ఆ పెద్దాయన కష్టపడి కోట్ల ఆస్తి కూడబెట్టాడు. కానీ అనుభవించడానికి వారసుల్లేరు. ఇప్పుడాయన పరిస్థితి ఏమిటి. అచ్చంగా చైనా కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవడానికి రెడీగా ఉంది. ప్రపంచంలోని అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిన చైనా ఇప్పుడు దాన్ని అనుభవించడానికి కొత్త తరం తగ్గిపోయే పరిస్థితికి వస్తోంది. దీనికి కారణం జనాభా తగ్గిపోవడమే. చైనా జనాభా తొలి సారి తగ్గింది. అంటే జననాల కన్నా మరణాలు రేటు ఎక్కువ. అంతే కాదు జననాల రేటు తగ్గిందంటే దేశ ప్రజల సగటు వయసు పెరుగుతుందన్నమాట. అంటే పని చేసే ఫోర్స్ సగటు వయసు పెరుగుతుంది. ప్రపంచంలో శ్రామిక శక్తినే ప్లస్‌గా చేసుకుని అత్యధిక జనాభాను ఉపయోగించుకుని అమెరికాతో పోటీగా ఎదిగిన చైనాకు ఆ దేశ నాయకత్వానికి ఇదేమీ గుడ్ న్యూస్ కాదు. ఇంకా చెప్పాలంటే బ్యాడ్ న్యూస్. దీన్ని కొన్నాళ్ల కిందటే చైనా ఊహించింది. దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పిల్లల్ని కనాలని ప్రజల్ని ప్రోత్సహిస్తోంది. పిల్లల్ని కంటే చాలు ఖర్చులన్నీ తామే భరిస్తామంటోంది. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. చైనా తనకు తాను తెచ్చుకున్న ఈ ముప్పు ప్రభావం ఎలా ఉండబోతోంది. చైనా భవిష్యత్ అంధకారమేనా.
చైనాలో జనాభా గత ఏడాది గణనీయంగా జనాభా తగ్గింది. గడిచిన 60 ఏళ్లతో పోలిస్తే గత ఏడాది తొలిసారి జనాభా సంఖ్య తగ్గింది. 2020 చివరి నాటికి చైనా జనాభా 141750000గా ఉన్నట్లు అంచనా వేశారు. బీజింగ్‌లోని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్‌టిక్స్ ఈ రిపోర్ట్‌ను రిలీజ్‌చేసింది. అంతకముందు ఏడాదితో పోలిస్తే జనాభా 8,50,000 తగ్గినట్లు తేల్చారు. గతంలో 1960లో చైనాలో జనాభా తగ్గింది. అప్పట్లో మావో అమలు చేసిన వ్యవసాయ విధానం ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పట్లో జననాలు తక్కువగా ఉండటం వల్ల జనాభా తగ్గలేదు. కరువు వల్ల, జనాభా చనిపోవడం వల్ల తగ్గారు. ఆ తర్వాత జనాభా వేగంగా పెరిగినా 1980 దశకంలో వన్ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టారు. అధిక జనాభా కలుగుతుందన్న భయంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానాన్ని కఠినంగా అమలు చేశారు. అంటే ఒక్క జంటకు ఒక్క బిడ్డ మాత్రమే. రెండో బిడ్డను కంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అక్కడి ప్రజలకే తెలుసు.
ఒక ఇంటికి ఒకే బిడ్డ నినాదాన్ని కఠినంగా అమలు చేయడంతో చైనా జనాభా నియంత్రణలోకి వచ్చింది. కానీ ముందు ముందు ఎదుర్కోబోయే సమస్యలను మాత్రం ఆలస్యంగా గుర్తించారు. జపాన్ వృద్ధ జపాన్‌గా మారిపోయింది. అక్కడ వర్క్ ఫోర్స్ తగ్గిపోయింది. అక్కడ జనాభా పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ అనుభవాలతో జనాభా నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన ఒకే బిడ్డ విధానాన్ని చైనా 2016లో సడలించింది. ఇద్దరు బిడ్డలను కనేందుకు ప్రజలను అనుతించింది. పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో 2021లో ముగ్గురు బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టి పన్ను రాయితీలు ప్రోత్సాహాలు ప్రకటించింది. అయినప్పటికీ చైనాలో జననాల రేటు పడిపోతూ వచ్చింది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నా కూడా చైనా మహిళలు పిల్లలను కనటానికి ఇష్టపడటం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. చైనా దశాబ్దాల పాటు చేసిన జనాభా నియంత్రణ వల్ల జనం చిన్న కుటుంబాలకు అలవాటు పడిపోయారు. జీవన వ్యయం పెరిగిపోయింది. పిల్లలను పెంచాలంటే అత్యంత భారమైన విషయంగా మారిపోయింది. అదే సమయంలో వివాహ వయసు పెరుగుతుండటం వల్ల పిల్లలు కావాలనే కోరిక కూడా అక్కడి యువతరంలో సన్నగిల్లిపోయింది.
చైనా జనాభా సమస్యకు లింగ వివక్ష కూడా ఓ కారణం. ఇండియాలో ఆడపిల్లల్ని పురిటిలోనే చంపేస్తారని ప్రపంచమంతా విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ బయటకు రాలేదు. అదే పరిస్థితి 1980 నుంచీ కేవలం ఒకే బిడ్డకు జన్మనివ్వటానికి పరిమితం కావటం వల్ల చాలా మంది దంపతులు మగపిల్లవాడు కావాలని కోరుకున్నారు. దీనివల్ల జననాల్లో లింగ నిష్పత్తి 120 మంది బాలురకు పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ నిష్పత్తి 100:130 గా ఉంది. అంటే అమ్మాయిల సంఖ్య తగ్గింంది. సంతానోత్పత్తి చేసే వారి సంఖ్య తగ్గితే ఇక ముంచుకొచ్చే ప్రమాదం గురించి ఊహించడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు చైనా అలాంటి ముప్పులోకి వచ్చి పడింది.
2021 నుంచి దేశ జనాభా ఏటా 1.1 శాతం చొప్పున తగ్గుతూ వస్తుందని 2100 సంవత్సరం నాటికి జనాభా ఇప్పటికన్నా సగానికి పైగా మొత్తం 58.70 కోట్లకు తగ్గిపోతుందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సైస్ అంచనా వేసింది. 2030 నాటికి చైనా జననాల రేటు 1.15 నుంచి 1.1 శాతానికి పడిపోతుందని. అది 2100 సంవత్సరం వరకూ అలాగే కొనసాగుతుందనే అంచనాలతో ఈ లెక్కలు వేశారు. ఈ లెక్కలు చాలు చైనా పాలకుల గుండెలు పగిలిపోవడానికి. ఇప్పుడు అదే జరుగుతోంది. చైనాలో పనిచేసే వయసు జనాభా 2014లో గరిష్ట స్థాయికి పెరిగిపోయింది. ఇది జనాభా తగ్గుదలకారణంగా తగ్గిపోనుంది. చైనాలో ప్రస్తుతం ప్రతి 20 మంది వృద్ధులకు గాను 100 మంది పనిచేసే జనం ఉన్నారు. కానీ 2100 నాటికి 100 మంది పనిచేసే వారు ఉంటే 120 మంది వృద్ధులు ఉంటారు. ఇది ఆ దేశ ప్రొడక్టవిటీపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దేశంలో ఉత్పాదకత వేగంగా ఆధునికీకరణ జరిగితే తప్ప ఆర్థికాభివృద్ధి మరింతగా తగ్గిపోయే పరిస్థితులు వస్తాయి. పెరుగుతున్న వృద్ధ జనాభా అవసరాలను తీర్చటానికి చైనా తన ఉత్పాదక వనరుల్లో ఎక్కువ భాగాన్ని ఆరోగ్యం, వైద్య రంగాలకు మళ్లించాల్సి వస్తుంది. అంటే చైనా పూర్తిగా ఖర్చుల్లో పడిపోతుంది.
జనాభా పెరుగుదల వల్ల ఒకప్పుడు ప్రపంచ దేశాలు అనేక సమస్యలు ఎదుర్కొన్నాయి. కట్టడి చేయడానికి చైనా తరహా పద్దతులు అవలంభించిన దేశాలు ఇప్పుడు సవాళ్లను ఎదుర్కోబోతున్నాయి. ఈ సవాళ్లను చైనా ఎలా అధిగమించనుందో వేచి చూడాల్సి ఉంది. అధిగమించలేకపోతే చైనా సాధించిన వృద్ధి వల్ల ఆ దేశం పోగు చేసుకునేది ఏమీ ఉండదు. ఇది ప్రపంచ దేశాలకు ఓ గుణపాఠం కావొచ్చు.