ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ – అన్ని పార్టీల మేనిఫెస్టో ఇదే !

By KTV Telugu On 24 May, 2024
image

KTV TELUGU :-

రాజకీయ పార్టీల అప్రకటిత మేనిఫెస్టోలో ఒకే ఒక అంశం ఉంటోంది. అదేమిటంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. ఓటర్లను బ్లాక్ మెయిలింగ్ చేసి ఓట్లు పొందాలనుకుంటున్నాయి. మోదీ దగ్గర నుంచి చంద్రబాబు వరకూ అందరూ ఇదే చేస్తున్నారు. ఓటర్లను మానసికంగా బలహీనం చేసి ఎదుటి వాళ్లొస్తే ఏదో జరిగిపోతుందన్న భ్రమను కల్పించి ఓట్లు దండుకోవాలనుకుంటున్నారు. ఇందులో రాజకీయ పార్టీలు సక్సెస్ అవుతున్నాయా ?

ఎన్నికల్లో గెలవాలంటే… ఓటర్లను భయపెట్టడం అనేది ఓ విన్నింగ్ ఫార్ములాగా మారింది. ఓటర్ల భావోద్వేగాలు రెచ్చగొట్టడం… భయపెట్టడమే పోల్ మేనేజ్మెంట్ లో ఎక్కువ వర్క్ అవుట్  అయ్యే ధియరీగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదే ధోరణిలో జాతీయ పార్టీల నుండి.. ప్రాంతీయ పార్టీల వరకు ఇదే  అంశాన్ని తమ ఎన్నికల వ్యూహాంగా  అమలు చేస్తున్నాయి.  జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకు  ఇదే స్ట్రాటజీ అమలు చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోను ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన సైతం ఇదే భయం అనే మంత్రం జపించాయి.  చంద్రబాబుకు ఓటేస్తే  సంక్షేమ పథకాలు ఆగుతాయని ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు జగన్.   టీడీపీకి ఓటు వేస్తే ఆ హమీలు అమలు చేయని పరిస్థితి ఉంటుందని చెప్పడంతో పాటు టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలు రద్దు అవుతాయని   శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. వీరికి దీటుగా టీడీపీ సైతం ఇదే మంత్రాన్ని ప్రయోగించింది.  జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను అమలు చేస్తుంది. ఆ యాక్టు ప్రకారం మీ భూములు, పంట పొలాలు , స్వంత ఇళ్లు గుంజుకోవడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. జన సేన సైతం ల్యాండ్ యాక్ట్ పైన ఇదే రీతిలో జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చెపట్టింది. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున రాష్ట్రంలో హింస జరుగుతుందని భయపెట్టే ప్రయత్నం జనసేన చేసింది. బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలిగిపోతాయని, క్రైస్తవులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వైకాపా శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేపట్టాయి.

తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోను ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సైతం ఇదే తంత్రాన్ని నమ్ముకున్నాయి. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే, బీజేపీకి ఓటు వేసినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రచారంలో పేర్కొనడం గమనార్హం. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పోతాయని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరికీ లాభం ఉండదని కాంగ్రెస్ ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇచ్చిన హమీలు నెరవేర్చదని, ఇప్పటికే రైతు రుణ మాఫీ జరగదని, రైతులను సాగు నీరు ఇవ్వదని, 24 గంటల విద్యుత్ ఇవ్వదని నెగిటీవ్ ప్రచారానికి గులాబీ పార్టీ దిగింది. ఇక కమలం పార్టీ సైతం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని, ఆ పార్టీకి ఓటు వేయవద్దని ప్రచారం చేస్తూనే…. బీజేపీ కేంద్ర నాయకుల ప్రచారాన్నే ఇక్కడ చెప్పే ప్రయత్నాన్ని రాష్ట్ర కమలనాధులు చేశారు.

ప్రాంతీయ పార్టీల తీరు ఇలా ఉంటే… జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ లు వారికి పెద్దన్నలా బ్లాక్ మెయిల్ మంత్రను అమలు చేశాయి. బీజేపీ ఇందులో ముందుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయాన్ని తిరిగి కూలగొడతారని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గే సహా, అగ్ర నేత రాహూల్ గాంధీ సైతం రామ మందిరాన్ని పూర్తి చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. అంతే కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ ను రద్ద చేసి తిరిగి కాశ్మీర్ పై నియంత్రణ కోల్పోయేలా చేస్తుందని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా రాహుల్ గాంధీని పొగుడుతూ పాకిస్థాన్ కు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ శత్రు దేశానికి మిత్రుడైన పార్టీగా అభివర్ణించే ప్రయత్నం కమలనేతలు చేస్తునే ఉన్నారు.

బీజేపీకి చేస్తోన్న ప్రచారానికి ఏం తక్కువ కాకుండా కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్, ప్రియంక సహా ఇతర నేతలంతా బీజేపీ దేశానికి ప్రమాదకరమైన పార్టీగా అభివర్ణిస్తూ ఇదే ఫార్ములాను ఫాలో అవడం విశేషం. బీజేపీ 400 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వస్తే అన్ని రాజకీయ పార్టీల నేతలు అక్రమ కేసులతో జైళ్లో ఉంటారని, అన్ని పార్టీలు కనుమరుగవడం ఖాయమని.. ఇది ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని హస్తం నేతలు ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి వేస్తారని, రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి దేశాన్ని మత దేశంగా మార్చుతారని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఎన్నికల్లో తమ పార్టీ మ్యానిఫెస్టోనో, తమ పథకాలనో..తమ పార్టీ హయాంలో జరిగిన పాలన తీరునో చూసి ఓటు వేయాలని కోరే రోజులు పోయాయి. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేస్తే జరిగే విష పరిణామాలు ఇవే అని చెప్పి భయపెట్టి ఓట్లు గుంజుకునే ఎన్నికల స్ట్రాటజీని ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు  ఫాలో అవుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు మరో చాయిస్ లేకుండా… ఎవరి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో ఆయా పార్టీలే చెబుతున్నాయి. చివరికి తక్కువ నష్టం చేసేవారిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఓటర్లకు ఏర్పడుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి