భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న టిబెటిన్ బౌద్దగురువు దలైలామాకు ప్రాణహాని పొంచియుందా? బీహార్ బుద్దగయాలో చైనా మహిళ కదలికలు కలకలం రేపుతున్నాయి. దలైలామా బుద్ధగయను సందర్శించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా దలైలామాపై గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ చైనా మహిళను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ డ్రాగన్ లేడీ దలైలామాకు హాని కలుగజేసే అవకాశాలు ఉన్నాయంటూ నిఘా వర్గాలు హెచ్చరికలు పంపాయి. దలైలామా ఆధ్యాత్మిక బోధనలు చేసే కల్చక్ర గ్రౌండ్ సమీపంలో సాంగ్ జియోలం అనే చైనా మహిళను అరెస్టు చేశారు.
అంతకుముందు రోజు ఆమె అనుమానాస్పద కదలికల నేపథ్యంలో గయా పోలీసులు మహిళ స్కెచ్‌తో పాటు ఆమె పాస్‌పోర్ట్, వీసా సమాచారాన్ని విడుదల చేశారు. ఆమె రెండేళ్ల క్రితమే ఇక్కడికి వచ్చిందని తెలిపారు. కంత్రీ డ్రాగన్ మహిళకు సంబంధించిన ఊహాచిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె గతంలో వివాహమై విడాకులు తీసుకుందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. జియోలం 2019లో ఓసారి భారత్ వచ్చింది. తిరిగి చైనా వెళ్లి మరోసారి వచ్చి కొన్నాళ్లు నేపాల్‌లో గడిపినట్లు పోలీసులు గుర్తించారు. నేపాల్ నుంచి బీహార్ లోని బుద్ధగయ ప్రాంతానికి మకాం మార్చినట్లు తెలుస్తోంది.
కరోనా నేపథ్యంలో మూడేళ్ల తర్వాత జరుగుతున్న వార్షిక పర్యటనలో భాగంగా దలైలామా గయాకు విచ్చేశారు. కాల చక్ర మైదానంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ నెల 31 వరకు ఆయన ఆధ్యాత్మిక బోధనలు చేయనున్నారు. వివిధ దేశాల నుంచి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఇప్పటికే బిహార్‌కు చేరుకున్నారు. ఫిబ్రవరి 1 వరకు దలైలామా గయాలోనే ఉండనున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
టిబెట్‌లో తన అధికారానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును చైనా హింసాత్మకంగా రద్దు చేయడంతో ఏప్రిల్ 1959లో దలైలామా భారతదేశానికి పారిపోయి వచ్చారు. తన మాతృభూమిగా భారత్ మారిపోయిందని దలైలామా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో దలైలామాపై చైనా కుట్రలు చేస్తూనే ఉంది. ప్రపంచాన్ని కదిలించే ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాను “స్ప్లిటిస్ట్”, ఉగ్రవాది అని చైనా పేర్కొంటోంది.