భూకంప విలయంతో టర్కీ కకావిలకమైంది. వేలాది మందిని పొట్టన పెట్టుకున్న రాకాసి విపత్తు టర్కీతో పాటు సిరియానూ చావు దెబ్బతీసింది. అయిన వాళ్లంతా నిద్రట్లోనే శిధిలాల కింద సమాధి అయిపోవడంతో బతికున్నవారు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. దేశమంతా గాయమే. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో టర్కీతో పాటు సిరియాను ఆదుకోడానికి ఓ ఆప్తమిత్రుడు అమాంతం రంగంలోకి దిగిపోయాడు. ఆ ఆప్తుడే భారత దేశం. అగ్రరాజ్యాలని చెప్పుకునే చాలా దేశాలు టర్కీని ఎలా ఆదుకోవాలా అని ఆలోచన చేస్తోంటే భారత్ అప్పటికే టర్కీలో సాయం మొదలు పెట్టేసింది. ఫిబ్రవరి 6న తెల్లవారు జాము నాలుగు గంటల పదిహేడు నిముషాల ప్రాంతంలో ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న వేళ భారీ భూకంపం దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. క్షణాల్లో అంతా నాశనం అయిపోయింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ఎన్నో రెట్ల మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. టర్కీతో పాటే సిరియానూ భూకంపం ధ్వంసం చేసింది. యావత్ ప్రపంచం ఈ పెనువిపత్తు చూసి దిగ్భ్రాంతికి గురైంది. శిధిలాల గుట్టగా మారిన టర్కీ సిరియాల్లో ఇంకా ఎన్ని వేల మంది శిధిలాల కింద చిక్కుకుపోయారో తెలీదు.
ప్రపంచ దేశాలన్నీ ఈ వార్త విని ఉలిక్కిపడ్డాయి. ఆపదలో ఉన్న టర్కీని ఆదుకుంటామని 70కి పైగా దేశాలు భరోసా ఇచ్చాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, యూకే వంటి దేశాలు ఎలా సాయం చేయాలని ఆలోచిస్తున్నాయి. వారు ఆలోచనల్లోనే ఉన్నారు. అప్పటికే భారత దేశం సాయం చేయడానికి టర్కీలో అడుగు పెట్టేసింది.
టర్కీ భూకంపం గురించిన వార్త ప్రపంచ మంతా వైరల్ అయిన క్షణాల్లోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ టర్కీ, సిరియాలకు సహాయక సామగ్రితో పాటు సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను ఆగమేఘాల మీద టర్కీ పంపాలని ఆదేశించారు. ఆయన చెప్పడమే తరువాయి భారతీయ సైన్యం మెరికల్లాంటి కుర్రాళ్లతో కూడిన ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను ఆర్మీ యుద్ధ విమానం సీ -సెవెన్టీన్ లో పంపారు. ఒక ట్రిప్పు కాదు ఇదే యుద్ధవిమానం ఇప్పటికే నాలుగు సార్లు టర్కీకి సామగ్రిని , బృందాలను తరలించింది. 108 టన్నుల సహాయ సామగ్రితో పాటు డాగ్ స్క్వాడ్స్, పెద్ద మొత్తంలో ప్రాణాధార ఔషధాలు వైద్య పరికరాలను టర్కీ తరలించింది భారత్. పెను విపత్తులో శిధిలాల కింద ఇరుక్కుపోయిన వారిని వెలికి తీస్తే వారిలో చాలా మంది గాయాలతో బాధపడుతూ ఉంటారు. అందుకే సహాయ సామగ్రితో పాటు సహాయక చర్యలు చేపట్టే చోటే ఓ ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన పరికరాలను తీసుకెళ్లింది భారత్.
30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ప్రత్యేక వైద్య బృందాలు తరలి వెళ్లాయి. ఎక్స్రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, కార్డియాక్ మానిటర్లను కూడా తీసుకువెళ్లారు. టర్కీకే కాదు సిరియాకూ కొన్ని బృందాలను కొంత సామగ్రిని పంపించారు. భారత సైనికులు శిధిలాల కింద చిక్కుకున్న కొన ప్రాణంతో ఉన్న ఆరేళ్ల చిన్నారిని కాపాడి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీల్డ్ హాస్పిటల్ లోనే చికిత్స అందించారు. వెళ్లిన దగ్గర నుంచి మన సైనికులు అహోరాత్రులూ నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంతో మందిని ప్రాణాలతో కాపాడగలిగారు.
తమ సహాయక కార్యక్రమాలకు ఆపరేషన్ దోస్త్ అని పేరు పెట్టారు భారత సైనికులు. భారత ప్రభుత్వం అందరికన్నా ముందుగా స్పందించి అందించిన సహాయాన్ని చూసి టర్కీ పాలకులు కూడా కదిలిపోయారు. భారతే నిజమైన దోస్త్ లా వ్యవహరించింది. మేం అడక్క ముందే సాయంలోకి దిగిపోయింది అని టర్కీ ప్రభుత్వం ఉద్వేగంగా కొనియాడింది.
టర్కీ తో పాటు సిరియా ప్రభుత్వం కూడా భారత్ వైఖరిని ప్రశంసించింది.
భారత బృందాలు సహాయ చర్యల్లో మునిగిపోయిన తర్వాత కూడా అమెరికా వంటి ప్రపంచ అగ్ర దేశాల నుండి టర్కీకి సాయం కార్యరూపం దాల్చలేదు. భారత్ వ్యవహరించిన తీరును ప్రపంచ దేశాలు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాయి. ఎవరో అడిగిన తర్వాత సాయం చేయడం వేరు. వారు బాధలో ఉన్న క్షణంలోనే వారి సమస్యను గుర్తించి సాయం అందించడం వేరు. అది కూడా కష్టంలో ఉన్నప్పుడే సాయం చేయాలి. అంతే కానీ కష్టం నుండి తేరుకున్నాక సాయాన్ని పార్సిల్ చేసి పంపడం వల్ల ప్రయోజనం ఉండదు. భారత్ కు సాయాలు చేయడం కొత్త కాదు. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా మేం ఉన్నాం అని భారత్ అడ్డుపడిపోయి సాయం చేసేస్తుంది. కొన్నేళ్ల క్రితం నేపాల్ పై పగబట్టినట్లు భూ ప్రళయం విరుచుకు పడి విషాదం నెలకొన్నప్పుడు మును ముందుగా సాయం చేయడానికి వెళ్లింది భారతే.
ఎందుకంటే వేల సంవత్సరాల క్రితమే భారత్ వసుధైక కుటుంబ నినాదాన్ని ప్రపంచానికి అందించింది. సువిశాల విశ్వంలో ఉండే అంతా కలిపి ఒకే ఒక్క కుటుంబం అన్నది సనాతన భారతం అందించిన అద్భుత ధర్మం. దానికి భారతీయులు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. ఆ ధర్మంలో భాగంగానే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఆపద వచ్చినా భారత్ మౌనంగా ఉండదు. వెంటనే వెళ్లి సాయం అందించి మౌనంగానే వెనక్కి వస్తుంది. మేం ఇంత సాయం చేశామని ఎక్కడా చెప్పుకోదు కూడా. ఆ సంప్రదాయాన్నే ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగించారు. భారత్ అందించిన సాయాన్ని మర్చిపోలేం అని టర్కీ పాలకులు అన్నారంటే వారు ఎంత కష్టంలో ఉన్నప్పుడు భారత్ ఆదుకుందో అర్ధమవుతుంది. భారత్ సాయమే చేస్తుంది తప్ప ఆ సాయం నుండి ఏ ప్రతిఫలాన్నీ కోరుకోదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశానికీ లేని విశ్వసనీయత ఒక్క భారత దేశానికే ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోవడం ఓకే కానీ ఆపదలో ఉన్నది మన శత్రువైనపుడు ఎందుకు సాయం చేయాలి అని ఎక్కువ మంది భావిస్తారు. ఎక్కువ ప్రపచం దేశాలు ఈ లాజిక్ నే సమర్ధిస్తాయి కూడా. కానీ భారత దేశం మాత్రం దీనికి విరుద్ధం.కష్టాల్లో సాటి మనిషో దేశమో బాధపడుతూ ఉంటే మరో ఆలోచనే లేకుండా ముందుగా సాయం చేయాలి కదా అన్నది భారత్ నమ్మే ధర్మం.
మిత్రుడా శత్రువా అన్నది తర్వాత. ముందుగా అతను మనిషి కదా అన్నది భారత తత్వం. ఇదంతా ఎందుకంటే టర్కీ కి సాయం గురించే. టర్కీ మనకి శత్రువు కాదు. అలాగని మిత్రువు కూడా కాదు. కాకపోతే ప్రతీ విషయంలోనూ ప్రతీ వేదికపైనా భారత ప్రయోజనాలకు విరుద్ధమైన వైఖరినే ప్రదర్శిస్తోంది టర్కీ. ప్రత్యేకించి తమది ఇస్లామిక్ రాజ్యమని ప్రకటించుకున్న తర్వాతి నుండి భారత వ్యతిరేక వ్యాఖ్యల చేయడం టర్కీకి మామూలైపోయింది. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తే దానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ కు అండగా టర్కీ కూడా వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 370 రద్దు దుర్మార్గం అంది. ఆర్టికల్ 370 అనేది భారత రాజ్యాంగంలోనిది. దాన్ని ఉంచుకోవాలా రద్దు చేయాలా అన్నది భారత ప్రభుత్వం ఇష్టం. దాన్ని ప్రశ్నించడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ పిల్ల కాకి టర్కీ ఎవరు. పాకిస్థాన్ దాన్ని వ్యతిరేకిస్తోంది కాబట్టి పాకిస్థాన్ తనకు మిత్ర దేశం కాబట్టి ఇద్దరివీ ఇస్లామిక్ రాజ్యాలు కాబట్టి టర్కీ దాన్ని వ్యతిరేకించేసింది.
కశ్మీరు విషయంలోనూ పాక్ వైఖరికి దగ్గరగానే టర్కీ ఆలోచనలు ఉంటాయి. పాకిస్థాన్ కు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటుంది టర్కీ. అయినా సరే టర్కీలో భూకంపం వచ్చిందన్న సమాచారం తెలీగానే భారత ప్రభుత్వం టర్కీకి సాయం చేయాలా వద్దా అన్న ఆలోచన కూడా చేయలేదు. లక్షలాది మంది ప్రజలు టర్కీలో నరకయాతన పడుతూ ఉంటే సాయం చేయకుండా మౌనంగా ఉండడం క్షమించరాని నేరమే అనుకుంది భారత్. అందుకే మన ప్రధాని ఔన్నత్యాన్ని చాటుకుంటూ భారతీయ విలువలకు ధర్మానికి పట్టం కడుతూ టర్కీ, సిరియాలకు సాయం పంపారు. ఇలా సాయం చేయడాన్ని గొప్ప విషయంగా భారత్ భావించడం లేదు. ఎందుకంటే ఇలాంటి సాయాలూ భారత్ కు కొత్త కావు కాబట్టి.
ఎవరో ఎందుకు భారత్ కు నిజమైన శత్రుదేశం ఏదైనా ఉందంటే అది ఒక్క పాకిస్థానే. పాకిస్థాన్ అణువణువునా భారత్ పై శత్రుత్వమే నింపుకుని ఉంది. భారత్ లో అశాంతి రాజేయడానికి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది.
ఏళ్ల తరబడి భారత్ లో మరణహోమాలకు పాకిస్థాన్ గడ్డపైనే వ్యూహరచన జరుగుతూ ఉంది. భారత్ లో విధ్వంసాలు సృష్టించిన ఉగ్రవాదులకు పాక్ పాలకులే ఆశ్రయం ఇస్తున్నారు. భారత్ పై ఇంత విషం చిమ్ముతోన్న పాకిస్థాన్ కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి అందరి కన్నా ముందు లేచినిలబడేది భారతే. భారీ వర్షాలు వరదలు పాకిస్థాన్ ను అల్లకల్లోలం చేస్తే పాకిస్థాన్ ఆహారం సంక్షోభంలో కూరుకుపోతే ఆహార ధాన్యాలు పంపడానికి భారత్ సిద్ధమైపోయింది. అదీ భారత్ అంటే. పాకిస్థానే కాదు మన పొరుగునే ఉన్న శ్రీలంక కొన్నేళ్లుగా చైనా మాయలో పడి మనల్ని దూరం పెట్టి చైనాతో సహవాసం చేస్తోంది. చైనా చెప్పిందానికి తలాడిస్తూ మన ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడానికి కూడా లంకేయులు సిద్ధమైపోయారు. అయినా సరే శ్రీలంక పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయి ఆకలో రాజపక్సా అంటూ జనం కేకలు వేస్తోంటే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా లక్షలాది టన్నుల ఆహార ధాన్యాలను ఇతర నిత్యవాసర సరుకులు, ఔషధాలను శ్రీలంకకు ప్రేమగా పంపించింది భారత్. ఎందుకంటే భారత్ కు ప్రేమించడమే తెలుసు . ద్వేషించడం తెలీదు. స్నేహంగా ఉండడమే తెలుసు. స్నేహంగా ఉన్నట్లు నటించడం తెలీదు. ధర్మంగా నడుచుకోవడమే తెలుసు. అధర్మానికి ఇసుమంతైనా చోటివ్వడం తెలీదు.
ఆఫ్ఘనిస్థాన్ లో ప్రజా ప్రభుత్వం నడుస్తోన్నప్పుడు వెనకబడి ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం భూరి విరాళాలు ఇవ్వడమే కాదు భారతే రంగంలోకి దిగి ఆఫ్ఘన్ ప్రగతిలో కీలక పాత్ర పోషించింది. అక్కడి తాలిబాన్ తీవ్రవాదులు భారత్ పై విషం చిమ్ముతారని తెలిసినా ఆఫ్ఘన్ ప్రజల కష్టాలను మాత్రమే చూసింది భారత్. వారి వెనుక ఉన్న ఉగ్రవాదులను కానీ వారి అజెండాను కూడా భారత్ పరిగణనలోకి తీసుకోలేదు. నేపాల్ భూటాన్ లు చైనా ట్రాప్ లో పడుతోన్నా వాటికి సాయం చేయడం ఆపలేదు భారత్. ఇపుడు మనం సాయం చేస్తే మన నుండి సాయం పొందిన వారు రేపు మనకి సాయం చేస్తారా చేయరా అని భారత్ ఎప్పుడూ లెక్కలు వేసుకోదు. వేసుకోనూ లేదు. సాయం చేయడం అక్కడితో మర్చిపోవడం కొత్త సాయానికి రెడీ కావడం ఇవే భారత్ కు తెలిసిన ధర్మాలు. అమెరికా అగ్రరాజ్యం కావచ్చు. ఆర్ధికంగా ప్రపంచంలోనే నంబర్ వన్ కావచ్చు. చైనా సూపర్ పవర్ కావచ్చు. తిరుగులేని ఆర్ధిక శక్తి కావచ్చు.
యూకే ఎక్కువకాలం భూమిని ఏలిన ఘన చరిత్ర కలిగి ఉండచ్చు. అలాగే ఇతర పెద్ద దేశాలు ఏదో ఒక విషయంలో ఆధిపత్యం చెలాయించవచ్చు. కానీ వీటిలో ఏ ఒక్కదేశానికీ కూడా భారత్ కు ఉన్న విశ్వసనీయత లేదంటారు రాజకీయ విశ్లేషకులు. అదే భారత్ సంపాదించిన అసలు సిసలు ఆస్తి. అది ధార్మిక విలువల పునాదిమీద నిర్మించిన దుర్బేధ్యమైన కీర్తి కోట.