మహిళాభ్యుదయం ఒట్టిమాటే. వారిని ఓటు బ్యాంకులుగా వాడుకోవడం ఒక్కటే మిగిలింది. ఎన్నికలప్పుడు ఓట్ల వేయించుకునేందుకు మాత్రమే గుర్తుకు వచ్చే మహిళలకు పార్టీలు సీట్లు మాత్రం ఇవ్వడం లేదు. అలా ఎందుకు జరుగుతోందోనని అడిగే వాళ్లు కూడా లేరు. తాజాగా తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో సైతం మహిళలకు అన్యాయమే జరిగిందని చెప్పక తప్పదు.
దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల విషయాన్ని ముందు ఒక సారి చూద్దాం. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. బిల్లు ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు. పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే తమ వంతుగా 33 శాతం మహిళా అభ్యర్థులను నిలబెట్టడం కష్టమేమి కాదు. ఈ నెల 19న జరిగే లోక్ సభ తొలి దశ అభ్యర్థుల లెక్కలు చూస్తే అన్ని పార్టీలు కలిసి మహిళలను ఎలా విస్మరిస్తున్నాయో అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా 1,483 మంది పురుష అభ్యర్థులుంటే, 135 మంది మహిళలున్నారు. అంటే అభ్యర్థుల్లో పది శాతం మంది మహిళలు కూడా లేరని అర్థం చేసుకోవాలి. ఇదీ పార్టీలు మహిళలకు చేస్తున్న ద్రోహమనే చెప్పాలి. ఈ విషయంలో తెలంగాణ పార్టీలు కూడా జాతీయ పార్టీలకు, ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోలేదు. మహిళలకు ఒకటి అరా టికెట్లు ఇచ్చి సరిపెట్టారనే చెప్పాలి…
తెలంగాణ రాజకీయాలు తిట్టుకోవడంతోనే సరిపోతున్నాయి. అందరికీ సమానంగా ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశం పార్టీలకు లేదనే చెప్పాలి. అందుకే ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో కూడా ఒకటి రెండు స్థానాలతోనే మహిళలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది…
తెలంగాణ వరకు చూస్తే.. మొత్తం 17 సీట్లున్నాయి. కనీసం ప్రతిపార్టీ ఐదుగురు మహిళలకు సీట్లివ్వాలి. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 14 సీట్లకు ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు ఇంకా వెల్లడించలేదు. అయితే, 14లో ముగ్గురు మహిళలకు టికెట్లిచ్చింది. మల్కాజిగిరి వంటి పెద్ద నియోజకవర్గం నుంచి సునీతా మహేందర్ రెడ్డిని బరిలో దింపింది. ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణకు అవకాశం ఇచ్చింది. వరంగల్ లో కడియం కావ్యను నిలిపింది.మిగిలిన మూడు స్థానాల్లో ఒకటి కూడా మహిళలకు ఇచ్చే అవకాశం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ 17 సీట్లకు గానూ మహిళలకు మూడు సీట్లతో సరిపెట్టిందనుకోవాలి. బీఆర్ఎస్ మొత్తం 17 సీట్లకూ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మహబూబాబాద్ లో సిటింగ్ ఎంపీ మాలోత్ కవితను బరిలో నిలిపింది. వాస్తవానికి కడియం కావ్యను బీఆర్ఎస్ ముందుగా వరంగల్ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, ఆమె తన తండ్రి శ్రీహరితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో కారు పార్టీ ఒక్క సీటే మహిళలకు ఇచ్చినట్లయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎంఐఎం అడ్డా. అలాంటిచోట తొలిసారి మహిళకు టికెటిచ్చింది బీజేపీ. మాధవీ లతను పోటీకి దింపి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ను ఢీకొడుతోంది. సీనియర్ నాయకురాలు డీకే అరుణకు మహబూబ్ నగర్ టికెట్ కేటాయించింది. దీనితో కమలం పార్టీ ఇద్దరు మహిళలకే టికెట్లు ఇవ్వగలిగింది.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ అంశం 2029 నుంచి అమలుకు రానుంది. అప్పటి వరకు పార్టీలు మహిళలను ఇలాగే ఏమార్చుతాయని అనుకోవాల్సిందే. చట్టం వస్తే మాత్రం తప్పకుండా మహిళలకు వారి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే. కాకపోతే మహిళలను కూర్చోబెట్టి మగవారు పెత్తనం చేస్తారన్న అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎందుకంటే భారత రాజకీయ చరిత్ర అదే కదా….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…