నేరం – శిక్ష – న్యాయ సంహిత !

By KTV Telugu On 3 July, 2024
image

KTV TELUGU :-

కేంద్ర ప్రభుత్వం దేశ క్రమినల్ చట్టాలన్నింటిని సమూలంగా మార్చేసింది.  ఐపీసీ స్థానంలో ఐపీసీ స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ అమల్లోకి వచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్,  కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లను రద్దు చేసి.. వాటి  స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు.  . ఇక  ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చునని..  సెర్చ్ ఆపరేషన్ చేస్తే సెర్చ్ వారెంట్‌తోపాటు ఎవరి వద్దకైనా వెళ్తే వీడియోగ్రఫీ చేయాల్సిందేనని చట్టాల్లో మార్చారు.  ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జిషీట్ వరకు అన్ని డిజిటైలైజ్ చేయాల్సి ఉంటుంది. కానీ వీటిపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

భారతీయ న్యాయ సంహితా2023 చట్టం  సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి.  న్యాయ వ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకువచ్చేలా క్రిమినల్ చట్టాలను రూపొందించారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్ధానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం, నాగరిక్ సురక్ష సంహిత అమలు కానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ న్యాయ వ్యవస్థలో కీలక మార్పులను తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించింది. ఈ చట్టాల ప్రకారం శిక్షల్ని కూడా మార్పు చేశారు. భారతీయ నాగ్రిక్ సురక్ష సంహితలో 531 విభాగాలు, 177 నిబంధనలు, 9 సెక్షన్లు, 39 సబ్ సెక్షన్లు ఉంటాయి. భారతీయ సాక్ష్యాలో మొత్తం 14 సెక్షన్లు, 170 నిబంధనలు ఉంటాయి. ఈ చట్టాలను డిసెంబర్ 2023లో పార్లమెంట్ ఆమోదించింది. అదే నెలలో రాష్ట్రపతి ఆమోదం పొందినప్పటికీ, కేంద్రం వాటి అమలును వాయిదా వేయడంతో అవి అమలులోకి రాలేదు. దేశంలోని  న్యాయ వ్యవస్థకు కీలకమైన ఈ 3 చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు కేంద్రం నోటిఫై చేసింది.

ఇప్పటి వరకూ  జీవిత ఖైదు అంటే పధ్నాలుగు ఏళ్లు అనే లెక్కలు వేసేవాళ్లు. కానీ ఇక నుంచి జీవిత ఖైదు అంటే.. జీవించి ఉన్నంత వరకూ అని అర్థం. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు.   మహిళలు, పిల్లలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేక నేరాలకు కఠిన శిక్షలను కొత్త చట్టాల్లో ప్రతిపాదించారు. చిన్నచిన్న నేరాలకు సంఘసేవను శిక్ష విధించబోతున్నారు.  .వేర్వేరు నేరాలకు సంబంధించిన జరిమానాలు, శిక్షలను పెంచారు.  మైనర్లను అత్యాచారం చేస్తే ఉరిశిక్ష ,స సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు ,  మూక దాడులకు ఏడేళ్ల జైలు,  7 సంవత్సరాలకుపైగా శిక్ష విధించే కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యాలు తప్పనిసరి అని ఈ చట్టాల్లో ఉంది. ఈ చట్టాల వల్ల జీరో ఎఫ్ఐఆర్, ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు, ఎస్‌ఎం‌ఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా సమన్లు జారీ చేయడం, క్రూరమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలు తప్పనిసరిగా వంటి నిబంధనలు అమలులోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశ ద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమాజంలో నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు తెచ్చామని కేంద్రం చెబుతోంది. కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడానికే ప్రాధాన్యం ఇస్తాయని  అంటున్నారు.  వలసవాద నేర న్యాయ చట్టాల ముగింపుతో పాటు, అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో సవరణలు తీసుకొచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.

కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లో తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుంచి 60 రోజులలోపే అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. అత్యాచార బాధితుల నివేదికలు 7 రోజుల్లోనే రావాలి. పిల్లలను కొనడం, అమ్మడం తీవ్రమైన చర్యగా పరిగణిస్తారు. మైనర్ పై సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. అంతే కాకుండా సాక్షల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్షాలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డీజీ లాకర్‌‌లో భద్రపరుస్తారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పుడు వాగ్దానాలతో సంబంధాలు పెట్టుకునే వారిపై కూడా కొత్త చట్టాల్లో కఠిన శిక్షలు ఉన్నాయి. అయితే ఈ చట్టాల అమలుపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వాహనదారుల నుంచి వ్యతిరేకత వస్తోంది.

ఇప్పటి వరకూ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని ఒక్క సెక్షన్‌  ప్రకారమే యాక్సిడెంట్‌ కేసుల్లో జరిమానాలు, శిక్షలు విధించేవారు. ఇప్పుడు భారత న్యాయ సంహితలో దీనిని రెండు సెక్షన్లకు విస్తరించారు.  యాక్సిడెంట్‌ కేసుల్లో ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకూ శిక్ష విధించే అవకాశం ఉంది.  ఐపిసి సెక్షన్‌ కింద ఇప్పటి వరకూ 6 నెలల జైలు శిక్ష మాత్రమే విధిస్తున్నారు.   రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లు మాత్రమే కారణం కాదని, ఇంకా అనేక అంశాలు కారణమవుతున్నాయని పేర్కొంది. వాటిపై వివరణాత్మక చర్చలు, దిద్దుబాటు చర్యలు, విధాన నిర్ణయాలు జరగాల్సి ఉందని రవాణా రంగం చెబుతోంది. గతంలో సమ్మె కూడా చేశారు. అయినా కేంద్రం ముందుకెళ్తోంది.అలాగే న్యాయవాద వర్గాలు కూడా సంహితకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులోపిటిషన్లు వేశారు. కానీ అమల్లోకి వచ్చేశాయి.

దేశంలో  అనేక కఠినమైన చట్టలు వచ్చాయి.  నిర్భయ ఘటన జరిగినప్పుడు భయపడేలా చట్టాలు తెచ్చామని  ప్రకటించారు. కానీ అలాంటి నేరాలు తగ్గలేదు. దానికి కారణం అమలులో చిత్తుశుద్ధి లేకపోవడం. న్యాయసంహితను అయినా పక్కాగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి