భారత సైన్యం హై అలెర్ట్ లో ఉంది. యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయింది. శత్రువును చీల్చి చెండాడేందుకు సిద్ధమైంది. అయితే ఇందులో ఎలాంటి రాజ్యకాంక్ష లేదు భారత ప్రజలకు పొరుగు భూభాగం అవసరం లేదు కాకపోతే పొరుగున ఉన్న పాకిస్ఠాన్ యుద్ధానికి రాబోతోందని తెలుసుకుని ఇండియన్ ఆర్మీ రెడీ అవుతోంది. పాకిస్థాన్ శతకోటి సమస్యలతో శతమతమవుతోంది. ఆర్థికంగా ఆ దేశం పూర్తిగా దిగజారిపోయింది. శ్రీలంక పరిస్థితులు పాకిస్థాన్లోనూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ రూపంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. కేసుల విచారణకు ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసిన ఆర్మీ తర్వాత భంగ పడక తప్పలేదు. పాకిస్థాన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఉమర్ అటా పాక్ ఆర్మీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించడంతో పంతం నెగ్గక ఆర్మీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది.
పాక్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ, చీఫ్ జస్టిస్ ఉమర్ అటా ఇద్దరూ ఇమ్రాన్ కు మద్దతుగా ఉండటంతో ఆర్మీ తట్టుకోలేకపోతోంది. పైగా ఇమ్రాన్ కు సమర్థింపుగా పాకిస్థాన్లో పలు చోట్ల అల్లర్లు జరిగాయి. జనం తీవ్ర ఆగ్రహంతో కనిపించిన వాహనాలను, భవనాలను, వస్తువులను తగులబెట్టారు. లాహోర్ లోని పాక్ ఆర్మీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇమ్రాన్ మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనల్లో ఆర్మీ జవాన్లతో పాటు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పాక్ చరిత్రలో ఇదీ కనీ వినీ ఎరుగని ఉపద్రవం. ఇంతకాలం పాకిస్థాన్ అంటే ఆర్మీ పెత్తనమేనని చెప్పుకోగా ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆర్మీ వ్యతిరేకులంతా మరోసారి ఉద్యమానికి సిద్ధమతున్నారు. తగులబెట్టిన ఆస్తుల విలువను నిందితుల నుంచి వసూలు చేస్తామని పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ హెచ్చరించినప్పటికీ నిరసనకారులు వదిలే అవకాశం కనిపించడం లేదు. మే 9 తర్వాత జరిగిన హింసాకాండకు ప్రభుత్వ ఏజెన్సీలే కారణమని వారే హింసను ప్రేరేపించారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు.
పాక్ ఆర్మీ చీఫ్ గా అసిం మునీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదోక ఘటన జరుగుతూనే ఉంది. సీనియర్లను పక్కన పెట్టి ఆయనకు ఆర్మీ చీఫ్ పదవి ఇవ్వడంతో చాలా మంది రాజీనామా చేసి వెళ్లిపోయారు. అసిం మునీర్ తీరు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్య ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఆర్మీ డిఫెన్స్ లో పడిపోయింది. పెషావర్, క్వెటా, లాహోర్ అట్టుడికాయి. ఇతర నగరాలకు నిరసనలు వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఆర్మీ ప్రయత్నిస్తున్నప్పటికీ అది అంత సులభం కాదని తేలిపోయింది. పాకిస్థాన్ ఆర్మీలో కూడా క్రమశిక్షణ లోపించిందని అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రస్తుత సంక్షోభం సమయంలో దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు పాకిస్థాన్ ఆర్మీ పాత ఎత్తుగడలను కొత్తగా జనంపైకి వదలబోతోంది. కొరివితో తలగోక్కున్నట్లుగా భారత్ తో కయ్యానికి కాలు దువ్వాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో శ్రీనగర్ జీ-20 పర్యాటక సదస్సును భగ్నం చేసేందుకు ప్రయత్నించింది. తమ చెప్పుచేతల్లో ఉండే ఉగ్రవాదులను ప్రేరేపించి ముంబై తరహా దాడులు చేయించేందుకు ప్రయత్నించింది. అయితే భారత భద్రతా దళాలు అటువంటి ప్రయత్నాన్ని సమర్థంగా తిప్పికొట్టాయి.
కశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు జార విడుస్తున్న పాక్ ప్రభుత్వం, తమ మాట వినే ముష్కరుల సాయంతో పెద్ద ఎత్తున చొరబాట్లు జరిపించి సాముహిక జన హననాన్ని సృష్టించేందుకు ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఏదో విధంగా భారత ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి యుద్ధానికి దించడం లేదా కార్గిల్ తరహా దుస్సాహసానికి దిగడం ద్వారా పాక్ ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తోందని చెప్పక తప్పదు. పాక్ ఆర్మీ చాలా సంవత్సరాలుగా ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు దిగడం మొదటిది. ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాక్ భూభాగంలోని పలు ప్రాంతాల్లో శిక్షణ పొందుతున్న మిలిటెంట్లను ఇండియాలోకి పంపించడం రెండోది. జూన్ మొదటి వారంలో పాకిస్థాన్ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారతాయన్నది ఒక వాదన. అప్పటికి పరిపాలనపై ప్రభుత్వ పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. దాన్ని ఆసరాగా తీసుకుని ఆర్మీ రెచ్చిపోవాలన్నా, ప్రభుత్వాన్ని డిమ్మీ చేసి తన కార్యకలాపాలు కొనసాగించాలన్నా ఒక డైవర్షన్ అవసరం. ప్రస్తుతం ఆర్మీ చేస్తున్న పని అదే. ప్రస్తుతం అశాంతి నెలకొన్న తమ దేశంలో మరింత అనిశ్చితి సృష్టించే దిశగా ఇండియాను రెచ్చగొట్టాలి. దానికి పాక్ ఆర్మీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.
ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన మన సైనికులు సిద్ధంగా ఉంటారు. ఈ మాట అనేక పర్యాయాలు రుజువైంది. గతంలో రెండు పర్యాయాలు సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాక్ కు బుద్ధి చెప్పారు. అయినా పొరుగు దేశం దారికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. పాక్ ఆర్మీ చేసిన తప్పులే చేసుకుంటూ పోతోంది. ఇటీవల సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కదలికలు పెరిగాయి. దానితో మన ఆర్మీ కూడా అదనపు బలగాలను సరిహద్దులకు తరలించింది. క్షణంక్షణం పహరా కాసేలా స్థానిక అధికారులకు ఆదేశాలిచ్చారు. పైగా ఇప్పుడు అత్యాధునిక యుద్ధ పద్ధతులను పాటిస్తున్నారు. అందులో ఎగిరే సైనికుల విధానం కూడా ఒకటిగా చెప్పొచ్చు. కశ్మీర్ సరిహద్దుల్లో హెలికాప్టర్లు, విమానాలు వెళ్లలేని చోట్ల ఎగిరే సైనికులు రంగంలోకి దిగుతారు.
బెంగళూరుకు చెందిన అబ్సల్యూట్ కంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏసీపీఎల్ అనే స్టార్టప్ సైనిక దుస్తులను జెట్ ప్యాక్ తరహాలో తయారు చేసింది. ఈ సూట్లు ధరించిన సైనికులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాల్లో ప్రయాణిస్తూ శత్రువులపై దాడి చేస్తారు. శత్రు తుపాకులకు అందకుండా 10 వేల మీటర్లు ఎత్తు వరకు ఎగిరే అవకాశం వారికి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్ల నుంచి వారి గమనాన్ని నియంత్రిస్తూ అవసరమైన సూచనలు చేసే అవకాశమూ ఉంది. జెట్ ప్యాక్ సైనికుల కారణంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని స్థావరాల్లో ఉన్న శత్రు సైనికులను టార్గెట్ చేసే వీలుంది. వీరితో పాటు శత్రువులపై దాడి చేసే అత్యాధునిక డ్రోన్లను, రిమోట్ ద్వారా నిర్వహించే మినీ ఎయిర్ క్రాఫ్ట్ లను యుద్ధ ప్రాతిపదికన సేకరిస్తున్నారు. ఏదేమైనా యుద్ధమంటూ జరిగితే పాక్ ఆర్మీ నేలమట్టం కావడం ఖాయమే అవుతుంది.