సోషల్ మీడియాకు సెన్సార్ వద్దా ?

By KTV Telugu On 13 July, 2024
image

KTV TELUGU :-

ప్రవీణ్ హనుమంతు అనే వ్యక్తి పిల్లలపై చేసిన అసభ్య వ్యాఖ్యలు, దానికి మరో నలుగురు వెకిలిగా నవ్వుకున్న వ్యవహారం సంచలనం సృష్టించింది. ప్రవీణ్ హనుమంతును పోలీసులు అరెస్టు చేశారు. సమస్య ఇంతటితో పరిష్కారమయిందా  అని అనుకుంటే… అసలు సమస్య  సోషల్ మీడియాలోనే ఉందని చెప్పుకోక తప్పదు. సోషల్ మీడియా అంటే.. రూల్సే లేని ప్రపంచం. అడ్డూ అదుపూ లేని వికృతాల ప్రదర్శనకు వేదిక. మరి ఇలాంటి దాన్ని ప్రభుత్వాలు ఎందుకు ఉపేక్షిస్తున్నాయి ?.  వాటిపై నియంత్రణ ఉండక్కర్లేదా ? . సెన్సార్ లాంటి ఆలోచనలు ఎందుకు చేయడం లేదు ?

ఒక టీవీ చానల్ పెట్టాలంటే సవాలక్ష రూల్స్ ఉంటాయి.  కోట్లు ఖర్చు పెట్టాలి. లైసెన్స్ తెచ్చుకోవాలి. కానీ ఓ యూట్యూబ్ చానల్ ఓపెన్ చేయాలంటే కేవలం ఈమెయిల్ ఐడీ చాలు.  ఓ ఎఫ్‌ఎం చానల్‌లో వార్తలు ప్రసారం చేయాలన్నా కేంద్రం నుుంచి ఖచ్చితంగా అనుమతి తెచ్చుకోవాలి. కానీ  సోషల్ మీడియాలో ఎవరికి వారు వార్తలను ప్రసారం చేయడానికి మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. యూట్యూబ్ చానల్స్ పెట్టుకుని సోషల్ మీడియాల్లో ప్రచారం చేసుకుని ఫాలోవర్స్ తెచ్చుకుని తమలో ఉన్న వికృతాన్ని సమాజంపైకి వెదజల్లుతున్నారు. ఇప్పుడు మన ముందు ప్రవీణ్ హనుమంతు కనిపిస్తున్నారు. కానీ అలాంటి వాళ్లు వందల మంది ఉన్నారు.

ప్రవీణ్ హనుమంతు వ్యవహారాన్ని యాక్టర్ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ తో  బయటకు వచ్చింది.  తెలుగు రాష్ట్రాల పోలీసు అధికారులు  సీరియస్ అయ్యారు.. వెంటనే నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అరెస్టు కూడా చేశారు.  మరి సమస్య పరిష్కారం అయినట్లు అనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదు.  దొరికింది ఒక్కరే. ఇలాంటి బ్యాచ్ కుప్పలు తెప్పలుగా ఉన్నారు. వీరు చేసే అరాచకాలకు అనేక మంది ఇన్ల్ఫూయెన్స్ అవుతున్నారు.  సరిగ్గా ఉపయోగిస్తే సోషల్ మీడియాను మించిన ఆయుధం లేదని చెబుతూ ఉంటారు. నిజమే ప్రతి దానికి మంచి చెడూ ఉంటాయి.  సోషల్ మీడియాలో ఎంత మంచి ఉందో కానీ.. దాని వల్ల జరుగుతున్న చెడే ఎక్కువ.

ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత దారుణంగా ఉంటుందో రోజూ చూస్తూనే ఉన్నాం. నచ్చని వాళ్లపై ద్వేషాన్ని స్ప్రెడ్ చేయడం, నెగెటివిటీ పెంచడం. లేడీస్‌పై ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు చేయడం, సెలబ్రెటీలను బూతులు తిట్టడం. ఇలా సోషల్ మీడియాలో జరిగే అకృత్యాలకి అడ్డు అదుపే లేకుండా పోయింది. కనీసం చిన్న పిల్లలు అనే ఇంగితం కూడా లేకుండా వారిపై కూడా సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.  ఎవరు ఎటు పోతే ఏంటి.. అతనికి వ్యూస్ కావాలి. అతని పర్వర్షన్ హైలైట్ కావాలి. అందుకు ఏమైనా చేస్తారు.. ఎంతకైనా తెగిస్తారు. సభ్య సమాజంతో పని లేదు.. తమ మైండ్‌లో ఉన్న చెత్తనంతా సోషల్‌మీడియాలోకి డంప్ చేస్తున్నారు.   సోషల్ మీడియా ఎంత వికృతంగా తయారైందో.. ఇన్‌ఫ్లూయెన్సర్ల ముసుగులో ఎలాంటి నరరూప రాక్షసులు ఉన్నారో దాన్ని అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది.

చిన్న పిల్లలపైనే కాదు.. సోషల్ మీడియాలో ఏది పెట్టిన ఇప్పుడు వైరలే అవుతోంది. పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో తెలుస్తోంది. .. సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం పెద్ద తప్పేమీ కాదు. కానీ ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనో.. ఏం అన్నా తమనేం చేయలేరన్న ధీమా వచ్చేస్తుందో అప్పుడు అన్నీ అదుపు తప్పుతాయి. కామెంట్లు కంట్రోల్ తప్పుతాయి. ఇప్పుడు అలాంటి ప్రమాదం ముంచుకొచ్చేసింది. కొద్ది రోజుల కిందట చెన్నైలో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.  తన కూతుర్ని సరిగ్గా చూసుకోలేదని ఓ వీడియో కారణంగా ట్రోల్ చేయడంతో భరించలేక నిర్ణయం తీసుకుంది.   చెప్పుకుంటూ పోతే అనేక మంది ట్రోల్స్ కి బలవుతున్న వారే. ఇలాంటి వికృతాలు ప్రతీ రోజూ బయటపడుతున్నాయి.

ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. ప్రభుత్వానికీ తెలుసు. మరి పరిష్కారం ఏమిటో ఎందుకు ఆలోచించడం లేదు. స్వేచ్చ పేరుతో విశృంఖలత్వానికి పాల్పడటం నేరం. కానీ ఏది స్వేచ్చ, లఏది విశృంఖలత్వం అన్నది తేల్చే గీత  ఇప్పుడు కావాలి.  స్వీయ నియంత్రణ అనే మాట వినిపిస్తూ ఉంటారు. అది సోషల్ మీడియాకు వర్తించదని గతి తప్పిపోతున్న ఘటనలు నిరూపిస్తున్నాయి. దీన్ని అలా వదిలేస్తే సమాజం పూర్తిగా కలుషితం అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే.. ముందుగా ప్రభుత్వాలు మేలుకోవాలి. స్వేచ్చ అనే గీతను దాటకుండా… కట్టుదిట్టమైన నియంత్రణ ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.

అతి సర్వత్రా వర్జయేత్ అంటారు పెద్దలు. ఏదైనా శ్రుతి మించితే అనర్థమే. ఇప్పుడు సోషల్ మీడియా స్వేచ్చ కూడా అతి దాటిపోయింది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం వచ్చింది. మేల్కోవాల్సింది ప్రజలు, ప్రభుత్వాలే.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి