RSS Vs మోదీ

By KTV Telugu On 26 May, 2024
image

KTV TELUGU :-

బీజేపీ పరిస్థితి ప్రస్తుత ఎన్నికల్లో అంత గొప్పగా లేదన్న అభిప్రాయం వినిపిస్తున్న సమయంలో  బీజేపీలో మరో అంశం మంటలు రేపుతోంది. అదే మోదీపై ఆరెస్సెస్ ఆగ్రహం. ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం ఇప్పుడు లేదన్నట్లుగా బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సాంస్కృతిక సంస్థ. మాది రాజకీయ సంస్థ. ఎవరి పనులు వారికుంటాయి కదా .. బిజెపి ఇక స్వయంగా నడుస్తుంది అని  బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా  ప్రకటించడం బీజేపీ, ఆరెస్సెస్ మధ్య పెరిగిపోయిన దూరానికి సూచికగా కనిపిస్తోంది.

బీజేపీ రాజకీయ పార్టీ అయినా దాని సిద్ధాంతకర్త ఆరెస్సెస్. బీజేపీ ఎదుగుదలలో ఆరెస్సెస్ పాత్ర కీలకం. కానీ నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత బిజెపి – ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఉన్న సంబంధాలు తగ్గిపోతూ వస్తుననాయి.  తనను తాను సర్వశక్తిమంతుడిగా ప్రచారం చేసుకుంటున్న మోడీ, ఆయన ఇద్దరు అనుంగు మిత్రులు  అమిత్‌షా, నడ్డా సాయంతో  సంఘ్ పరివార్‌ ప్రాభవాన్ని తగ్గించేందుకు ఒక పథకం ప్రకారం పనిచేస్తున్నారన్న అభిప్రాయం సంఘ్ పరివారంలో కొంత కాలంగా వ్యక్తమవుతోంది.  నడ్డా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతున్నాయి.  ఆర్‌ఎస్‌ఎస్‌తో అవసరం తీరిపోయిందని, బిజెపిని ఇక నుండి తాము స్వయంగా నడుపుకుంటామన్నట్లుగా నడ్డా చేసిన వ్యాఖ్యలపై   సంఘ్ పరివారం లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

సంఘ్ పరివార్‌కు, మోడీ పరివార్‌  మధ్య కొంత కాలంగా ఆధిపత్య పోరు సాగుతున్నట్లు అంతర్గతంగా ప్రచారం జరుగుతూనే ఉంది.  గతంలో మాదిరే తమ కన్నుసన్నల్లో బిజెపి నడవాలన్న  సంఘ్ పరివార్‌ ఆదేశాలను మోడీ పరివార్‌ బేఖాతరు చేస్తోందని చెబుతున్నారు. రెండు సార్లు వరుసగా బిజెపి అధికారంలోకి రావడానికి మోడీ మానియానే కారణమని ఆయన పరివారం ప్రచారం చేసుకుంటోంది. దీనిపైనే సంఘ్ పరివారంలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా, తాజా ఎన్నికల్లో ఏకంగా మోడీ గ్యారంటీ పేరుతో ప్రచార బరిలోకి దిగడం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. సంఫ్‌ుపరివార్‌ నుండి దీనిపై వ్యక్తమైన అభ్యంతరాలను సైతం మోడీ పరివారం పట్టించుకోలేదని, ఎన్నికల ప్రచార తీరుకు సంబంధించి సంఘ్ పరివార్‌ చేసిన సూచనలను సైతం ఖాతరు చేయలేదని అంటున్నారు.

మోడీ అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత సీనియర్‌ నాయకులు ఒక్కొక్కరిని పక్కన పెట్టారు.  అద్వానితో ప్రారంభమైన ఈ పరంపర ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల వేళ అద్వానికి భారతరత్నను ప్రకటించినప్పటికీ, ఆయనను బహిరంగంగానే అగౌరవపరిచిన తీరు సంఘ్‌లో  చర్చనీయాంశంగా మారింది. ఉమాభారతి వంటి నేతలను దూరంగా ఉంచిన తీరు కూడా వారి ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో సైతం బిజెపి అంటే మోడీ, మోడీ అంటే బిజెపిగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. మోడీ లేని చోట్ల అమిత్‌షా, నడ్డాలు కనిపించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌తో పాటు, బిజెపికి చెందిన ఇతర రాష్ట్రాల సిఎంలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతొంది.

ఎన్నికల ముందు అట్టహాసంగా నిర్వహించిన ఆయోధ్య రామమందిర ప్రారంభం కూడా సంఘ్  పరివార్‌కు, మోడీ పరివార్‌కు మధ్య వివాదాలను మరింత రాజేసిందని చెబుతున్నారు. రథయాత్ర నిర్వహించిన అద్వాని లాంటి వారిని ఆ కార్యక్రమానికి దూరంగా పెట్టిన మోడీ పరివారం సంఘ్ నేతలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నాయి. ఆ కార్యక్రమం అంతా మోడీ మయంగా మారింది. ఇలా అనేక కారణాలతో మోదీ వర్సెస్ ఆరెస్సెస్ అన్నట్లుగా మారిందని గుసగుసలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

బీజేపీ గెలుపు కోసంఆరెస్సెస్ నిరంతరాయంగా పని చేస్తుంది.  ఆరెస్సెస్ కు ఉన్న అనేక శాఖలు అభ్యర్థుల గెలుపు కోసం పబ్లిసిటీ లేకుండా ప్రచారం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బీజేపీకి ఆరెస్సెస్ దూరమైతే మరింత ఇబ్బందికరమే

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి