లోక్ సభ ఎన్నికల ముందు కేంద్రంలోని బిజపి ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన దిగ్గజాలకు భారత రత్న అవార్డులు ప్రకటించింది. ఒకే ఏడాది ఏకంగా అయిదుగురికి భారత రత్న అవార్డులు ప్రకటించారు. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న అవార్డులను ఇపుడు ప్రకటించారు. వీరిలో తమిళనాడుకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, బిజెపి అగ్రనేత అడ్వాణీ,బిహార్ కు చెందిన కర్పూరీ ఠాకూర్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు కూడా భారత రత్న ప్రకటించారు. మహానుభావులను గౌరవించుకోవడం చాలా అవసరం అన్నారు ప్రధాని మోదీ.
తెలంగాణాకు చెందిన పి.వి.నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బిజెపికి కొన్ని వర్గాల్లో సానుకూల స్పందన రావచ్చునని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అవార్డులు రాజకీయ ప్రయోజనాలకోసం ఇవ్వరు. అయినా కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.వి.కి అవార్డు ఇవ్వడం ద్వారా బిజెపి మంచి మార్కులు కొట్టేసిందని అంటున్నారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే అధికారంలో ఉన్నా పి.వి.కి భారత రత్న ఇవ్వలేదు. కానీ బిజెపి ఆయనకు సముచిత గౌరవం ఇవ్వడం ద్వారా పి.వి. అభిమానులతో పాటు మేథావుల్లోనూ మంచి పేరు సంపాదించినట్లయ్యిందంటున్నారు.
పి.వి.కి భారత రత్న ప్రకటించడంతోనే మరో తెలుగు వెలుగు నందమూరి తారకరామారావు అభిమానుల్లో చర్చ మొదలైంది. సినీ నటుడిగానూ.. రాజకీయ వేత్తగానూ ఎన్నో రికార్డులు సృష్టించిన ఎన్టీయార్ నిజంగానే భారత రత్న అవార్డుకు అన్ని విధాలుగానూ అర్హుడు. అయితే ఆయనకు ఇంత వరకు భారత రత్న రాకపోవడం దారుణమే. నిజానికి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత విభజిత ఏపీకి సిఎంగా ఉన్నప్పుడు కూడా కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో అధికారాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో కూడా ఎన్టీయార్ కు భారత రత్న అవార్డు ఎందుకు తెప్పించుకోలేకపోయారన్నది కోటి డాలర్ల ప్రశ్న.
చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినా ఎన్టీయార్ కు అవార్డు రాకపోవడం వెనుక ఏదో మిస్టరీ ఉండే ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాజ్ పేయ్ హయాంలో ఎన్టీయార్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అనుకున్నా.. ఆ విషయం తెలియడంతోనే చంద్రబాబు నాయుడే ఆ అవార్డు ఇవ్వద్దని చెప్పారని హస్తిన వర్గాల్లో అప్పట్లోనే ఒక ప్రచారం ఉండేది. చంద్రబాబు నాయుడే వద్దని అనడం.. అపుడు ఎన్డీయేలో చంద్రబాబు నాయుడే కీలక భాగస్వామి కావడంతో వాజ్ పేయ్ ప్రభుత్వం ఎక్కువ చర్చ పెట్టకుండా ఎన్టీయార్ పేరును వెనక్కి తీసుకుందని అంటారు.
ఎన్టీయార్ అవార్డును చంద్రబాబే ఎందుకు వద్దంటారు? అని టిడిపి నేతలు నిలదీస్తారు. అయితే దానికి ఒక లాజిక్ ఉందంటున్నారు మరో వర్గం నేతలు. ఎన్టీయార్ నుండి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు దానికి ఒక కారణం చెప్పారు. ఎన్టీయార్ రెండో భార్య లక్ష్మీపార్వతి రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తోన్నా ఎన్టీయార్ అడ్డుకోకపోవడం వల్లనే పార్టీని బతికించుకోడానికి ఎన్టీయార్ ను గద్దె దింపక తప్పలేదన్నారు. ఆ ఎపిసోడ్ తర్వాత లక్ష్మీపార్వతి కూడా చంద్రబాబు నాయుడిపై తరచుగా విమర్శలు చేస్తూ వచ్చారు.అటువంటి లక్ష్మీపార్వతి రాజకీయ తెరపై కీలక పాత్ర పోషించడం బాబుకు ఇష్టం ఉండదంటారు.
ఎన్టీయార్ 1996లోనే స్వర్గస్తులయ్యారు. ఆయన మరణానంతరం ఆయనకు భారత రత్న అవార్డు ప్రకటిస్తే..దాన్ని ఎవరు అందుకోవాలి? ఎన్టీయార్ నుండి టిడిపిని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడికి కానీ..ఎన్టీయార్ సంతానానికి కానీ అవార్డు అందుకునే అవకాశం లేదు. ఎందుకంటే అవార్డును దివంగత నేత సతీమణికే అందించాల్సి ఉంది. అపుడు లక్ష్మీ పార్వతి దేశ వ్యాప్తంగా వార్తల్లోకెక్కుతారు. ఈ కారణంగానే చంద్రబాబు నాయుడు కానీ ఏపీ బిజెపి చీఫ్ గా ఉన్న ఎన్టీయార్ తనయ పురంధేశ్వరి కానీ ఎన్టీయార్ కు భారత రత్న అవార్డు కోసం గట్టిగా ప్రయత్నించలేదని అంటారు. కేవలం ఆయన జయంతి రోజున వర్ధంతి రోజున మాత్రమే ఎన్టీయార్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఎన్టీయార్ కు కూడా పి.వి.తో పాటు అవార్డు ఇచ్చి ఉంటే ఏపీలోనూ బిజెపికి కొంచెం ఇమేజ్ పెరిగేదని పరిశీలకులు అంటున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…