కంపెనీలుగా మారుతున్న రాజకీయ పార్టీలు..”విలువ” కోసం విలువల్ని వదిలేస్తున్నాయా?

By KTV Telugu On 7 January, 2023
image

రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థల్లాంటివి కావు రాజకీయ పార్టీలను కూడా వ్యాపార సంస్థల్లా నడిపించాలని ప్రయత్నిస్తే తాత్కాలిక విజయాలు వస్తాయేమో కానీ అంతిమంగా నష్టం జరుగుతుంది. ఆ నష్టం కేవలం ఆ రాజకీయ పార్టీకే కాదు భారత రాజకీయ వ్యవస్థకు కూడా. ఇటీవలి కాలంలో చాలా రాజకీయ పార్టీల్లో ప్రొఫెషనల్స్ ప్రాబల్యం పెరిగిపోతోంది. జీతాలు ఇచ్చి పని చేయించుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. స్వచ్చందంగా పార్టీకి సేవ చేయాలనుకునేవారి సంఖ్య తగ్గుతోంది. నిజానికి రాజకీయ పార్టీల్లో ఇలాంటి వారి సంఖ్య తగ్గడం లేదు. రాజకీయ పార్టీలను నడిపేవారు తగ్గించుకుంటున్నారు. డబ్బులిచ్చి వివిధ స్థాయిల్లో ప్రొఫెషనల్స్‌ను నియమించుకుంటున్నారు. ఇలాంటి వారిలో అధికార ప్రతినిధులు కూడా ఉంటున్నారు. ఇది ఏదో ఓ పార్టీకి పరిమితం కావడం లేదు. జాతీయ పార్టీల్లో ఎక్కువగా ఉంది. ఇటీవలి కాలంలో ప్రాంతీయ పార్టీల్లోనూ ఈ సంస్కృతి పెరిగిపోతోంది. దీంతో రాజకీయ పార్టీలను కంపెనీలుగా నడుపుతున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో పెరిగిపోతోంది.

రాజకీయ పార్టీని సమర్థంగా నడపడానికి అంటూ ఆయా పార్టీల చీఫ్‌లు ప్రొఫెషనల్స్‌కు జీతం ఇచ్చిమరీ పెట్టుకుంటూ ఉండవచ్చు. కానీ అలా చేయడం నైతికంగా ఎంత వరకూ కరెక్ట్ అనేది ప్రతీ సారి చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీ అనేది వ్యాపార సంస్థ కాదు. ఆ పార్టీకి వచ్చే ఆదాయం కేవలం విరాళాలు మాత్రమే. అలాగే పార్టీని నడిపేది లాభాల కోసం కాదు. లాభాలు పొందడానికి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరు. ఒక వేళ అలా నిర్వహిస్తే అది వ్యాపార సంస్థ అవుతుంది కానీ రాజకీయ పార్టీ కాదు. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీ కోసం ప్రతీ స్థాయిలో పనిచేసేది ఉద్యోగులే. కింది స్థాయి సెక్యూరిటీ గార్డు నుంచి పై స్థాయి సీఈవో వరకూ అందరూ ఉద్యోగులే. ప్రతి ఒక్కరికి జీతభత్యాలు కంపెనీ కల్పించాలి. కానీ రాజకీయ పార్టీ అలా నడవడానికి సాధ్యం కాదు. రాజకీయ పార్టీలో ఎవరికీ వేతనాలు ఉండవు. పార్టీ కోసం అంతా స్వచ్చందంగా పని చేయాల్సిందే. జీతాలు ఇచ్చుకోవాలంటే రాజకీయ పార్టీకి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ కార్యకర్తలు, నేతలు అందరూ వాలంటరీగా పని చేయాల్సిందే. స్వచ్చంగా పని చేస్తేనే రాజకీయ పార్టీ నడుస్తుంది. ఓ కార్పొరేట్ కంపెనీకి సమర్థులైన నాయకులు మార్కెటింగ్ స్టాఫ్ ఎంత ముఖ్యమో రాజకీయ పార్టీకి సమర్థులైన నేతలు కార్యకర్తలు అంత అవసరం. కానీ కార్పొరేట్ కంపెనీ లాభాల కోసం పని చేస్తే రాజకీయ పార్టీ మాత్రం లాభాపేక్ష లేకుండా కేవలం సమాజం కోసం ప్రజల అభ్యున్నతి కోసం పని చేయాల్సి ఉంటుంది.

కార్పొరేట్ కంపెనీల్లో ఎవరినైనా తొలగించాలనుకుంటే కంపెనీ నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చి తొలగిస్తుంది. అదికూడా ఇష్టం లేదనుకుంటే డిస్మిస్ చేసేస్తుంది. కానీ ఉద్యోగుల్ని తొలగించాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే రాజకీయ పార్టీకి మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవు. రావడం వెళ్లడం అనేది ఓ లాంఛనమైన ప్రక్రియగానే ఉంటుంది. అలాగే పార్టీ నుంచి ఫలానా నేతను తొలగిస్తున్నామని చెప్పువచ్చు. కానీ తమ పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్ని రాజకీయ పార్టీ ఉద్యోగుల్ని కార్పొరేట్ కంపెనీ తొలగించినంత సులువుగా తొలగించలేదు. ఏపీలో రఘురామ ను అయినా తెలంగాణలో డీఎస్‌ను అయినా పార్టీతో విభేదిస్తే వారి పదవీ కాలం అయ్యే వరకూ వారు అధికారికంగాపార్టీ సభ్యులే. కానీ కార్యకలాపాల పరంగా దూరంగా ఉంచుతారు. అలా అని సస్పెన్షన్ వేటు వేయరు. అంటే కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల్ని తొలగించినంత సులువుగా రాజకీయ పార్టీల్లో నేతలను తొలగించలేరు.

కార్పొరేట్ కంపెనీకి లాభాలు మాత్రమే ముఖ్యం. అందు కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది. కానీ రాజకీయ పార్టీకి మాత్రం లాభాలు అనే మాటే ఉండకూడదు. వారి లక్ష్యం ప్రజాసేవ. ఇందుకోసం కార్పొరేట్ కంపెనీల తరహాలో ఏదైనా చేస్తామని అనడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ నైతిక విలువలు ముఖ్యం. రాజకీయాల పరంగా పొత్తులు పెట్టుకోవాలన్నా పాలనలో పారదర్శకత చూపించాలన్నా దానికి ప్రాతిపదిక ఉండాలి. లాభాల కోసమో అధికారం కోసమే అలా చేస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. అదే సమయంలో తమ రాజకీయాల ద్వారా ఇతర ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడం రాజకీయంగా దిగజారిపోవడమే అవుతుంది. ఎలా చూసినా కార్పొరేట్ కంపెనీకి రాజకీయ పార్టీకి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది.

కానీ ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలు చాలా వరకూ కంపెనీల తరహాలోకి మారిపోతున్నాయి. రాజకీయ పార్టీకి సంబంధించి అన్ని వ్యవస్థల్లోనూ ప్రోఫెషనల్స్ ను నియమించుకుటున్నారు. సీఈవో తరహాలో పార్టీ వ్యవహారాలను చూసుకోవడం దగ్గర్నుంచి అధికార ప్రతినిధుల వరకూ చాలా మందిని ప్రొఫెషనల్స్ ను నియమించుకుంటున్నారు. చాలా రాజకీయ పార్టీలు వీరికి లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నాయి. ఇక రాజకీయ వ్యూహాల గురించి కూడా రాజకీయ పార్టీలు ఆలోచించడం మానేస్తున్నాయి. వాటిని కూడా ఐఐటీల్లో చదువుకుని ఐ ప్యాక్ లాంటి సంస్థలు పెట్టుకున్న వారికి అప్పగిస్తున్నాయి. దేశంలో ఇప్పుడిదో ట్రెండ్. ముందు ముందు రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీలకు సీఈవోలను ఇతర నిర్వహణ వ్యక్తులను అధికారికంగా నియమించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇది ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీల్లో వస్తున్న ప్రధాన మార్పు.

కంపెనీలకు రూ.కోట్లలో పెట్టుబడి కావాలి కానీ రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో నైతిక విలువ మీదనే ఆధారపడి నడవాలి. అలా నడవకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. అయితే ఇటీవలి కాలంలో రాజకీయం అనేది ఖరీదైన వ్యవహారంగా మారింది. ఓట్లను కూడా కొనే స్థితికి దిగజారింది. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీల నిర్వహణ శైలిలోనూ మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదనేది దేశంలో ఎక్కువ మంది మేధావుల అభిప్రాయం. రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని గుర్తించి కంపెనీకి రాజకీయ పార్టీకి మధ్య తేడాలపై అవగాహన పెంచుకుని రాజకీయ వ్యవస్థను మరింత కలుషితం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.