ఆర్మీ జనరల్స్ పెత్తనంలో నడిచే పాకిస్థాన్లో ఆయన అత్యంత పవర్ ఫుల్ సైనికాధికారి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన ముషారఫ్ ఆక్రమణవాదిగానూ యుద్ధోన్మాదిగానూ పేరు పొందారు. అధికారదాహం నరనరాల్లో జీర్ణించుకుపోయిన పర్వేజ్ అధ్యక్ష స్థానంలో ఉండి నియంతగా కూడా మారారు. తన పాలనలో చేసిన అరాచకాలకు శిక్ష పడుతుందనే భయంతోనే ఆయన రెండు సార్లు దేశం విడిచి వెళ్లారు. తిరిగి రాలేదు.
ముషారఫ్ 1943వ సంవత్సరం ఢిల్లీలో పుట్టారు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం పాకిస్థాన్ వెళ్లిపోవడంతో అక్కడ పెరిగారు. పుట్టిన గడ్డపై ఆయనకు ఎలాంటి మమకారమూ లేదు. ద్వేషం మాత్రం కట్టలు తెంచుకుని ప్రవహించేది. ఇండియాపై ఎప్పుడు యుద్ధం చేద్దామా అని ఎదురు చూస్తూ చివరకు కార్గిల్ లో ఆ పనిచేశారు. పాకిస్థాన్ భంగపాటుకు ముషారఫే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
18 ఏళ్ల వయసులో పాకిస్థాన్ ఆర్మీలో చేరిన ముషారఫ్ 1965 భారత్ – పాకిస్థాన్ యుద్ధంలో సెకండ్ లెఫ్టినెంట్ గా పనిచేశారు. 1990లో మేజర్ జనరల్ గా పదోన్నతి పొందిన ఆయన డిప్యూటీ మిలటరీ సెక్రటరీ, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ గా కూడా పనిచేశారు.
ముషారఫ్ తన సైనిక జీవితం ప్రారంభించినప్పటి నుంచి కార్గిల్ ను టార్గెట్ గా పెట్టుకున్నారు. 1989లో కార్గిల్ చొరబాటుపై అప్పటి ప్రధాని బేనజీర్ భుట్టో వద్ద ప్రస్తావించారు. అయితే బేనజీర్ దాన్ని వీటో చేయడంతో కొద్ది రోజులు మౌనం వహించాల్సి వచ్చింది . పదేళ్ల తర్వాత 1999లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఎలాంటి సమాచారం అందించకుండా కార్గిల్ ప్రాంతంలోకి సైన్యాన్ని చొప్పించారు. లేహ్ నుంచి శ్రీనగర్ మార్గాన్ని మూసేస్తే అంతా పాకిస్థాన్ దేనన్న ముషారఫ్ ప్లాన్ సక్సెస్ కాలేదు. భారత్ సైన్యం వారిని తరిమి తరిమి కొట్టింది. కార్గిల్ లో ఘోర వైఫల్యం చెందిన ముషారఫ్ కొద్ది రోజులు మౌనం వహించారు. తనకు తెలియకుండా ముషారఫ్ గేమ్ ఆడారని నవాజ్ స్వయంగా వాజ్ పేయికి ఫోన్ చేసి చెప్పారు.
ముషారఫ్ ఆగడాలు పెరిగిపోయాయని గ్రహించిన నవాజ్ షరీఫ్ ఆయన్ను పదవి నుంచి తొలగించే ప్రయత్నంలో ఉండగానే సైనిక తిరుగుబాటుకు ఆయన తెరతీశారు. కార్గిల్ యుద్ధం జరిగిన కొద్ది రోజులకే 1999 అక్టోబరులో ఈ ఆర్మీ తిరుగుబాటు జరిగింది. తనకు వరుస అవకాశాలిచ్చిన ప్రధాని నవాజ్ షరీఫ్ నే గృహనిర్బంధంలో ఉంచి తర్వాత అరెస్టు చేశారు. ముషారఫ్ నియంతృత్వ స్వభావాలున్న వ్యక్తి అందుకే 2001లో తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. 2007లో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మరోసారి పాకిస్థాన్ అధ్యక్షుడయ్యారు. ఆ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ చేయడంతో సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని గ్రహించి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దానికి ఆమోదముద్ర వేయించుకునేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినే మార్చేశారు. ఒక సందర్భంలో ఆయన భారత పర్యటనకు కూడా వచ్చారు.
ముషారఫ్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్యలో ఆరోపణలను ఎదుర్కొన్నారు. పైగా రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు దేశద్రోహం అభియోగాలు తప్పలేదు. దానితో 2008లో లండన్ వెళ్లిపోయి ఐదేళ్ల తర్వాత తిరిగి వచ్చారు. ఆయన అరెస్టుకు కోర్టు ఆదేశాలివ్వగా ఫామ్ హౌస్ లో దాక్కొన్నారు. బెయిల్ పొంది వైద్య చికిత్స నెపంలో దుబాయ్ వెళ్లిపోయారు. దుబాయ్ లో ఉండగానే కోర్టు ఆయనకు ఉరి శిక్ష విధించింది. ఆయన శవాన్ని మూడు రోజుల పాటు అధ్యక్ష భవనం బయట వేలాడదీయాలని ఆదేశించింది. అయితే మరుసటి రోజే శిక్షను తగ్గించారు. చివరకు దుబాయ్ లో చికిత్స పొందుతూ ముషారఫ్ తుది శ్వాస విడిచారు. పాకిస్థాన్ కు తిరిగి రావాలన్న కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు.
పాకిస్థాన్ సామాజిక, రాజకీయ వ్యవస్థలో ఎదిగిన ఒక నియంత ముషారఫ్. సైనికాధికారులు ప్రజాప్రభుత్వాలను కూల్చేందుకు వెనుకాడని పాలనా వ్యవస్థలో ముషారఫ్ ఒక భాగమయ్యారు. అక్కడ ప్రజాస్వామ్య విలువలు ఉండవు. కొట్టడం అధికారాన్ని లాగేసుకోవడమే అక్కడి రాజనీతి. అందుకే సైనిక తిరుగుబాట్లు ముషారఫ్ కు ముందు కూడా జరిగాయి. ఇకపై కూడా జరుగుతాయి. ముషారఫ్ లాంటి వారిని చాలా మందిని మనం చూస్తాం. బికాజ్ దటీస్ పాకిస్థాన్..