పాకిస్థాన్ నక నక లాడుతోంది. పాలకుల వైఫల్యాలపై ప్రజలు కుత కుత లాడుతున్నారు. పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశం ఆకలి కేకలేస్తోంది. ఒక పక్క రాజకీయ అనిశ్చితి. మరో పక్క ఆర్ధిక సంక్షోభం. మూడో వైపు నుంచి తెహరీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడులు.
దుర్భర జీవితాలు నరకాన్ని చూపిస్తున్నాయి. కష్టాల నుండి ఎపుడు బయట పడతారో తెలీదు. ఎంతకాలం కష్టాల కడలిని ఈదాలో తెలీదు. అసలు సమస్యలనుండి బయటపడతారో లేదో తెలీదు. చుట్టూరా చిమ్మచీకటి కమ్మేసినట్లు పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే దివాళా తీయడం ఖాయమని ఆర్ధిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్ పరిస్థితి అస్సలు బాగా లేదు. బాగా లేదంటే అత్యంత అధ్వాన్నంగా ఉందని అర్ధం. అధ్వాన్నంగా అంటే బతుకు నరకప్రాయం అయిపోయిందని భావం.
నరక ప్రాయం అంటే మామూలు నరకం కాదు మనుషులు బతికే వీలు లేని దుర్భర ప్రాయమని అర్ధం.
పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయాక పాలకులు ఒక్క ఉదుటున గాఢ నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచారు. ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఏం చేయాలా అని కళ్లు నులుముకుని ఆలోచించారు. ఖర్చులు తగ్గించుకుంటేనే కానీ సంసారాలు ఈదలేమని భావించారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగంలో వీలైనంతగా ఆదా చేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే దేశ వ్యాప్తంగా ఉన్న వీధి దీపాల్లో సగానికి సగం దీపాలను వెలిగించకుండా ఆపేయాలని నిశ్చయించారు. ఒక దీపం వెలిగితే దాని తర్వాతి దీపం ఆఫ్ చేసి ఉంచుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతానికి పైగా విద్యుత్ ను ఆదా చేయాలని ఆంక్షలు విధించారు. ప్రభుత్వ కార్యాలయాలే కాదు షాపింగ్ మాల్స్, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, ఇతరత్రా దుకాణాలు అన్నీ కూడా రాత్రి 8-30 గంటలకల్లా మూసివేయాలని ఆదేశాలు జరీ చేశారు.
సినిమా హాల్స్, స్టార్ రెస్టారెంట్లు రాత్రి 10 గంటల తర్వాత తెరచి ఉంచకూడదన్నారు. ప్రజలు అత్యంత ఇష్టంగా తాగే ఛాయ్ పైనా ఆంక్షలు విధించారు. ప్రతీ మనిషీ రోజుకి రెండు కప్పుల కన్నా ఎక్కువ ఛాయ్ తాగడానికి వీల్లేదు. ఈ ఆంక్ష ఎందుకంటే పాకిస్థాన్ ప్రజలు వినియోగించే తేయాకు కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధార పడుతున్నారు. ఎప్పట్లా ఛాయ్ పత్తీని దిగుమతి చేసుకోవాలంటే విదేశీ మారక ద్రవ్యం సరిపడ లేదు. పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ నివేదిక ప్రకారం ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద 5.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల మేరకే ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఉంది.
అది మరో నాలుగైదు వారాల పాటు దిగుమతుల బిల్లులు చెల్లించడానికి మాత్రమే సరిపోతుంది.
కొత్తగా ఫారిన్ ఎక్స్ఛేంజీ నిల్వలు రావడం లేదు. దాంతో రోజులు గడిచే కొద్ది విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గిపోతూ వస్తున్నాయి.
విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గుతూ ఉండడంతో కావల్సిన సరుకులను దిగుమతి చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. పాకిస్థాన్ లో వినియోగించే వంట నూనెలు , నెయ్యి కూడా 90 శాతం మేరకు దిగుమతులపైనే ఆధార పడుతున్నారు.
వంట నూనెలను దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. అంతే కాదు ఇప్పటికే దిగుమతి అయ్యి కస్టమ్స్ ఆధీనంలో ఉన్న వంటనూనెలను విడిపించాలన్నా బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడం లేదు. అంచేత వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో వంట నూనె ఖరీదు రెండు వందలు దాటేసింది. మునుముందు అది రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది.
చక్కెర, గోధుమలు, ఇతరత్రా ఆహార పదార్ధాల ధరలకూ రెక్కలొచ్చేశాయి. ఇస్లామాబాద్ హైదరాబాద్ తో పాటు అన్ని నగరాల్లోనూ జీవితాలు దుర్భరం అయిపోయాయి. నగరాల్లో ఒక్క గది అద్దెకు తీసుకోవాలంటే నెలకు 10 వేల నుండి 12 వేలు చెల్లించాలి. ఒక్కగదిలో కుటుంబమంతా ఉండే పరిస్థితి లేదు కాబట్టి భార్యా పిల్లల్ని ఊళ్లల్లో ఉంచి భర్తలు మాత్రమే నగరాల్లో అద్దె గదుల్లో ఉంటూ ఏదో ఒక పని చేసుకు బతుకుతున్నారు. సంపాదించిన దాంట్లో కొంత ఊళ్లకు పంపిచి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో పిల్లల చదువులు అటకెక్కేస్తున్నాయి. ట్యాక్సీ నడుపుకుని బతుకు బండి లాగించే వారిపై పెట్రో ధరల భారం పిడుగులా పడింది. వెయ్యి రూపాయలు పెడితే మూడున్నర లీటర్ల పెట్రోలు మాత్రమే వస్తుంది. అంత ఖర్చు పెట్టి పెట్రోలు కొని ట్యాక్సీలను నడిపితే ఆకాశాన్నంటే ఛార్జీలు చెల్లించి కారెక్కేదెవరు?
చిన్న చిన్న హోటళ్లు, కుటీర పరిశ్రమలు చావు దెబ్బ తినేశాయి. ఉదాహరణకు చిన్న హోటళ్లు నడుపుకునే వారి ఆదాయాలు అమాంతం సగానికి పైగా తగ్గిపోయాయి. దానికి కారణం ఒకటే. టీ పొడి పంచదార గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ ఛాయ్ ఖరీదు మాత్రం అంతే ఉంది. ఇక చిన్న చిన్న హోటళ్లు నడిపేవాళ్లకు ఏం మిగులుతుంది? తమ దగ్గర పనిచేసేవాళ్లకు ఏం జీతాలు ఇవ్వగలరు?
పరిస్థితి చాలా అంటే చాలా భయంకరంగా మారిపోయింది. ఒక పక్క పాకిస్థాన్ లో తీవ్రమైన రాజకీయ అనిశ్చితి. మరో వైపు రోజు రోజుకీ పెరుగుతోన్న అప్పుల భారం. ఇవి చాలవన్నట్లు కొంతకాలంగా పేట్రేగిపోతోన్న తెహరీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ విధ్వంస దాడులు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాకిస్థాన్ పాలకులు ఉన్నారు. చిత్రం ఏంటంటే ప్రజలకు అత్యంత అవసరం అయిన వంటనూనెలు, నెయ్యి , టీ పొడి వంటివి దిగుమతి చేసుకోడానికి గల్లా పెట్టెలో డబ్బులు లేవని పాలకులు బీద కబుర్లు చెబుతున్నారు. ఇదే సమయంలో అమెరికా నుండి వేల కోట్ల ఖరీదు చేసే F16 యుద్ధ విమానాలను మాత్రం ఆగమేఘాల మీద దిగుమతి చేసుకుంటున్నారు. పేదల ఆకలి తీర్చే మార్గం తెలీడం లేదు కానీ దేశంలో తాము పెంచి పోషించి పెద్ద చేసిన ఉగ్రవాదులకు అవసరమైన ఆయుధాలు, బాంబులు కొనుగోలు చేయడానికి మాత్రం డబ్బుల కొరతే ఉండదు. ఉగ్ర శిబిరాలను నిర్వహించడానికి లక్షల కోట్ల రూపాయలు మంచి నీళ్ళల్లా ఖర్చు చేయగలరు కానీ పేద ప్రజలకు అవసరమైన ఆహార ఉత్పత్తులను మాత్రం దిగుమతి చేయలేం అంటూ చేతులెత్తేస్తున్నారు.
పాకిస్థాన్ లో ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని నడిపేది మాత్రం సైనిక నియంతలే. ఆర్మీ ప్రాధాన్యతలు వేరే ఉంటాయి. ఆర్మీ అధికారులకు ప్రజల ఆకలి తీర్చడం కన్నా పొరుగు దేశాలకు ఉగ్రహింసను ఎగుమతి చేయడంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఆసియా దేశాలను కన్నుగీటి ప్రేమ పలుకులు పలికే చైనా వారి అవసరాలను గుర్తించి వాటిని అప్పుల ఊబిలోకి లాగేస్తోంది. ముందేమో అవసరాలు తీర్చే అపద్బంధువుగా పోజు కొట్టే చైనా ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాలపై పెత్తనం చెలాయిస్తుంది. పాకిస్థాన్ కు తానే సాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చిన డ్రాగన్ కంట్రీ చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్ నిర్మాణానికి పెట్టుబడి పెట్టింది. దీని వల్ల తమకు లబ్ధి చేకూరుతుందని పాక్ అనుకుంది కానీ ఇంత వరకు ఈ కారిడార్ వల్ల పాక్ ఖజానాలోకి ఒక్క రూపాయి కూడా వచ్చి పడలేదు. అంతే కాదు భారీ వ్యయంతో చైనా ఇక్కడ నిర్మించిన పోర్టుక ఇంత వరకు ఒక్క ఓడ కూడా రాలేదు. అరచేతిలో వైకుంఠం చూపించి పెట్టుబడుల వరద పారిస్తున్నట్లు చేసి పాకిస్థాన్ మళ్లీ కోలుకునే పరిస్థితి లేకుండా కరెన్సీతో కొడుతోంది చైనా. ఇపుడా పెట్టుబడులపై 6 శాతం వడ్డీని ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది చైనా.
ఒక పక్క ఆదాయాలన్నీ పడిపోయాయి. వ్యాపారాలన్నీ చావు దెబ్బ తిన్నాయి. పాలకుల విధానాలకు తోడు 2022లో పాకిస్థాన్ ను ముంచెత్తిన భారీ వర్షాలు వరదల కారణంగా పాకిస్థాన్ అల్లకల్లోలం అయిపోయింది. పంటలన్నీ నాశనమయ్యాయి. ఆహార ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి. ఆహార కొరతతో ప్రజలు విల విల్లాడుతున్నారు. వరదల వల్ల మూడున్నర కోట్ల మంది జీవితాలు తల్లకిందులయ్యాయి.15 బిలియన్ డాలర్ల మేరకు పంట నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితినుండి దేశాన్ని గట్టెక్కించడానికి కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చేసిందేమీ లేదు. ఈ మధ్యనే పాకిస్థాన్ అమెరికాలోని తమ రాయబార కార్యాలయానికి సంబంధించిన కొన్ని ఆస్తులను తెగనమ్ముకుంది.
ఇతర దేశాల నుండి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే పరిస్థితిలో పాకిస్థాన్ లేదు. 2021 ఆర్ధిక సంవత్సరం అంతానికి పాకిస్థాన్ వివిధ దేశాలకు చెల్లించాల్సిన బకాయిలు 131 బిలియన్ డాలర్లకు పైనే ఉన్నాయి. అవి ఇప్పటికి రెట్టింపుకన్నా ఎక్కువ అయిపోయాయి. మును ముందు అప్పు పుట్టే పరిస్థితి లేదు. అన్నింటినీ మించిన విషాదం ఏంటంటే అప్పులు తీర్చడం కోసం పాక్ పాలకులు కొత్త అప్పులు చేస్తున్నారు. దీంతో సంక్షోభం భరించలేనంతగా పెరిగిపోతోంది. కనుచూపు మేరల్లో ఆర్ధిక స్థితి మెరుగు పడే అవకాశాలేవీ కనపడ్డం లేదు. పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటే రాజకీయ పార్టీలు మాత్రం ప్రజల క్షేమాన్ని పక్కన పెట్టి రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే తనను గద్దె దించిన వైనాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అధికారం దూరం అయ్యేసరికి ఆయనకు బొత్తిగా నిద్రపట్టడం లేదు. అందుకే ముందస్తు ఎన్నికలకోసం ఆయన రోజూ నినాదాలు చేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిథి సంస్థ పాకిస్థాన్ కు 3.9 బిలియన్ డాలర్ల మేరకు బెయిల్ అవుట్ ప్రకటించినా పాకిస్థాన్ సంక్షోభం నుండి గట్టెక్కలేకపోయింది. ప్రభుత్వం జారీ చేసిన బాండ్లు కూడా 60 శాతం మేరకు విలువ పడిపోయాయి.
15 కేజీల గోధుమ పిండి సంచీ ధర రెండు వేల యాభై రూపాయలకు పెరిగిపోయింది. రెండు వారాల్లోనే మడు వందల రూపాయలకు పైగా పెరిగింది.
ఇది ఇంతటితో ఆగేలా కనపడ్డం లేదు. మును ముందు ఇది ఇంకెంతకు పెరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మధ్యతరగతి, సంపన్న వర్గాలే ఆహార ఉత్పత్తులను కొనలేకపోతున్నారు. ఇక సామాన్య పేద తరగతి ప్రజలు ఎలా బతకాలి. ఎవ్వరూ ఏమీ కొనే పరిస్థితి లేదు. ఎండిన డొక్కలతో మాడిన కడుపులతో తడారిన కళ్లతో జనం నరకయాతన పడుతున్నారు.
2022 ఏప్రిల్ లో నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. దాని ఫలితంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. ఇమ్రాన్ ఖాన్ ఉద్యోగం ఊడింది. ఆయన స్థానంలో పాక్ ఆర్మీ అల్లారు ముద్దుగా చూసుకుంటోన్న షాబాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ అనాలోచిత విధానాల కారణంగానే దేశం దివాళా తీసిందని అప్పట్లో షాబాజ్ షరీఫ్ ఆరోపించారు. తాము ఆపరిస్థితని చక్కదిద్దుతామని కూడా ఆయన భరోసా ఇచ్చారు. అయితే చెప్పినంత వీజీ కాదు కదా చేసి చూపించడం. అందుకే ఆర్ధిక సంక్షోభం అప్పటికన్నా మరింతగా పెరిగి ఇపుడు పాక్ పాలకులను వెక్కిరించే స్థాయికి పెరిగిపోయింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. ద్రవ్యోల్బణం ఎన్నడూ లేని విధంగా 23 శాతానికి పెరిగిపోయింది.
డాలర్ తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి ధర 227 కి పెరిగిపోయింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రభావంతో పాకిస్థాన్ దిగుమతులు క్షీణించాయి.
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు పాకిస్థాన్ ఆర్ధిక సంక్షోభానికి అంతకు మించిన కారణాలే ఉన్నాయంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.