మా మనోభావాలు దెబ్బతిన్నాయి.. అంటూ ఎవరో ఒకరు స్టేట్ మెంట్ ఇవ్వడం. ఇంత కంటే ఇన్ఫోటెయిన్ మెంట్ ఉండదని న్యూస్ చానళ్లు, సోషల్ మీడియా చానళ్లు కవరేజీ ఇచ్చి దానిపై మంట మండించడం కొన్నాళ్లుగా జరుగుతున్న రాజకీయం. దీంతో అసలు రాజకీయానికి సంబంధం లేదని చెబుతూ ఉంటారు కానీ ఇలాంటి అవసరాలు ఉండేది రాజకీయానికే. మిగతా వారికి పనేముంటుంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. అసలు ఈ మనోభావాల గొడవేంటి ప్రతీ దానికి కుల సంఘాలు ఎందుకొస్తున్నాయి. ఈ మనోభావాల జాడ్యం కుల క్యాన్సర్ ను మించి పాకిపోతోందా.
నందమూరి బాలకృష్ణ స్పీచ్ ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏమనుకుంటే అది మాట్లాడేస్తారు. ఓ సారి మహిళల గురించి మాట్లాడారు. మొన్నే పురణాల్లోని ఓ పాత్ర గురించి మాట్లాడితే ఓ కులం వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. వారికి క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో ఆయన అన్న కొన్ని వ్యాఖ్యలు మరికొంతమంది మనోభావాలు దెబ్బతినడానికి కారణం అయ్యాయి. అసలు బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో వివాదానికి కారణమైన మాటలు ఏం మాట్లాడారంటే. ఇక ఈయన వున్నారంటే ఈయనెప్పుడూ కూర్చుని శాస్త్రాలు, డైలాగులు, నాన్నగారు, ఆ రంగారావుగారు, ఆ అక్కినేని, ఈ తొక్కినేని అంటూ చెబుతూ వుంటారు అని సినిమా రచయిత గురించి చెప్పారు. ఈ మాటల్లో అక్కినేని తొక్కినేని అనే రెండు వ్యాఖ్యలు పక్క పక్కనే రావడంతో అక్కినేనినే విమర్శించేశారని మనోభావాలు దెబ్బతినిపోయాయి.
అక్కినేని తొక్కినేని అని బాలకృష్ణ అన్నారని ఆయన మనవలు నాగ చైతన్య, అఖిల్ మా తాతను అవమానించేశారని ఓ నోట్ విడుదల చేశారు. అందులో బాలకృష్ణ ప్రస్తావన లేదు. కానీ వారు ఎందుకు విడుదల చేశారో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ నాగార్జున మనోభావాల గురించి మాత్రం బయటకు రాలేదు. ఆయన స్పందించాలనుకోలేదు. ఇప్పుడు ఆయన కుమారులు సోషల్ మీడియాలో బాలకృష్ణ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో నాగేశ్వరరావును బాలకృష్ణ ఎలా గౌరవించారో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. నాగ చైతన్య ఫస్ట్ మూవీని బాలకృష్ణ ప్రమోట్ చేశారనే సంగతి చెబుతున్నారు. సుమంత్ సత్యం సినిమా రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడితే బాలకృష్ణ రిలీజ్ చేయించిన విషయం చెబుతున్నారు. ఇలాంటి వాదనలకూ అంతూ పొందూ ఉండదు.
ఇక టీవీ చానళ్లు రంగంలోకి దిగిపోయాయి. బాలకృష్ణ వ్యాఖ్యల్లో వారి మనోభావాలు దెబ్బతినలేదు. కానీ ఆ దెబ్బ తిన్నాయంటూ తెర మీదకు వచ్చిన వారి మనోభావాలకు మరింత మంటలు అంటించేందుకు ఈ టీవీ చానళ్లు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు టీవీ చానళ్లు మీడియా అంటే టీఆర్పీ. వ్యూస్.. ఎవరి మధ్య ఎంత చిచ్చు పెట్టి సెగ కాచుకుందామా అని ఎదురు చూడటమే పని ఇలాంటి మీడియాకు మనోభావాలు పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇలాంటివి దొరికితే వదలవు అదే చేస్తున్నాయి.
అంత వరకూ బాగానే ఉన్నా అసలు ఈ మనోభావాలు ఇప్పుడు ఎందుకు ఇలా దెబ్బతింటున్నాయి అంటే మాత్రం ఆలోచించాల్సిందే. చివరికి దొరికే కారణం ఏమిటంటే రాజకీయం. చదువెక్కువైతే ఉన్న మతి పోయినట్లు మన సమాజంలో చదువుకున్న వారు పెరిగే కొద్దీ కులజాడ్యం పెరిగిపోతోంది. తమకు ఇష్టం లేని వారు ఎవరిని ఏమన్నా అంటే వెంటనే వారి కులం వెదుక్కుని మా కులపోడినే అంటారా అంటూ బయలుదేరిపోతున్నారు. ఆ రంగారావు అన్నారని కాపు నాడు పేరుతో ఓ సంఘం బాలకృష్ణకు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్వీ రంగారావు ఎప్పటి నటుడు. విశ్వవిఖ్యాత నటుడు అయిన ఆయనకు కులం అంటించడం ఏంటి అనేది తర్వాత. కానీ ఇక్కడ మనోభావాలు వ్యాపారం. రాజకీయం చేయాలంటే ఆయనకూ కులం అంటించాల్సిందే.
ఇప్పుడు కులద్వేషం మీద రాజకీయాలు నడుస్తున్నాయి. ఓ కులంపై మరో కులాన్ని రెచ్చగొట్టే రాజకీయం నడుస్తోంది. అందుకే ప్రతీ దానికి ఈ మనోభావాలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయ ఆయుధంగా మారిపోయిన ఈ మనోభావాలను అంటించుకోవానికి మీడియా సోషల్ మీడియాకు కోట్లు ఫండింగ్ చేస్తున్నారు. ఏం మాట్లాడినా అది బూతే అని కొంత మంది వివాదం చేయడానికి రెడీగా ఉంటారు. నిజానికి ఇలా మాట్లాడేది ఎవరైనా నిజంగానే కోపంగానే మాట్లాడినా వ్యక్తుల్నే కానీ కులాన్ని కాదు. కానీ ఇక్కడ కులాల మనోభావాలు తెరపైకి వస్తున్నాయి. ఇది సమాజాన్ని చీలుస్తుందని విషపూరితం చేస్తుందని ఈ రాజకీయాలు చేస్తున్న వారికి కూడా తెలుసు. వారికి కావాల్సింది కూడా అదే.