కంచెలు వేశారు. సిమెంట్ దిమ్మలు పెట్టారు. లేజర్ గన్ లతో దాడులు చేశారు. లాఠీలు ప్రయోగించారు. చివరికి సూపర్ సోనిక్ సౌండ్ తోనూ ఎటాక్ చేశారు. ఇవన్నీ చేసింది ప్రభుత్వ పోలీసుల బలగారు. చేసింది సంఘ విద్రోహశక్తులపై కాదు. రైతులపై. ఢిల్లీ శివార్లలో మరోసారి రైతు ఉద్యమం ప్రారంభమయింది. హామీలు ఇచ్చి మోసం చేశారని రైతులు మళ్లీ రోడ్డెక్కారు. గతంలో జరిగిన ఉద్యమానికి మించి ఇప్పుడు రెడీ అవుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు భారతరత్న ఇచ్చారు కానీ… ఆయన సిఫారసులను అమలు చేయాలని అడుగుతున్న రైతులపై మాత్రం దండ యాత్ర చేస్తున్నారు. ఎందుకిలా ? అసలు రైతులకు ఏ హామీలిచ్చారు ? ఎందుకు అమలు చేయలేదు ?
ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. అన్నదాతలపై దాదాపుగా యుద్ధం ప్రకటించేశారు పోలీసులు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఫిబ్రవరి 16న దేశవ్యాపిత గ్రామీణ బంద్ పిలుపునిచ్చిది. కొన్ని సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. దానిపై మోడీ స ర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. రోడ్లపై మేకులు పరవడం మొదలు డ్రోన్లతో ప్రస్తుతానికి ఏడిపించే గ్యాస్‌తోనే దాడి చేయడం వరకు మోడీ సర్కార్ యుద్ధం సాగిస్తోంది. ఐదు వందలకి పైగా రైతు సంఘాలతో కూడింది సంయుక్త కిసాన్ మోర్చా. మోడీ భజనల్లో మైమరిచి నృత్యం చేసే బీఎంఎస్ తప్ప మిగిలిన కార్మిక సంఘాలన్నింటితో కూడింది జాయింట్ ఫ్లాట్‌ఫార్మ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్. అనేక రాష్ట్రాల్లో పాలక ప్రాంతీయ, జాతీయ పార్టీలు రంగంలోకి దిగాయి. త్రిపుర, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రాణా లకి తెగించి గ్రామీణ బంద్‌ను, జాతీయ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేసేం దుకు వ్యక్తులు, శక్తులు, సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్థాన్ బోర్డర్లో ట్రెంచీలు తవ్వినట్లు, బారి కేడ్లు కట్టినట్టు, ముళ్ళబాట పరిచారు. సరిహద్దులు మూసేయడమే కాదు, హర్యానాలో ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ ఆపేశారు. డజన్లకొద్దీ ట్విట్టర్ అకౌంట్లు బంద్ చేశారు. బల్క్ మెసేజులు నిషేధించారు.
2016లో జరిగిన పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 2022 నాటికి దేశంలో అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తానని అందులో సగర్వంగా ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తామని 2019లో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో కూడా బీజేపీ చెప్పింది. ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. మోడీ ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. 2021లో విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం 2015-16లో 96,703గా ఉన్న రైతు కుటుంబాల సగటు వార్షిక ఆదాయం 2018-19 నాటికి 1,22,616 రూపాయలకి పెరిగింది. దీనిని బట్టి అర్థమయింది ఏమిటంటే రైతుల ఆదాయం కేవలం నామమాత్రంగా 2.98 శాతం మాత్రమే పెరిగింది.
రైతులపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ చేసిన సిఫార్సులకు 2018-19 బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పంటల కనీస మద్దతు ధరలు సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం యాభై శాతం అదనంగా ఉండాలన్న సిఫార్సును ఆమోదించింది. దీనికి కట్టుబడి ఉంటామని 2022 డిసెంబరులో వ్యవసాయ మంత్రి పార్లమెంటుకు తెలియజేశారు. అయితే గత దశాబ్ద కాలంలో కనీస మద్దతు ధరల పెంపు యూపీఏ హయాంతో పోలీస్తే కనిష్ట స్థాయిలోనే ఉన్నదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగం కోసం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దీనిని పీఎం కిసాన్ అని పిలుస్తున్నారు. ఈ నగదు బదిలీ పథకాన్ని 2019లో ప్రారంభించారు. గత సంవత్సరం డిసెంబరులో పార్లమెంటుకు ప్రభుత్వం అందజేసిన సమాచారం ప్రకారం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ 11 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు. అయితే దేశలోని వ్యవసాయ కార్మికుల్లో కనీసం 55 శాతంగా ఉన్న భూమిలేని రైతులు ఈ పథకం పరిధిలోకి రావడం లేదు.
2020లో మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాల ద్వారా వ్యవసాయ వాణిజ్యం పెరుగుతుందని, రైతులు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ ఉత్పత్తులను ప్రైవేటు కంపెనీలకు అమ్ముకోవచ్చునని తెలిపింది. అయితే ఈ చట్టాలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు ఉద్దేశించినవేనని ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలపై తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం, అన్నదాతలు దీర్ఘకాలం ఉద్యమించడంతో 2021లో వాటిని కేంద్రం వెనక్కి తీసుకోక తప్పలేదు. ఎంత నిర్బంధం ఉన్నా రైతాంగం అంతే తీవ్రంగా కదల డానికి కారణం కనీస మద్దతు ధర సాధించుకోడానికే. విద్యుత్ ప్రయివేటీకరణ ఆగకుంటే రైతాంగమే కాదు, సామాన్యజనం తీవ్ర ఇబ్బందులు పడతారని రైతులు భావిస్తున్నారు.
పంజాబ్, యూపీ, హర్యానారా రైతులు పట్టుదల గల వారు. వారు ఉద్యమమం కోసం బరిలోకి దిగితే.. ఎన్ని రోజులు అయినా ఉద్యమంలోనే ఉంటారు. దీన్ని రైతు ఉద్యమం నిరూపించింది. ఎంత మంది చనిపోయినా కదల్లేదు. ఇప్పుడు మరోసారి అదే ఉద్యమం ప్రారంభించారు. అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుందని ఎన్నో ప్రజాస్వామ్య ఘటనలు నిరూపించాయి. ఇప్పుడు కేంద్రం కూడా రైతులపై అదే ప్రయోగం చేస్తే… ఎన్నికలకు ముందు అదే పెద్ద తప్పిదం అయ్యే అవకాశం ఉంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…