టెక్నాలజీ పరంగా ఇతర దేశాలకు అందనంత ఎత్తులో ఉన్న అగ్రరాజ్యం ఇప్పుడు అంతుబట్టని సాంకేతిక సమస్యతో సతమతం అవుతోంది. ప్రస్తుతం అమెరికాలోని పౌర విమానయానం మొత్తం కుప్పకూలిపోయింది. విమానాలు నడుపుతున్న పైలెట్లకు అందాల్సిన అలర్ట్స్ సడెన్‌గా స్తంభించిపోవడంతో ఆకాశంలో ఎగురుతున్న విమానాలన్నీ సమీపంలో ఉన్న ఎయిర్ పోర్టులల్లో ల్యాండ్ అయ్యాయి. సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్, అమెరికన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. దీంతో ఏం జరుగుతోందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెలాది సంఖ్యలో విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితం అయ్యాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు తలెత్తడమే దీనికి కారణమని తేలింది. ఏవియేషన్ అడ్మిన్‌లో కంప్యూటర్ అవుటేజ్ సంభవించడంతో విమానాలతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అనుసంధానాన్ని కోల్పోయారు.
కంప్యూటర్లు స్తంభించిపోవడం వల్ల నోటీస్ టు ఎయిర్ మిషన్ సిస్టమ్స్ ను జారీ చేయలేకపోయామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వివరించింది. కంప్యూటర్లు, సర్వర్లల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను యుద్ధప్రాతిపదికన సరి చేస్తున్నామని పేర్కొంది. వందల సంఖ్యలో విమానాల రాకపోకల్లో జాప్యం ఏర్పడటం పలు సర్వీసులు రద్దు కావడం వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానాలను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంపై ఎవరూ సరైన సమాచారం ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికాపై ఎవరైనా సైబర్ అటాక్ చేశారా అనే అనుమనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌ను విలేకరులు అడిగితే తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. అయితే సైబర్ అటాక్ లాంటిదేమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.