విషాదం నింపిన బాలాసోర్ ప్రమాదం.. ఆ కారణంతోనే ప్రమాదం జరిగిందా

By KTV Telugu On 4 June, 2023
image

రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా కారణాలపై పోస్టు మార్టం చేయడం మామూలు విషయమే. ఈ సారి కూడా అదే జరిగినా ఎవరూ ఊహించిన ఒక కారణం తెరపైకి వచ్చింది. సాంకేతిక లోపం, మానవ తప్పిదం. మాటలు ఎలా ఉన్నా సరే ప్రమాదానికి అసలు కారణం వేరొకటి ఉందని నిగ్గు తేల్చారు. అదే సిబ్బంది కొరత. రైల్వేల్లో ఉండాల్సినంత మంది ఉద్యోగులు లేకపోవడంతో సమర్థత లోపించిందని చెబుతున్నారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం దాదాపు 300 ప్రాణాలు బలిగొన్నది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఒకదానినొకటి ఢీకొని నుజ్జునుజయ్యాయి. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ లోపు ప్రమాద కారణాలపై పోస్టు మార్టం మొదలైంది. భారతీయ రైల్వే ఇప్పుడు సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతోందని, దీని వల్ల వేర్వేరు జోన్లలో నిర్వహణా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోందని తెలుస్తోంది.

ఉద్యోగుల కొరతతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని 2019 డిసెంబరులోనే రైల్వే స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది. మూడు సంవత్సరాల తర్వాత అదే సిబ్బంది కొరత భారీ రైలు ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. తాజా రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం ఆగ్నేయ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 2023 ఫిబ్రవరి నాటికి అక్కడ 96 వేల 582 నాన్ గెజిటెడ్ పోస్టులకు అనుమతి ఉంది. అందులో 17 వేల 811 పోస్టులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. మరో పక్క 937 గెజిటెడ్ పోస్టులు మంజూరయితే అందులోనూ 150 ఖాళీగా ఉన్నాయి. రైల్వే వంతెనల తనిఖీలు రైళ్ల రాకపోకల నిర్వాహణా విభాగంలోనూ భారీగా ఖాళీలు కనిపిస్తున్నాయి. ఆ విభాగంలో 7 వేల 669 మంది సిబ్బంది ఉండాలని కేవలం 4 వేల 517 మంది పనిచేస్తున్నారని స్టాండింగ్ కమిటీ నిగ్గు తేల్చింది. అంటే 40 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. సిబ్బంది లేకపోవడం ట్రాకుల ఇన్‌స్పెక్షన్ జరగడం లేదని తేల్చారు. రైలు ప్రయాణికుల భద్రతలో నిర్లక్ష్యం పెరిగిపోయిందని స్టాండిగ్ కమిటీ 2019లోనే ప్రకటించింది.

రైల్వే శాఖ మొత్తంగానే ఇప్పుడు సిబ్బంది కొరతతో శతమతమవుతోంది. అన్ని జోన్స్‌లో కలిపి 3 లక్షలకు పైగా నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులోనూ ఉత్తర రైల్వేలో అత్యధికంగా 39 వేల నాన్ గెజిటెడ్ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. ఏటా పది వేల ఖాళీలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని ఎప్పటికప్పుడు వాటిని భర్తీ చేస్తున్నామని చెబుతున్న రైల్వే ఉన్నతాధికారులు మరి ఇంత రేంజ్ లో ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. ప్రతీ సంవత్సరం రెండు లక్షల మందికి పైగా ఉద్యోగులు రిటైరవుతున్నారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియ మాత్రం వేగం పుంజుకోవడం లేదు. నిరంతరం కొనసాగాల్సిన నియామకాలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలి. రైల్వే శాఖను ఇబ్బంది పెడుతున్న సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రయత్నించాలి. అప్పుడు పనిలో సమర్థతా లోపం, తీరని జాప్యాన్ని నివారించే వీలుంటుంది. లేకపోతే బాలాసోర్ టైప్ ప్రమాదాలను ఆహ్వానించినట్లే అవుతుంది.