పాకిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా పరిస్థితి పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆహార ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంతో అది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. గోధుమపిండి, ఉల్లిపాయలు, చికెన్ లాంటి సరుకుల ధరల్లో 500 నుండి వెయ్యి శాతం పెరుగుదల కనిపిస్తోంది. విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటాయి. ప్రస్తుతం 4 బిలియన్ డాలర్లు మాత్రమే విదేశీ మారక ద్రవ్య నిలువలు ఉన్నాయి. ఇది మరో రెండు వారాలకు సరిపడ దిగుమతులకు మాత్రమే సరిపోతుంది. పాకిస్తాన్ కరెన్సీ విలువ డాలర్‌కు 229 రూపాయలకు పడిపోయింది. ఆహార సంక్షోభం కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకోవడంతో గోధుమపిండికోసం జనం తన్నుకునే పరిస్థితి నెలకొంది. భద్రతా దళాల పర్యవేక్షణలో గోధుమ పిండిని పంపిణీ చేస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం రాయితీపై అందించే గోధుమ పిండి కోసం ఖైబర్ ఫక్తుంఖ్వా, సింధ్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి క్యూల్లో నిలబడుతున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
ప్రస్తుతం పాకిస్తాన్‌లో నెలకొని ఉన్న పరిస్థితులకు అద్దంపట్టే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గోధుమ పిండి లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు వెంట వందలాదిమంది బైకులతో వెంబడించారు. ప్రాణాలకు తెగించి ఇద్దరు వ్యక్తులు ట్రక్కు వెనకభాగంలోకి ఎక్కి డబ్బులిచ్చి గోధుమ పిండి బ్యాగులు ఇవ్వమని బతిమిలాడడం ఆ వీడియోలో కనిపిస్తోంది. యూకేలోని సజ్జద్ రజా అనే ప్రొఫెసర్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఇది బైక్ ర్యాలీ కాదని, గోధుమ పిండి కోసం పాక్ ప్రజలు పడుతున్న కష్టాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. పాకిస్థాన్‌తో భవిష్యత్తు ఉందని ఇప్పటికీ భావిస్తున్నారా? అని జమ్మూకశ్మీర్ ప్రజలను ఆయన ప్రశ్నించారు. ఈ గడ్డు పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో పాక్ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. తిండి కోసం జనం అల్లాడిపోతున్నారు. అప్పు పుడితే తప్ప రోజు గడవలేని పరిస్థితి నెలకొంది. తాము ఎదుర్కొంటున్న దీన స్థితిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. అణ్వస్త్ర దేశమైన పాకిస్థాన్ డబ్బుల కోసం ఇతర దేశాల వద్ద చేయి చాచడం సిగ్గుచేటని అన్నారు. ఇటీవల తాను యూఏఈకి వెళ్లినప్పుడు అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ పాకిస్థాన్ కు వంద కోట్ల డాలర్లను అప్పుగా ప్రకటించారని వెల్లడించారు. పాక్ కు ఆర్థిక సాయం చేసిన సౌదీ అరేబియాకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. తీసుకున్న రుణాలను తీర్చక తప్పదని చెప్పారు.