ఎప్పుడు ఎన్నికలు జరిగినా మోడీ గురించి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేసే విమర్శల్లో ప్రధానంగా వినిపించేవి.. కనిపించేవి ఆయన కార్పొరేట్ మిత్రులు అంబానీలు..అదానీల గురించిన విమర్శలు. ఈ సారి రాహుల్ వారి గురించి పెద్దగా చెప్పడం లేదు. రిజర్వేషన్ల టాపిక్ పైకి వెళ్లిపోయారు. అయితే వీరి గురించి మోడీ మాట్లాడుతున్నారు. గతంలో అంబానీ, అదానీల గురించి రాహుల్ మాట్లాడేవారని.. కానీ ఇప్పుడు మాట్లాడటం లేదని.. ఎంత నల్లధనం ఇచ్చారని ప్రశ్నించడం ప్రారంభించారు. అంతే కాదు బీజేపీ పరిస్థితి అంత గొప్పగా లేదన్న మాట .. ఆయా కార్పొరేట్ సామ్రాజ్యాల చేతుల్లో ఉన్న మీడియాలో తరచూ వస్తున్న విశ్లేషణలు. నిజంగానే అదానీకి మోదీకి చెడిందా ?
కరీంనగర్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఓ కొత్త అస్త్రాన్ని బయటికి తీశారు. గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్తలు గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీలతో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకున్నదని ఆరోపించారు. ఐదేళ్లుగా విమర్శిస్తూ వచ్చి, ఎన్నికల ప్రక్రియ ఆరంభం కాగానే అదానీ, అంబానీలపై రాత్రికి రాత్రే విమర్శలు ఆపేశారు .. టెంపోల్లో ఎంత నల్లధనం మీకు చేరిందని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. అంబానీ, అదానీలకు నల్లధనం లింక్ పెట్టి మోదీ మాట్లాడటంతో రాహుల్ గాంధీ స్పందించారు. వారు టెంపోలలో డబ్బు కట్టలు పంపిస్తారని మీకు ఎలా తెలుసని.. మీకు అలాగే పంపేవారా అని ఎదురు ప్రశ్నించడం ప్రారంభించారు. అంబానీ, అదానీ గురించి మొదటి సారి వ్యతిరేకంగా మాట్లాడారని.. ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ విమర్శలు ప్రారంభించింది.
అంబానీ, అదానీలు మోదీకి ఎంత సన్నిహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన వారిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి వారిని చర్చనీయాంశం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో ఇంత కాలం మోదీకి సపోర్టు చేస్తూ వస్తున్న మీడియాలోనూ కలకలం కనిపిస్తోంది. జీ మీడియా మోదీ కనిపించకుండా బ్యాన్ చేశాయి. అయితే ఆ తర్వాత సంస్థలో అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. తర్వాత బెంగాల్ లో సందేశ్ ఖాలీ ఉదంతం అంతా ఫార్స్ అని అదానీ టేకోవర్ చేసిన మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. రిలయన్స్ మీడియా ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి అంత వేవ్ లేదన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఎందుకు ఇలా జరుగుతోందని కార్పొరేట్, రాజకీయవర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
మోడీ ప్రభుత్వం ఈ ఇద్దరు వ్యాపార దిగ్గజాలకూ అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షాలు ఎప్పటి నుండో విమర్శలు చేస్తున్నాయి. గత పది సంవత్సరాల కాలంలో అదానీ, అంబానీల సంపద గణనీయంగా పెరిగింది. కోవిడ్ కాలం సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఆ సమయంలో ఆర్థిక వృద్ధి స్తంభించిపోయింది. లక్షలాది మంది ప్రజలు జీవనోపాధి కోసం ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అంబానీ ఆసియాలోనే సంపన్నుడు. అదానీది రెండో స్థానం. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన పదిహేను మంది జాబితాలో వీరిద్దరి పేర్లూ ఉన్నాయి. వాటాల విలువను పెంచుకునేందుకు స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూపు అనేక అవకతవకలకు పాల్పడిందంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ వెల్లడించి పదిహేను నెలలు గడిచాయి. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు జరిపింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. హిండెన్‌బర్గ్ తర్వాత పలువురు ఫైనాన్షియల్ జర్నలిస్టులు కూడా అదానీ గ్రూపు అక్రమాలు, అవకతవకలను బయటపెట్టారు. అవకతవకలు జరిగాయని సెబీ నిర్ధారించినప్పటికీ ఇప్పటి వరకూ ఆ గ్రూపుపై పెద్దగా చర్యలేవీ తీసుకోలేదు.
తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాను లోక్‌సభ నుండి బహిష్కరించి నప్పుడు అదానీ పేరే ఎక్కువగా బయటకు వచ్చింది. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మొయిత్రా సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిని ఇష్టపడని మోడీ సర్కారు ఆమెను సభ నుండి బయటికి పంపింది. మొయిత్రా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నేటి వరకూ సమాధానం చెప్పలేదు. అదానీ, అంబానీలకు మోడీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ తీసుకున్న నిర్ణయాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, విమానాశ్రయాల ప్రయివేటీకరణ, మైనింగ్ నిబంధనల్లో మార్పులు వంటివి ఇందులో భాగమే. హఠాత్తుగా ఎందుకు వారిపై మోదీ .. కాంగ్రెస్ కు లింక్ పెడుతున్నారన్నది ఇక్కడ కీలకం.
దేశ కార్పొరేట్ దిగ్గజాలు మోదీతో గొడవపడేంత సాహసం చేయవు. ఆయనతో సామరస్యంగానే ఉంటాయి. కానీ వారు అన్ని పార్టీలతోనూ సన్నిహితంగా ఉంటారని చెప్పేందుకే మోదీ వారిపై కొత్తగా ఆరోపణలు చేస్తున్నారన్న అనుమానాలు రాజకీయ పార్టీల వ్యక్తం చేస్తున్నాయి. లోగుట్టేమిటో మోదీకే ఎరుక.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…