దేశ ప్రధాని ప్రజలందరికీ ప్రధాని. కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు పంచేందుకు మీరు అంగీకరిస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మోదీ ప్రచార వ్యూహంతో పాటు… ఇప్పటి వరకూ జరుగుతున్న వ్యవహారాలు చూస్తే.. బీజేపీకి ఊహించనంత గడ్డు పరిస్థితి ఉందని.. అందుకే ఆయన మళ్లీ పాత అస్త్రం బయటకు తీశారన్న వాదన వినిపిస్తోంది.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంల ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశ సంపదలో మొదటి హక్కు ముస్లింలకే అని చెప్పారని ఆరోపించారు. అంటే ఈ సంపద మొత్తాన్ని వారు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి, చొరబాటుదారులకు పంచేస్తారని ఆరోపించారు. తల్లులు, చెల్లెళ్ల దగ్గర ఉన్న బంగారం లెక్క తీస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో చెప్తున్నది. ఈ సంపదను పంచేస్తారు. ఈ అర్బన్ నక్సల్స్ ఆలోచన నా తల్లులు, చెల్లెళ్ల మంగళసూత్రాలను కూడా వదలదని మోదీ అన్నారు. మోదీ వ్యాఖ్యలు ఓ రకంగా ఆయన ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొటున్నారన్న అభిప్రాయానికి రావడానికి కారణం అవుతోంది .
లోక్‌సభ ఎన్నికలలో ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి చేస్తున్నట్లుంది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక అంశాలను ప్రస్తావించకుండా కేవలం మోడీ , బీజేపీ ప్రచాచరరంరం సాగుతోంది. బిజెపిలో వాజపేయి, అద్వానీ తిరుగులేని నేతలుగా ఉన్న సమయంలో కూడా అంతర్గతంగా కీలక అంశాలపై గంభీరమైన వాదోపవాదాలు జరుగుతూ ఉండెడివి.వారిద్దరూ ప్రతిపాదించిన అంశాలను సైతం కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ వాదనలు వినిపించుకోగలిగేవారు.కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. హోం మంత్రి అమిత్ షా తాజాగా చెప్పినట్లు ఈ ఎన్నికలు కేవలం మోడీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్నాయి. అంతకు ముందు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరంలేదంటూ పరోక్షంగా చెబుతున్నారు.
బీజేపీ మేనిఫెస్టోలోనూ సంక్షేమం గురించి.. అభివృద్ది గురంచి పెద్దగా దార్శనికత లేదు. ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి అంశాలను కీలకంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు కావడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడంతో గత దశాబ్దాలుగా బిజెపి ఎన్నికల ప్రణాళికలలో కనిపించే ఈ అంశాలు ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడలేదు. 2019 ఎన్నికల ప్రణాళికలో దశాబ్దాల క్రితం ఉగ్రవాదం కారణంగా ప్రాణభయంతో ఇక్కడి నుండి పారిపోయిన కశ్మీరీ పండితులు తిరిగి గౌరవంగా వచ్చి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనే విధంగా చూస్తామని బిజెపి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీకి తిలోదకాలిచ్చారు. కనీసం కశ్మీర్ లోయలో ప్రాణభయంతో ఉన్న కొద్ది మంది కశ్మీరీ పండితులలో స్థైర్యం నింపే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. 2019 ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు అందరి సాధికారికతకు, గౌరవంతో అభివృద్ధి చెందే విధంగా చేసేందుకు బిజెపి హామీ ఇచ్చింది. ఇప్పుడా ప్రస్తావన లేదు. పైగా వ్యతిరేకత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
పదేళ్లు అధికారంలో కొనసాగిన పార్టీ ఎన్నికల వేళ హిందుత్వ కార్డు అప్లై చేయడం ఏంటని…అభివృద్ధి పేరిట ఓట్లు అడిగే సాహసం ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. మోడీ చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజల మధ్య విభజన తీసుకొచ్చేలా ఉన్నాయని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. మోడీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. పదేళ్ల బీజేపీ హయాంలో దేశమంతా వెలిగిపోతుందని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఆ అభివృద్ధి నమూనాను ప్రస్తావించకుండా హిందూ- ముస్లిం అనే ఎజెండాతో బీజేపీ ఎన్నికలకు వెళ్తున్నట్లుగా స్పష్టం అవుతుంది. ముస్లిలపై వ్యతిరేకత పెంచడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు అనుకుంటే కష్టమేనని ఇప్పటికే అనే రాష్ట్రాల ఫలితాలు నిరూపించాయి. కర్ణాటకలో 80 శాతం హిందువులు. 20 శాతం మైనారిటీలు. ఆ హిందువుల్లో కూడా ఎక్కువ మంది మత సంప్రదాయాలను ప్రగాఢంగా విశ్వసించి పాటించేవారు. అయినా… హిందువులకు తాను మాత్రమే టేకేదారునని చెప్పుకొనే బీజేపీకి అధికారం మిగలలేదు. మహామహులు మోదీ, అమిత్ షా, నడ్డా, యోగితో పాటు, సొంత రాష్ట్రమైన కర్ణాటకలో వ్యూహకర్త సంతోష్ సర్వశక్తులూ ఒడ్డినా… ఓటరు ఓడించారు. బురఖా వివాదంతో కర్ణాటకను అతలాకుతలం చేసినా కుదర్లేదు. మరి ఇప్పుడు మోదీ ఎందుకిలాంటి ప్రచారం చేస్తున్నారు.. ?
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…