లోక్ సభతో పాటు కొన్ని అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కొన్ని ప్రాంతీయ పార్టీల పరిస్తితి ప్రశ్నార్థకంగా మారింది. ఆయా పార్టీలు ఒక దెబ్బకు శంకరగిరి మాన్యాలు పట్టుకుపోయే పరిస్తితి వచ్చేసింది. నాలుగైదు ప్రాంతీయ పార్టీలకు ఇక మనుగడ ఉండదేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి…
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు ఇప్పుడు ఊపిరాడని పరిస్తితి ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రయాణం ఎటో అర్థం కావడం లేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్… ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. కనీసం ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపించలేక ఇప్పుడు కూనారిల్లే పరిస్తితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 151 స్థానాలతో గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీకి ఈ సారి ఓటర్లు నో ఛాన్స్ అనేశారు. ఘోరమైన అవమానాన్ని జగన్ పార్టీకి అందించారు. రెండు పార్టీల పట్ల ప్రజల్లో అసంతృప్తి ఒక వంతయితే, పార్టీల్లోనే ఉన్న అంతర్గత కీచులాట మరో అంశమని చెప్పుకోవాలి. ఇప్పటికే బీఆర్ఎస్లోని నేతలంతా కాంగ్రెస్,బీజేపీ వైపుకు వెళ్లిపోతున్నారు. వైసీపీలో కూడా అదే పరిస్థితి ఉంటుందా అన్నది మరి కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది…
తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పాలి. తమిళ దేశంలో అధికారంలో ఉన్న డీఎంకే తప్పితే మిగతా మూడు నాలుగు పార్టీల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇక ఒడిశాలో రికార్డు సీఎంగా పేరుపొందిన నవీన్ పట్నాయక్ ఇక ఇంటికి పరిమితమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పాలి….
తమిళనాడులో నాలుగైదు ప్రధాన ప్రాంతీయ పార్టీలున్నాయి. అందులో డీఎంకే ప్రస్తుతం అధికారంలో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలోని 39 లోక్ సభా స్థానాల్లో 95 శాతం పైగా ఇప్పుడు డీఎంకే గెలుచుకుంది. ఇక ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే, తర్వాత జయలలిత హయాంలోనూ వెలిగిపోయినప్పటికీ ఇప్పుడు నథింగ్ అన్న పరిస్తితి వచ్చింది. ఇక ఆ పార్టీ పుంజుకోవడం అంత సులభం కాదని కూడా చర్చ జరుగుతోంది. మరో ప్రాంతీయ పార్టీ పీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ తమిళనాట రెండు పార్టీలకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి ఇబ్బంది లేకపోయినా, ప్రాంతీయంగా పీఎంకేకు మాత్రం మనుగడ సమస్య వచ్చేసింది. ఇక ఒడిశాలో ప్రస్తుత సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ బిజు జనతా దళ్ కూడా వత్తిడిలోనే ఉందని చెప్పాలి. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి నవీన్ పట్నాయక్ సీఎం పదవి నుంచి వైదొలగక తప్పని పరిస్థితి ఉంది.
దశాబ్దం, రెండు దశాబ్దాల్లో రాజకీయాలు మారుతుంటాయి. కొన్ని పార్టీలు పూర్తిగా మూసుకుపోకపోయినా కోల్ట్ స్టోరేజీలోకి వెళ్లిపోతాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల పరిస్థితి అదే కావచ్చన్న ఫీలింగు వస్తోంది. వాటిని అవి కాపాడుకోవాల్సిన అనివార్యత కూడా ఉందని మరిచిపోకూడదు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…