మోదీ 3.0 కోసం విశ్వప్రయత్నం జరుగుతోంది. 400 లోక్ సభా స్థానాలే గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతృత్వ ఎన్డీయే కదులుతున్న వేళ.. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కమలం పార్టీ సంకల్ప పత్ర..గా పిలిచే మేనిఫెస్టోలో పేద,అల్పాదాయ, దళిత వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. మేనిఫెస్టో అంటే చేయగలిగినవీ,ఆచరణ అసాధ్యమైనవీ కూడా ఉంటాయి కదా…
ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీ సంకల్పపత్రాన్ని ఆవిష్కరించారు. గ్యాన్ అంటే .. గరీబ్, యువ, అన్నదాత, నారీ కోసం ప్రత్యేక కార్యక్రమాలుంటాయని అన్నారు. మహిళలు, యువకులు, రైతులు, పేదల అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పేందుకు మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరిచారు. పనిలో పనిగా ఉమ్మడి పౌర స్మృతి అంటే యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని మరోమారు ప్రకటించారు. జమిలీ ఎన్నికలే తమ పార్టీ విధానమని కుండబద్దలు కొట్టారు. ప్రతి మనిషి గౌరవ ప్రదమైన జీవితాన్ని కోరుకుంటారని, జీవన ప్రమాణాలు పెరగాలని, ఉద్యోగావకాశాలు పెరగాలంటే పెట్టుబడులు రావాలని మోదీ స్వయంగా వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో ప్రభుత్వ ట్రాక్ రికార్డు బావుందన్నది బీజేపీ వాదన. కనిష్టంగా పాతిక కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి వారి ఆదాయాలు పెంచామని బీజేపీ చెబుతోంది. పేదవారి కడుపు నింపడం, వారి పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం తమ ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉందని కూడా మోదీ మహాశయుడు ప్రకటించేశారు. 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజెన్స్ ను ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పరిధిలోకి తీసుకొచ్చి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమా కల్పించడమే తమ ధ్యేయమన్నారు.
మోదీ కి గ్యారెంటీ 2024 పేరుతో మేనిఫెస్టో విడుదలైంది. గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఎలా గడిలో పడింది..వచ్చే ఐదేళ్లలో ఎలా అభివృద్ధి చెందబోతోందో వివరించారు. అదే క్రమంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని కూడా ధీమాను వ్యక్తం చేశారు.
బీజేపీ పేదల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ కొనసాగిస్తామని పార్టీ ప్రకటించింది.కడుపు నిండా అన్నమే కాదు..తాగేందుకు నీరు అవసరం. అందుకే హర్ ఘర్ కో జల్ స్కీము కొనసాగుతుందని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. పేదలకు కరెంటు బిల్లులను సున్నా స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని బీజేపీ చెప్పుకుంటోంది. ఇందు కోసం సౌరశక్తిని పెంపొందిస్తారు. వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతారు. వందే భారత్ మెట్రో రైళ్లు రాబోతున్నాయి.పది కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కొనసాగుతుంది. పాలనలో డిజిటల్ ఇండియాకే ప్రాధాన్యమిస్తారని చెబుతున్నారు. నిజానికి బీజేపీ పాలనలో ధరలు పెరిగాయి. వాటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రస్తావించలేదు. ధరల పెరగుదలకు కారణమైన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించే ప్రక్రియ లేదు. గ్యాస్ ధర వంద రూపాయలు తగ్గిస్తే చాలనుకుంటున్నారు. పైగా మోదీ పదేళ్ల పాలనలో కేంద్రం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గణాంకాలు కూడా అవే సంకేతాలిస్తున్నాయి. అప్పులు తీర్చేందుకు, భవిష్యత్తులో అప్పులు చేయకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పలేదు. పేదల ప్రయాణ సాధనాలపై ప్యాసింజర్ రైళ్ల పెరుగుదలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం గమనించదగిన అంశం…
మోదీ పాలనలో దేశంలో మార్పు వచ్చిన మాట నిజం. మార్పు అనేది సహజ పరిణామం అన్నది కూడా నిజం. పరివర్తన అనివార్యం. కాకపోతే మోదీ పాలనలో అది వేగం పుంజుకుంది. సాధారణంగా జరిగే పరివర్తన కంటే కాస్త ఎక్కువ స్పీడు అందుకుంది. కాకపోతే విశాల జనహితానికి సంబంధించిన అంశాల్లో మాత్రం వెనుకబడిపోయినట్లు ఎవరికైనా అర్థమవుతుంది. మధ్యతరగతి అన్యాయమైపోతోందన్న అనుమానం కలుగుతోంది….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…