రకటించింది. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో 2020 నుంచి పీరియడ్స్ లీవ్ అమలు చేస్తోంది. 2021లో మరో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ నెలకు 2 రోజులు “టైమ్ ఆఫ్”ను ప్రకటించింది. ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ కూడా మహిళా ఉద్యోగులకు నెలకొక పీరియడ్స్ లీవ్ ప్రకటించింది. మన దేశంలో బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచే ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల నెలసరి సెలువులు ఇస్తూ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది. ఇతర సెలవులకు ఇవి అదనం. తాజాగా నెలసరి సెలవులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

పని ప్రదేశాల్లో మహిళలు విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కోట్టివేసింది. సెక్షన్ 14 మెటర్నిటి బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం నెలసరి సెలవులు ఇవ్వాలంటూ ఢిల్లీకి చెందిన శైలేంద్ర మణి త్రిపాఠి ఈ ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. పలు దేశాల్లో పీరియడ్స్‌ లీవ్‌ ఇస్తున్నారని, మనదేశంలో కేవలం బీహార్‌లోనే ఇది అమల్లో ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇది ప్రభుత్వ పరిధిలోని అంశమని చీఫ్‌ జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్థీవాలా తో కూడిన ధర్మాసనం పేర్కొంది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మేము నెలసరి సెలవులను తిరస్కరించడం లేదు. కానీ ఈ కారణం చూపించి కొందరు యజమానులు మహిళలకు ఉద్యోగాలు ఇవ్వకపోయే అవకాశం ఉంది. ఈ సమస్యకు భిన్నమైన కోణాలున్నాయి. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు అవసరమైతే తాము జోక్యం చేసుకుంటాం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.