రాజకీయ రత్న నితీష్ కుమార్

By KTV Telugu On 29 January, 2024
image

KTV TELUGU :-

రాజకీయాలు ఎలా చేయాలో కొంత మందిని చూసి నేర్చుకోవాలని విలువలు పాటించే వారిని గూర్చి చెబుతూంటారు.  కానీ అలా రాజకీయాలు చేస్తే ఈ రోజుల్లో  సాధ్యం కాదు. ఈ రోజుల్లో రాజకీయం ఎలా చేయాలో  కొంత మందిని చూసి నేర్చుకోవాలి.  అలాంటి వారిలో నితీష్ కుమార్ ఒకరు. బీజేపీతో కలుస్తారు.. విడిపోతారు.. ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం అంటారు.. మళ్లీ అదే పార్టీతో రాత్రికి రాత్రి కలిసిపోతారు. ఆయన చేసే రాజకీయం బీహార్ ప్రజలకు ఎలా అనిపిస్తుందో కానీ దేశ ప్రజల్ని మాత్రం అబ్బురపరుస్తోంది.  దేశ రాజకీయాల్ని మరో కోణంలో దిగజారుస్తున్న నేతను చూసి  ప్రజలంతా ఆశ్చర్య పడాల్సి వస్తోంది.

లాలూ ప్రసాద్ యాదవ్‌ను  మట్టి కరిపించిన తర్వాత బీహార్‌కు నితీష్ కుమార్ సీఎం అయ్యారు. ఆయన పనితీరుకు మొదట్లో మంచి మార్కులు వచ్చాయి. ముఖ్యమంత్రిగా ఆయన ఇమేజ్ చాలా గొప్పగా పెరిగింది. కానీ చేసే రాజకీయం మాత్రం విలువల్లేకుండా పోయింది.  ఒకప్పుడు దేశ ప్రధాని పదవికి ఎవరి పేరంటే నితీష్ కుమార్ పేరు వినిపించేది. ఇప్పుడు ఆయన తన పై ప్రజల్లో ఉన్న గౌరవాన్ని ఆయనంతట ఆయనే  పోగొట్టుకున్నారు.  చేజేతులా ఉన్న మంచి పేరును చెడిపేసుకుంటున్న నితీష్ కుమార్ ఇప్పుడు దేశ రాజకీయాలకు కాదు.. బీహార్ పాలిటిక్స్ కు కూడా పనికివస్తారా  అన్న ప్రశ్నలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.

జేడీయూ అధినేత నితీష్ కుమార్.. ప్రధానిపై పదవిపై ఎప్పుడో ఆశలు పెట్టుకున్నారు. బీజేపీతో కలిసి చాలా కాలంగా ఎన్డీఏలో ఉన్న ఆయన.. బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి దిగ్గజాన్ని ఓడించి… వరుసగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తూ వస్తున్నారు. ఆయనకు ప్రజల్లో క్లీన్ ఇమేజ్ ఉంది. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ.. కొన్ని ముస్లిం వర్గాలు..  జేడీయూ పట్ల సానుకూలంగా ఉంటాయంటే.. దానికి నితీష్‌కు ఉన్న క్లీన్ ఇమేజే కారణం అన్న ప్రచారం ఉంది.  అందుకే..  2014కి ముందు..   ఎన్డీఏ నుంచి తనను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించాలన్న ప్రయత్నాలు చేశారు. అయితే.. అనూహ్యంగా నరేంద్రమోదీని బీజేపీ ప్రమోట్ చేసింది. దాంతో.. అసంతృప్తికి గురైన నితీష్.. మోదీపై ముస్లింలలో తీవ్ర ఆగ్రహం ఉందని.. ఆయన ఎంత మాత్రం ఆమోదయోగ్యమైన నాయుకుడు కాదని చెప్పి.. బీజేపీతో కటీఫ్ చెప్పేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో గెలిచారు. కానీ మధ్యలో కాంగ్రెస్, ఆర్జేడీకి హ్యాండిచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  బీజేపీతో కలిసి ఎన్నికల్లో  పోటీ చేసి..మళ్లీ కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రివర్స్  మళ్లీ జంపవుతున్నారు. మరోసారి బీజేపీతో కలిసి బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు.  ఈ సర్కస్ ఫీట్ చేయడం ఇది మొదటి సారి కాదు. ఎనిమిది సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఎక్కువ కాలం ఉండరు. తన ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఆయనకు అలవాటు. 2022లో బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకుని ఆయన కాంగ్రెస్ కూటమిలో చేరిపోయి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్లీ  రివర్స్ లో  ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని ముంచేసి బీజేపీతో కలుస్తున్నారు.  తిరిగి ఎన్డీఏ కూటమిలోకి వెళ్లారు.

ఒక మనిషి రాజకీయంగా ఇన్నిసార్లు గోడ దూకుళ్లు చేసిన వాళ్లు చరిత్రలో ఉండే అవకాశం కలగకపోవచ్చు. మరి నితీష్ కుమార్ కు అదృష్టం కలసి వస్తుందో ఏమో కాని జంప్ చేసినప్పుడల్లా సీఎం కుర్చీ మాత్రం అందుతూనే ఉంది.  బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నిజాయితీ పరుడే. దానిని ఎవరూ కాదనలేరు. ఆయన రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదు. ఆయన పాలన కూడా ప్రజారంజకంగానే ఉంటుంది. బీహార్ లో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు కూడా సాధించారు. అయితే ఆయన రాజకీయ నిర్ణయాలే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎటు గాలి ఉంటే అటు వెళ్లిపోయే లీడర్ గా ఆయన పేరు పొందారు. ఆయనకు పదవి ముఖ్యం. పార్టీలను మారుస్తూ తన కుర్చీని మాత్రం పదిలం చేసుకుంటున్నాడన్న విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఇది ఆయన రాజకీయ జీవితానికి మంచిది కాకపోయినా ఆయనకు పదవే ముఖ్యంలా కనిపిస్తుంది. ఒకసారి బీజీపీ అంటారు.. మరొకసారి కాంగ్రెస్ కూటమి అంటారు.. శరద్ యాదవ్ స్థాపించిన జనతాదళ్ యు ను తన సొంతం చేసుకుని ఆయననే బయటకు వెళ్లగొట్టగలిగారు. ఒకసారి అయితే సర్లే అనకోవచ్చు. ఇన్నిసార్లు.. ఇన్ని నిర్ణయాలు.. బీహార్ లో వీస్తున్న గాలులను బట్టి ఆయన నిర్ణయాలు ఉంటాయి. పొత్తులు ఉంటాయి. తాను అవినీతికి వ్యతిరేకం అంటూనే అవినీతి కేసుల్లో కూరుకుపోయిన లాలూప్రసాద్ యాదవ్ కుటుంబ పార్టీ ఆర్జేడీతో నిర్భయంగా పొత్తు పెట్టుకుంటారు. అవసరం లేనప్పుడు మాత్రం లాలూ కుటుంబ అవినీతిని ఎండగడతారు. లేకుంటే లాలూయాదవ్ అంత మంచోడు లేడంటూ ఆలింగనం చేసుకునేదీ ఈయనే.

నితీష్ కారణంగా జేడీయూ రాను రాను కుంచించుకూ పోతూ వస్తోంది. ఒకప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే ఆ పార్టీ చివరికి అతి చిన్న పార్టీగా మిగిలింది. వచ్చే ఎన్నికల్లో అది కూడా నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది.  అదే జరిగితే  పదవి ప్రకారం అత్యంత విజయవంతమైన నేత  నితీష్ కుమార్ కానీ.. రాజకీయాలకు విలువలు అంటూ లేని నేతగా కూడా ఆయననే చూపించాల్సి   వస్తోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి