కల్వకుంట్ల కవిత ఈడీముందు విచారణకు హాజరయ్యే ముందురోజు లిక్కర్‌స్కామ్ కీలకమలుపులు తిరిగింది. కవిత బినామీగా ఈడీ అభియోగాలు మోపిన హైదరాబాద్ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై సడెన్‌గా మాటమార్చారు. దర్యాప్తు సంస్థకు తానిచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిళ్లై పిటిషన్ వేశారు. దీనిపై స్పందించాల్సిందిగా న్యాయస్థానం ఈడీకి నోటీసు పంపింది. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తాను బినామీనని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత కోసం తాను పనిచేశానని రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్ని ఈడీ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. మార్చి 11న కవితను ప్రశ్నించాల్సి ఉండగా వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నానని పిళ్లై చెప్పడం కేసులో కీలక మలుపుగా మారింది.
పిళ్లై ఆకస్మిక నిర్ణయం వెనుక ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా లేదంటే ఒత్తిడితోనే ఆయన ఈడీకి వాంగ్మూలం ఇచ్చారా అన్నదానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఇదే స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కస్టడీకి ఇవ్వాలన్న వాదనల సందర్భంగా కూడా కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్, సిసోడియా, కవితతో పాటు పలువురు కుట్ర పన్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ దాదాపు రూ.100 కోట్లు ఇచ్చినట్లు ఈడీ ఆరోపించింది. షార్ట్ కట్లో లిక్కర్‌స్కామ్ నిందితుల మధ్య జరిగిన లావాదేవీలు వాట్సాప్ చాట్లను ఈడీ విశ్లేషించింది. అందులో కే అంటే కవితని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. రెండు పక్షాల వాదనల తర్వాత సిసోడియాని వారంరోజుల ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఈడీ విచారణకు ముందు రోజు ఢిల్లీలో కవిత మహిళా బిల్లుపై దీక్ష చేపడితే లిక్కర్ స్కామ్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లో దీక్షలకు దిగటంతో స్కామ్ కాస్తా పొలిటికల్ స్కీమ్‌లా మారిపోయింది.