ముస్లిం ఓట్లను వదిలేసుకున్నారా?

By KTV Telugu On 2 June, 2024
image

KTV TELUGU :-

ముస్లిం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బీజేపీ కుండబద్దలు కొట్టేసింది. ఇండియా కూటమి ఓట్‌బ్యాంక్‌ అంటూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ నేతలంతా ఘాటు విమర్శలు చేశారు. అంటే ఈ ఎన్నికల్లో  మైనార్టీలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసినట్టేనా..?  కమలనాథులు మైనారిటీ ఓట్లు తమకి అవసరం లేదన్న నిశ్చయానికి వచ్చేశారా అని పరిశీలకులు నిలదీస్తున్నారు.అసలు ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత..? పూర్వ గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఏడో దశకు జూన్‌ ఒకటిన పోలింగ్‌ జరగనుంది. దేశంలో హిందువుల జనాభా 80 శాతం కాగా.. ముస్లిం జనాభా 14 శాతం. అసోం, పశ్చిమ బెంగాల్‌ల్లో అత్యధిక  మైనార్టీ ఓట్‌బ్యాంక్‌ ఉంది. ఆ తర్వాత కేరళ, ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ల్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటు ఎంత మేరకు ప్రభావం చూపిందనేది కీలకంగా మారింది. ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకున్న బిజెపి మొదటి సారి ముస్లిం ఓట్లు తమకి అవసరం లేదన్నట్లుగా ప్రచారం చేసినట్లు భావిస్తున్నారు.

గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు సంబంధించిన డేటాను విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. సీఎస్‌డీఎస్‌ లోక్‌నీతి సర్వే సంస్థ డేటా ప్రకారం, 2009 ఎన్నికల్లో బీజేపీకి 4 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 38 శాతం ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. మిగిలిన 58 శాతంమంది ఇతర పార్టీలకు ఓటువేశారు. 2014 ఎన్నికల్లో  8 శాతం ముస్లిం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గారు, కాంగ్రెస్‌కు 38శాతం మంది ఓటేయగా.. ఇతర పార్టీలకు 54 శాతం ఓట్లు వచ్చాయి.

ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 8శాతం ముస్లిం ఓట్లు నిలబెట్టుకోగా.. కాంగ్రెస్‌కు 33 శాతం, ఇతరులకు 59 శాతం మైనార్టీ ఓట్లు పోలైనట్టు CSDS లోక్‌నీతి గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 48 లోక్‌సభ స్థానాల్లో ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. 2014లో ఈ 48 సీట్లలో  బీజేపీకి 17, కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలను దక్కాయి. అదే 2019కి వచ్చేసరికి బీజేపీ స్థానాలు 13కు తగ్గగా..  కాంగ్రెస్ ఒక్క సీటు పెంచుకుని 11 గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో 882 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 23 మంది మాత్రమే విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో 819 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేయగా 28 మంది గెలిచారు. 2019 ఎన్నికల్లో 27 మంది ముస్లిం ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు. బీజేపీకి లోక్‌సభలో ఒక్క మైనార్టీ ఎంపీ కూడా లేరు.గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే, ముస్లిం ఓటర్లు తటస్థంగా మారిపోతున్నారని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు. ఇందుకు పలు కారణాలున్నాయి. 2014కు ముందు అసోంలో ముస్లిం ఓట్లు ఒకే పార్టీకి కేంద్రీకృతమై ఉండేవి. హిందూ ఓట్లు కులాల ప్రాతిపదికన చెల్లాచెదురయ్యాయి. మొత్తంగా చూస్తే మైనారిటీ ఆధిపత్య స్థానాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

అయితే ఈసారి ముస్లిం ఓటుబ్యాంకుపై ప్రధాని మోదీ చేసిన కొన్ని ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ముజ్రా డ్యాన్స్‌, ఓట్ జీహాద్‌ వంటి వ్యాఖ్యలు వివాదం రాజేశాయి. మతం ఆధారిత రిజర్వేషన్లు ఎత్తేస్తామని డైరెక్ట్‌గానే ప్రకటించింది కాషాయదళం. ప్రతి రాష్ట్రంలో దీనిపై గట్టిగా ప్రచారం చేశారు కేంద్రమంత్రులు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు. ఈ ప్రకటనలు పోలింగ్‌పై ప్రభావం చూపించాయనే అంచనాలున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి