వైసీపీని మళ్లీ గిల్లిన హరీష్ రావు.. అసలు వ్యూహం ఏంటి

By KTV Telugu On 18 April, 2023
image

తన మామ కేసీయార్ పై హరీష్ కు ఎప్పుడు కోపం వచ్చినా ఇలా ఏపీ ప్రభుత్వం పై పడి ఏదో ఒకటి అంటూ ఉంటారని అపుడు ఏపీ మంత్రులు కేసీయార్ పాలనను తిట్టిపోస్తారు కాబట్టి హరీష్ రావుకు సంతోషంగా ఉంటుందని ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. దానికి ప్రతిగా తెలంగాణాలోని బి.ఆర్.ఎస్. నేతలు ఏపీ మంత్రులపై విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపైనా అక్కడి పాలనపైనా తెలంగాణాలోని బి.ఆర్.ఎస్. నేతల వివాదస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం బి.ఆర్.ఎస్. మంత్రి హరీష్ రావు తన నియోజక వర్గంలో ఆత్మీయ సమ్మేళనంలో ఆంధ్రా నుండి వలస వచ్చి స్థిరపడిన కూలీ నాలీలను ఉద్దేశించి మీకు ఏపీలోనూ తెలంగాణాలోనూ ఓట్లు ఉంటే అక్కడ రద్దు చేసుకుని తెలంగాణాలో ఓటు హక్కు ఉంచుకోండి. ఒక వేళ ఏపీలో మాత్రమే ఉండి తెలంగాణాలో ఓటు లేకపోతే ఏపీలో రద్దు చేసుకుని తెలంగాణాలో ఓటు హక్కు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోండి అని సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని తెలంగాణాతో పోల్చి చూస్తే భూమికీ ఆకాశానికీ ఉన్నంత తేడా ఉందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అక్కడ రోడ్లు ఆసుపత్రులు ఎలా ఉన్నాయో చూశారుగా ఇక్కడ అన్నీ అద్భుతంగా ఉంటాయి తెలంగాణాలో చెమటోడ్చే ఆంధ్రులు కూడా మా బిడ్డలే అంటూ వ్యాఖ్యానించారు.

మే ఒకటో తేదీన కార్మికుల జీవితాల్లో కాంతులు నింపే వరాలు ప్రకటించబోతున్నామంటూ ఆశ పెట్టారు. అయితే ఈ క్రమంలో ఆయన ఏపీపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. హరీష్ రావుకు గట్టి కౌంటర్ ఇచ్చారు కూడా. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రెచర్ లేకపోవడంతో ఓ రోగిని బంధువులు కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తోన్న దయనీయ దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏపీలో రోడ్లు ఆసుపత్రులను వెక్కిరించిన హరీష్ రావు తెలంగాణాలోని ఇంత గొప్ప ఆసుపత్రి వైభవం గురించి ఏం చెబుతారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు ట్రోలింగ్ చేశారు. చిత్రంగా ఇది ముగిసిపోయిందనుకుంటోన్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణా మంత్రులు చేసిన వ్యాఖ్యల విషయంలో ఏపీ మంత్రులు మితిమీరి స్పందించారని. తెలంగాణా మంత్రులు ఏమన్నా తప్పు మాట్లాడితే వారిని టార్గెట్ చేసుకోవాలే తప్ప తెలంగాణా ప్రజలను అవమానించడం కరెక్ట్ కాదంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఇది తనను బాగా బాధించిందని కూడా అన్న పవన్ ఏపీ మంత్రులు తక్షణమే తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానికి ఏపీ మంత్రులు హరీష్ రావు వ్యాఖ్యలకు రిప్లై ఇచ్చారే తప్ప తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణా జాతిని కానీ అవమానించలేదు. అయినా పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు స్పందించారో ఎవరికీ అర్ధం కాలేదు.

కాకపోతే పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కన్నతల్లి వంటి ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ మంత్రి హరీష్ రావు అవమానిస్తే పవన్ కళ్యాణ్ కు కొంచెం కూడా బాధ అనిపించలేదా అని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని నిలదీశారు. గతంలో కేసీయార్ ను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కళ్యాణ్ మీరు ఇష్టం వచ్చింది అంటూ ఉంటే పడి ఉండటానికి మేమేమన్నా బానిసలమా ఇంకోసారి ఇలా అంటేతాట తీస్తాం అని పవన్ గతంలో అన్న వ్యాఖ్యను మీడియా సమక్షంలో ప్లే చేసిన పేర్ని నాని దీనికి పవన్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాలంటూ గతంలో కేసీయార్ కుటుంబ సభ్యులు చేసిన డిమాండ్ ను ఉద్దేశించి నేను క్షమాపణలు చెప్పాలా వద్దా అన్నది డిసైడ్ చేసేది నేనే తప్ప కేసీయార్ కుటుంబం కాదు అని  రిప్లై ఇచ్చారు పవన్. దీన్ని కూడా మీడియా సమక్షంలో ప్లే చేసిన పేర్ని నాని పవన్ కు కూడా ఇదే సమాధానం వర్తిస్తుందని సెటైర్ వేశారు. గతంలో బి.ఆర్.ఎస్. నేతలను విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇపుడు వారు ఏపీని తిట్టినా ఎందుకు సమర్ధిస్తున్నారని నిలదీశారు పేర్ని నాని.  ఓ టీవీ ఛానెల్ లో బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ పవన్ కళ్యాణ్ వద్దకు దూతలను పంపి వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారంటూ ప్రసారమైన కథనాన్ని ప్లే చేసిన పేర్ని నాని ఇక దీనిపై తానేమీ మాట్లాడనని పవన్ బి.ఆర్.ఎస్. ను ఎందుకు సమర్ధిస్తున్నారో ఇపుడు అర్ధమవుతోందని ముక్తాయించారు.

ఏమీ లేని దానికి బి.ఆర్.ఎస్. వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటే అందులో జనసేన ఎందుకు తలదూర్చిందో అర్ధం కాదంటున్నారు రాజకీయ పండితులు. ఇక ఏపీ నేతల తాజా వ్యాఖ్యల నేపథ్యంలో హరీష్ రావు మరోసారి వివాదస్పద వ్యాఖ్య చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అక్కడి పాలకులు మౌనంగా ఎందుకున్నారని మాత్రమే తాను అడిగానని దానికే అక్కడి మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారంటూ మళ్లీ గిల్లి కజ్జాకు సిద్ధమయ్యారు. చేతనైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలని సలహా ఇచ్చారు. విషయం ఏంటంటే పొరుగు రాష్ట్రంలో అక్కడి ప్రజలకు ఏం కావాలో అక్కడి పాలకులు చూసుకుంటారు. ఏం చేయాలో వారు ఆలోచించుకుంటారు. దాని గురించి తెలంగాణ మంత్రి మాట్లాడ్డం ఏంటి. విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ప్రేమ ఒలకబోస్తోన్న బి.ఆర్.ఎస్. మంత్రులు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు సాధించుకోలేకపోయారని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. తాజగా బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. తెలంగాణాలో మూతపడ్డ నిజాం సుగర్స్ ను తెరిపించడం చేతకాని కేసీయార్ ప్రభుత్వంలో మంత్రులు ఏపీలో ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ఆ మధ్య ఏపీలో బి.ఆర్.ఎస్. ను బలోపేతం చేస్తామని ప్రకటించి ఏపీ చీఫ్ గా తోట చంద్రశేఖర్ ను నియమించారు కేసీయార్. విశాఖ స్టీల్  ప్లాంట్ ఇష్యూనే కేసీయార్ వ్యూహాత్మకంగా కదపడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో బి.ఆర్.ఎస్. ను బరిలో దింపాలని కేసీయార్ భావిస్తున్నట్లు ఉందని భావిస్తున్నారు.

ఉత్తరాంధ్రలో కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ ఉంటారు. అదే సామాజిక వర్గానికి చెందిన కేసీయార్ ఉత్తరాంధ్రలో బలోపేతం కావడానికి సామాజిక సమీకరణతో పాటు విశాఖ ఉక్కు సెంటిమెంట్ ను కూడా జోడించాలని వ్యూహరచన చేసినట్లు భావిస్తున్నారు. ఏపీలో ఇతర జిల్లాల్లోనూ వెలమలు ఉన్నారు. ఇలాంటి రెండు మూడు సెంటిమెంట్లు జోడించి ఏపీలోనూ  పాగా వేయాలన్నది కేసీయార్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే దీని వల్ల ఏపీలో ఎంత లాభం ఉంటుందో తెలీదు కానీ ఏపీ ప్రజల మనోభావాలు గాయపడితే మాత్రం తెలంగాణాలో ఉన్న ఏపీ సెటిలర్ల ఓట్లు బి.ఆర్.ఎస్.కు దూరం కావడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉన్నదీ పోయే ఉంచుకున్నదీ పోయే అన్న సామెత మాదిరిగా ఇప్పటిదాకా బి.ఆర్.ఎస్.కు అండగా ఉన్న సెటిలర్లను కూడా దూరం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కేటీయార్ కూడా ఓ మీటింగ్ లో ఏపీలో రోడ్ల గురించి అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన దానికి ఏదో ఒక వివరణ ఇచ్చి విమర్శల తీవ్రతను తగ్గించుకున్నారు. కానీ హరీష్ రావు మాత్రం తీవ్రతను మరింత పెంచేలా రెచ్చగొట్టడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అన్నది చూడాలంటున్నారు పండితులు.