మన దేశంలో ఎన్నికలు అంటే… ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది ఇప్పుడు ఓటు కాదు. డబ్బులు. ఏ పార్టీ ఎంత ఖర్చు పెడుతుంది.. ఏ అభ్యర్థి ఎంత ఖర్చు పెడుతారు అనే చర్చే ఎక్కువగా వస్తోంది. కానీ ఈ సొమ్మంతా వారు మళ్లీ ప్రజల దగ్గర నుంచే రాబట్టుకుంటారనే విషయంలో మాత్రం కనీస అవగాహన లేకుండా ఉంటారు. రాజకీయ అవినీతి ఊహించనంత పెరిగిపోయిన ఈ పరిస్థితుల్లో ఎన్నికలు అంటే ప్రభుత్వానికి అయ్యే ఖర్చు అసలు ఖర్చే కాదు.. రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చే అసలు ఖర్చు. కానీ ఈ ఖర్చు లెక్కలోకి రాదు. ఖర్చు పెట్టేది కొండంత… లెక్కలో చూపేది గోరంత. మరి మిగతా సొమ్మంతా ఎక్కడిది ? అంత ఖర్చు పెట్టి ఏం సాధిస్తారు ?
ఎన్నికలు ఎప్పుడు .. ఎక్కడ జరిగినా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పెడుతున్న ఖర్చుపై ఓ రకమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణాదిలో.. ఎన్నికల ఖర్చు మరీ ఎక్కువని చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే.. మొన్నటి ఎన్నికల్లో ధనప్రవాహం జరిగుతుంది. ఎంతగా అంటే ఓటర్లు నేరుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పోటీలో ఉండే పార్టీలన్నీ కలిపి కనీసం పది వేల కోట్లు సులువుగా ఖర్చు పెట్టేస్తాయి. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థి యాభై నుంచి వంద కోట్ల వరకూ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకునే స్వభావం పెరుగుతోంది. రాజకీయాల్లోకి వస్తున్న వారు… సర్వసంగ పరిత్యాగులు కాదు. వారు ఎన్నికల్లో ఖర్చు పెట్టి… మరింత సంపాదించడానికి వస్తున్నారు.
ఎన్నికల్లో రాజకీయ పార్టీ పెట్టే ఖర్చుకు రెండింతలు సంపాదిస్తుంది. అభ్యర్థి ఎంత వీలైతే అంత దోపిడీ చేసుకుంటారు. రాజకీయాన్ని నీతిగా చేసే వారు కొంత మంది ఉండవచ్చు. కానీ ఇప్పుడు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్న వారు వ్యాపార ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఓ ఎమ్మెల్యే 20 కోట్లు ఖర్చు పెడితే.. అంతకు డబుల్ సంపాదిస్తున్నారు. ఈ దోపిడీకి సహకరించేంది అధికారమే. ఎమ్మెల్యేగా ఎన్నికయితే నియోజకవర్గంలో సర్వాధికారిగా మారిపోతారు. ప్రభుత్వ అధికారులు తాను చెప్పిన వారే ఉండాలన్నట్లుగా ఉంటారు. ఆ తర్వాత ఇసుక సహా.. అభివృద్ధి పనులు.. ప్రతీ దాంట్లోనూ.. కమిషన్లు పొందుతారు. ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల విషయాల్లోనూ కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు పొందుతారు. ఐదేళ్లకు ఓ రాష్ట్ర బడ్జెట్… పది లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది. అంటే అంత మొత్తం ఖర్చు చేస్తారు. ఇందులో.. ఒక్క శాతం అవినీతి ఉందంటే.. ఏడెనిమిది వేల కోట్లు ఉంటుంది. అదే టూ పర్సెంట్ అయితే.. పదహారు వేల కోట్లు ఉంటుంది. సహజంగా అవినీతి అంత కన్నా ఎక్కువే ఉంటుంది.
దేశంలో ఇతర ఏ రంగంలో తీసుకున్నా.. రాజకీయాల్లో అతి ఎక్కువ అవినీతి ఉంటుంది. అన్ని వ్యాపారాల్లో కన్నా… రాజకీయ వ్యాపారాల్లోనే ఎక్కువ ఆదాయం కూడా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టి.. రాజకీయం చేసే వారు.. వ్యాపారంలాగానే చూస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన వారు పూర్తిగా.. వ్యాపారిలాగానే వ్యవహరిస్తారు కానీ ప్రజాసమస్యలను పట్టించుకోరు. అసలు సమస్య రాజకీయ పార్టీల దగ్గరే వస్తోంది. ఎన్నికల్లో పోటీ కోసం.. ఎవరైనా వెళ్లినప్పుడు.. ముందుగా రాజకీయ పార్టీలు ఆర్థిక స్థోమత చూస్తున్నాయి. ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడతారని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఏ టిక్కెట్ ఇస్తే ఎంత ఖర్చు పెడతారు..? అనే వివరాలు ఆరా తీస్తారు. రిజర్వుడు నియోజకవర్గాలు ఉంటే.. ఖర్చు కూడా మీరే పెట్టుకోవాలని సూచిస్తూ ఉంటారు. పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు.. అంటూ బేరం పెడతారు. రాజకీయ పార్టీకి.. బ్రహ్మాండంగా.. గెలవడానికి అవకాశం ఉన్న చోట కూడా.. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా.. ఆర్థిక బలం చూసి టిక్కెట్ ఇస్తున్నారు. అక్కడే మొదటి తప్పు జరుగుతోంది.
నిజానికి ఎన్నికల్లో పెట్టే ఖర్చుపై పరిమితి ఉంది. కానీ రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు అంతా బ్లాక్ మనీనే. లెక్కల్లో ఉండవు. ఈసీ డేగ కన్ను వేస్తుంది. ఐటీ, సీబీఐ, ఈడీ అన్నీ చూస్తూంటాయి. అయినా ఇంత బ్లాక్ మనీ ఎక్కడ నుంచి ఎన్నికల సమయంలో బయటకు వస్తుంది ?
ఎన్నికల కమిషన్ కూడా… ఎన్నికల ఖర్చు విషయంలో పూర్తిగా విఫలమయింది. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఓటుకు.. డబ్బులు ఓ సవాల్‌గా మారాయి. దీన్ని సవాల్‌గా తీసుకోవడంలో ఈసీ విఫలమయింది. ప్రజలు కూడా.. తీసుకోవడంలో తప్పు అని అనుకోవడం లేదు. రాజకీయ నేతలు అంత .. అంత దోచుకుంటున్నారు… అది మా డబ్బే కాబట్టే తీసుకుంటే తప్పేం లేదనుకుంటున్నారు. డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు. నిజానికి ఇలా ఒక్క రాష్ట్రంలోనే పది వేల కోట్లవరకూ నగదు ప్రవాహం జరిగితే… చట్టబద్దమైన నియంత్రణ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి…. అంటే చెప్పడం కష్టం. వాటికి తెలియకుండా ఉండదు. ఒక్క కోటి రూపాయల నగదు లెక్క తప్పితే తెలుసుకునే వ్యవస్థ ఉంది. కానీ ఎన్నికల ఎన్నికల వ్యవస్థలో అందరూ దొంగలేనన్నట్లుగా రాజకీయ పార్టీలు ఉంటున్నాయి. ఒకరి లొసుగుల్ని ఒకరు చూసి చూడనట్లుగా ఉంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు విపక్షాల ఆర్థికల మూలాల్ని దెబ్బకొట్టాలని అనుకుంటాయి.. కానీ పూర్తి స్థాయిలో ఆ పని చేయవు. కానీ ఒత్తిడి చేస్తాయి. తమతో పోటీ పడకుండా ఉండేలా కట్టడి చేసుకుంటారు కానీ పూర్తి స్థాయిలో కాదు.
అసలు ఇంత స్థాయిలో బ్లాక్ మనీ ఎక్కడ జనరేట్ అవుతుంది ? . నోట్ల రద్దు చేసి .. నోట్ల చెలామణి పరిమితి విధించిన తర్వాత కూడా నోట్ల కట్టలు ఎలా బయటకు వస్తున్నాయో రాజకీయ పార్టీలకు తెలుసు. అధికారంలో ఉన్న వారికి తెలుసు.. ప్రతిపక్షంలో ఉన్న వారికీ తెలుసు. అంతా వారి అవినీతి సొమ్మే. న్యాయంగా సంపాదించినది అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టరు. పైగా పెట్టేదానికి రెట్టింపు సంపాదించుకుంటారు. ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి … డబ్బు తెగులు పట్టిస్తోంది. అది అంతకంతకూ పెరిగిపోతోంది.
డబ్బు ఖర్చు అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలకూ సమస్యగా మారింది. అది వారు తెచ్చి పెట్టుకున్నదే. ప్రజా స్వామ్యంతో పాటు తమ పార్టీలూ బతకాలన్నా రాజకీయ పార్టీలు… ఇప్పుడు ఓ కొత్త దారిని చూపించాలి. ఏదో ఓ పార్టీ… ముందుకు వచ్చి డబ్బులు పంచబోమని.. చెప్పి.. రాజకీయం చేయాలి. గెలవగలిగే అవకాశం ఉన్న ఏదో ఓ పార్టీ ముందుకు వస్తే… పరిస్థితి మారే అవకాశం ఉంది. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా..దీనికి సుముఖంగా లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ డబ్బులు ఖర్చు పెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తూంటారు కానీ.. పరిష్కార మార్గాలు వెదికే ప్రయత్నం మాత్రం చేయరు. అదే అసలు సమస్య
డబ్బు జబ్బు చేసే వ్యవస్థలన్నీ బాగుపడిన దాఖలాలు లేవు. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యానికీ అదే పట్టేసింది. ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. అది ప్రజాస్వామ్యానికి.. పార్టీలకు ఎంతో మంచిది
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..