రిజర్వ్ బ్యాంక్ వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలపై హఠాత్తుగా ఆంక్షలు విధించింది. ఎలా పడితే అలా అప్పులు ఇవ్వకుండా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్ని కట్టడి చేసింది. ప్రతీ నెలా అప్పులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇవి ఆన్ సెక్యూర్డ్ లోన్స్. అంటే ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే రుణాలు. డిఫాల్ట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉన్న రుణాలు. పొరపాటున వాటిలో 30 శాతం తిరిగి చెల్లించకపోయినా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతే కాదు మధ్యతరగతి ప్రజలు కుంగిపోతారు. అప్పుల ఊబిలోకి వెళ్లిపోతారు. అందుకే ఆర్బీఐ హఠాత్తుగా ఈ ఆంక్షలు విధించింది. మరి ప్రజలు అంత ఎక్కువగా ఎందుకు అప్పులు చేస్తున్నారు ? అత్యవసరం కోసమా ? విలాసాల కోసమా ?
మన దేశంలో క్రెడిట్ కార్డు వినియోగం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువే. మన దేశంలో మొత్తం 10 కోట్ల క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉంటాయి.. క్రెడిట్ కార్డు పొందాలంటే బ్యాంకులు అనేక ఆంక్షలు పెడతాయి. స్థిరమైన ఆదాయం ఉందని నమ్మితేనే ఇస్తాయి. ఇలా ఆరేడు కోట్ల కుటుంబాలు క్రెడిట్ కార్డులు పొందాయి. వీరితో పాటు ఇతరులు పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. ఇలా నెలకు వీరు పెడుతున్న ఖర్చు..తీసుకుంటున్న అప్పులు లక్షల కోట్లపైగానే ఉంటోంది. పండగల సీజన్ వస్తే అది రెండు లక్షల కోట్ల చేరవకు చేరుతోంది.. ఎక్కువ మంది చేసిన ఖర్చును వాయిదాల పద్దతిలోకి మారుస్తున్నారు. ఆర్బీఐ భయం ఏమిటంటే వీరు కట్టలేకపోతే పరిస్థితి ఏమిటని ?. అందులే పర్సనల్ లోన్లు, ఆర్బీఐ రుణాలపై కొత్తగా ఆంక్షలు విధిస్తోంది.
దేశం అభివృద్ధి చెందుతుందో లేదో కానీ మధ్యతరగతి ప్రజలు మాత్రం బలవంతంగా తమ జీవ ప్రమాణాలు పెంచుకుంటున్నారు. ఆదాయానికి తగ్గట్లుగా బతకడం కన్నా ఆదాయం కన్నా ఎక్కువగా అప్పులు చేసైనా లగ్జరీ లైఫ్ ను కోరుకుంటున్నారు. మధ్యతరగతి జీవుల్లో ఇటీవలి కాలంలో ఇలాంటి అభిప్రాయం పెరిగిపోయింది. విరివిగా రుణాలు అందుబాటులో ఉండటం.. బ్యాంకులు వెంటపడి మరీ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తూండటంతో వారికి డబ్బుల కోసం వెదుక్కోవాల్సిన అవసరం ఉండటం లేదు. ఈ పరిస్థితి మధ్యతరగతి వర్గం దేశంలో పెడుతున్న ఖర్చును చూస్తే అర్థమైపోతుంది. ఇటీవలి పండగ సీజన్ లో ప్రజలు భారీగా క్రెడిట్ కార్డుల్ని వినియోగించారు. ఆ ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 1 లక్షా 78 వేల కోట్ల రూపాయల మేర క్రెడిట్ కార్డు లావాదేవీలు జరిగాయి. ఈ తరహా క్రెడిట్ కార్డుల వినియోగం గతంలో ఎన్నడూ లేదు.
ప్రస్తుతం పొదుపు అనే మాట మధ్య తరగతి ప్రజల్లో తగ్గిపోతోంది. ఏ నెల ఆదాయం ఆ నెలకే ఖర్చు పెట్టేస్తున్నారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ గతంలోనే ప్రకటించారు. కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రజల్లో మార్పు వచ్చింది. అప్పు చేసైనా లగ్జరీగా బతకాలని అనుకుంటున్నారు. ఇక్కడ లగ్జరీ అంటే… నిర్దిష్టమైన అర్థం లేదు. తమ సంపాదన కంటే మెరుగ్గా జీవన ప్రమాణాలు ఉండాలనుకుంటున్నారు. అదే సమయంలో కరోనా అనంతరం… ప్రభుత్వ విధానాల వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. దానికి తగ్గట్లుగా ఆదాయం పెరగడం లేదు. ప్రజల వ్యక్తిగత అప్పులు భారీగా పెరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం 25.35 శాతం పెరిగినట్టు రిజర్వుబ్యాంకు ప్రకటించింది. అంటే మధ్యతరగతి ప్రజలు సహజంగానే లోన్ ట్రాప్‌లో పడిపోతున్నారని అర్థం చేసుకోవచ్చు.
క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు ఇస్తే అవసరం ఉన్నా లేకపోయినా తీసుకునే ఖర్చు పెట్టేసుకునే మధ్యతరగతి జనం ఎక్కువగా ఉంటారు. ఆర్థికపరమైన అవగాహన ఉండకపోవడం ఎలాంటి ప్రణాళికలు లేకపోవడం వల్ల ఎక్కువ కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటాయి. ఇలాంటి ఊబిలోకి ఆయా కుటుంబాలను లాగడానికి … ఆన్ లైన్ కామర్స్ సైట్స్, పండగ సేల్స్, ఆఫర్స్ కూడా ఓ కారణం. ఇలాంటి వాటికి ఆకర్షితులైన ప్రజలు తమ చేతిలో నగదు లేకున్నా, క్రెడిట్ కార్డుల ద్వారా అప్పులు చేసి, ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేసినట్టు ఈ-కామర్స్ లావాదేవీలు పరిశీలిస్తే అర్థమైపోతుంది. రిజర్వుబ్యాంకు చెప్పిన లెక్కల ప్రకారం క్రెడిట్ కార్డు ద్వారా పీఓఎస్ లావాదేవీలు అక్టోబరు నెలలో 58వేల కోట్లు జరగ్గా.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాల ద్వారా లక్షా 21 వేల కోట్లు ఖర్చు పెట్టారు.
పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు డిఫాల్టర్స్ పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగని ఆ రుణాలు, క్రెడిట్ కార్డులపై కట్టడి విధించినా కష్టమే. అందుకే ఆర్థిక వ్యవస్థ అతి సున్నితమైన అంశం అని చెప్పుకునేది.
పర్సనల్ లోన్స్ కి.. క్రెడిట్ కార్డు రుణాలకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. ఇవి అన్ సెక్యూర్డ్ లోన్స్. అంటే… మన దగ్గర ఎలాంటి వస్తువు తనఖా పెట్టుకోకుండానే మనకు రుణాలిస్తారు. సహజంగా ఇలంటి రుణాలు హై రిస్క్ పరిధిలోకి వస్తాయి. రుణాలు తీసుకుని వాడేసుకుని చేతులెత్తేసేవాళ్లు ఉంటారు. ఇలాంటి వారు పరిమితంగా ఉంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తట్టుకోగలవు. కానీ.. అంతకంకూ పెరిగితే మాత్రం.. ఆ లోన్లన్నీ నిరర్థక ఆస్తులుగా మారతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 9.48 కోట్లకు చేరినట్టు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది ప్రమాదమని భావించిన ఆర్బీఐ రిజర్వుబ్యాంకు హామీలేని రుణాల నిబంధనల్ని కఠినతరం చేసింది.
ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా కత్తి మీద సాములాంటిదే. ఎందుకంటే… .దేశంలో అనేక మంది మధ్యతరగతి ప్రజలు క్రెడిట్ కార్డు లోన్లు రీసైకిల్ చేస్తూంటారు. అంటే.. ఈ నెల బిల్ వచ్చిన తర్వాత స్వైపింగ్ మెషిన్స్ ఉన్న వారి దగ్గర వందకు మూడు రూపాయల కమిషన్ ఇచ్చి… తీసుకుంటారు. ఆ నగదును తిరిగి బిల్లుల రూపంలో చెల్లిస్తారు. ఇలా కొన్ని లక్షల మంది ఉంటారు. ఇప్పుడు ఆర్బీఐ ఆంక్షలు విధించడం వల్ల క్రెడిట్ కార్డుల రుణ చెల్లింపులపై పడే అవకాశం ఉన్నదన్న ఆందోళన కూడా ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో చేసిన అప్పులు తిరిగి చెల్లించే ఆర్థిక స్థోమత నెమ్మదించే అవకాశం ఉన్నదని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే… ఒక వేళ విచ్చలవిడిగా రుణాలిచ్చినా సమస్యే.. ఇప్పుడు రుణాలు ఇవ్వకుండా కట్టడి చేసినే సమస్యే అన్నమాట.
రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తే ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉన్నట్లే. ఇప్పటి వరకూ మధ్యతరగతి ప్రజలు క్రెడిట్ కార్డులతో ఆర్థిక పరమైన ఆటలు ఆడుతున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం… ఇష్టం వచ్చినట్లుగా అప్పులు ఇస్తున్నారు కదా తీసేసుకుందామనుకునే మనస్థత్వాల వల్ల.. ఎక్కువగా సమస్యలు వస్తూంటాయి. మధ్యతరగతి ప్రజల్లో ఇలాంటి వారు ఎక్కువగా ఉంటారు. ఆదాయం లేకుండా పెట్టే ఖర్చు వల్ల ఈ సైకిల్ ఎక్కడో చోట తెగిపోతుంది. అప్పుడే అసలు సంక్షోభం వస్తుంది. ఆర్బీఐ ఈ విషయంలోనే కంగారు పడుతుంది. అలాంటి పరిస్థితి వచ్చిన రోజున… దేశమే కాదు.. మధ్యతరగతి ప్రజలు కూడా ఇబ్బంది పడతారు.
వ్యక్తి అయినా .. కుటుంబం అయినా .. వ్యాపార సంస్థ అయినా ప్రభుత్వం అయినా ఆదాయ, వ్యయ అంచనాలను పక్కాగావేసుకుని అప్పులు చేస్తేనే పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అంచనాలకు మించి అప్పులు చేస్తే ఖర్చు పెట్టుకున్నప్పుడుబాగానే ఉంటుంది. కానీ తిరిగి చెల్లించలేనప్పుడు చేసిన తప్పు అర్థం అవుతుంది. కానీ అప్పటికే చేతులు కాలిపోయి ఉంటాయి… ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు…
https://youtu.be/e78afk35Tmw?si=lfSMXyr0Y-mjKmG5
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…