అనాథ రైతు – ఈ పాపం ఎవరిది

By KTV Telugu On 8 May, 2023
image

‘రైతుకు అండగా ఉంటాం” అని స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ వారికి ఏడాదికి ఐదారు వేలు ఇచ్చి గొప్పగా ఉద్దరించేశామని చెప్పే స్థితికి దిగజార్చారు కానీ రైతుల్ని ఇసుమంత కూడా బాగు చేయలేదు. ప్రపంచంలో వ్యవసాయాన్ని నమ్ముకున్న వారు నష్టపోతున్న ఉదంతాలు ఏ దేశంలోనూ ఉండవు. ఒక్క మన దేశంలోనే ఆ దుస్థితి. పంట అంటే లాటరీ వేసినట్లుగా అయిపోతుంది. ప్రకృతి వైపరీత్యాల గురించి సమాచారం ఉండదు. పంట నష్టపోయాక ప్రభుత్వాల నుంచి సహకారం ఉండదు. అదృష్టం బాగుండి పంట చేతికొస్తే మద్దతు ధర ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు ప్రతి దశలోనూ దగాకు గురవుతున్నాయి. దోపిడీకి గురవుతున్నాడు. కానీ ఆ రైతుపై ఎనలేని ప్రేమ ఒలక బోస్తూంటారు. వారినేదో ఉద్దరించేశామని చెప్పుకుంటూ ఉంటారు.

ఓ వ్యవస్థలో రైతు ఏ స్థాయిలో దోపిడీకి గురవుతాడో ఆలోచిస్తే మన గుండె రగిలిపోతుంది. ఉదాహరణకు ఓ మిర్చిరైతు ఉన్నాడనుకుందాం. ఆ రైతు పంట పండిస్తాడు విత్తు తెచ్చుకుని పంట వేసినప్పటి నుండి రకరకాల వైరస్ ల నుంచి కాపాడుకుని పంటను చేతికి తెచ్చుకుంటాడు. ఈ క్రమంలో అతను విత్తుల దగ్గర్నుంచి ఎరువులు పురుగు మందుల వరకూ ప్రతీ దాంట్లోనూ వంచనకు గురవుతాడు. అన్ని రకాల వ్యాపారస్తులూ లాభాలు పొందుతారు. ఇలా అందరికీ సమర్పించుకుని సాగుచేసి పంట చేతికి తెచ్చుకున్న రైతులు అమ్మడానికి దాన్ని మార్కెట్ యార్డుకు తీసుకు వస్తాడు. మొదట కమిషన్ కొట్టు వ్యాపారి అమ్మి పెడతాడు. వ్యాపారి రైతు సొమ్ములో రెండు నుంచి ఐదు శాతం తీసుకుంటాడు. ఈ క్రమంలో శాంపిల్స్ అని అదని ఇదని కొంత దిగుబడి వేరే వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. కమిషన్ కొట్టు వ్యాపారి కొన్న తర్వాత అతని వద్ద మరో వ్యాపారి కొంటాడు. అతను మరో వ్యాపారికి ఎక్స్ పోర్ట్ చేస్తాడు. పక్క రాష్ట్రానికో పక్క దేశానికో ఎగమితి చేసి లాభం పొందుతాడు. అలా పొందిన వాడు దాన్ని ప్యాకెట్లుగా మార్చి ప్రజలకు అమ్ముతాడు. ఈ క్రమంలో ఎంత మంది లాభపడ్డారో చూడండి విత్తనాలు పురుగు మందుల వ్యాపారి కమిషన్ కొట్టు వ్యాపారి కొనుగోలు వ్యాపారి ఎక్స్ పోర్టర్ తయారీ దారు ఇలా ప్రతీ అంకంలోనూ రైతు పంట సేల్ అయింది. ప్రతీ ఒక్క రికి లాభం మిగిల్చింది. విషాదం ఏమిటంటే అందరి కంటే తక్కువ లాభం కలిగేది రైతుకే. కనీస మద్దతు ధర కూడా లభించడం కష్టమే. ఇది నమ్మి తీరాల్సిన నిష్టూరసత్యం. మరి ఇలాంటి రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే. కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి సర్వం కోల్పోయినా ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. అక్కడే ఉంది అసలు విషాదం.

సాధారణంగా వ్యవసాయ శాఖ చేసే పని ఏమిటి అంటే రైతుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం. వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు ఇతర వాటి బారి నుంచి రైతుల్ని కాపాడటం మార్కెటింగ్ సౌకర్యాలు ఇలా చాలా అంశాలు వ్యవసాయ శాఖ పరిధిలో ఉంటాయి. కానీ ఆ పనులు తప్ప మిగతా అన్ని పనులూ చేస్తూంటారు. అవి సొంతపనులు. ఇప్పుడు వాతవరణ పరిస్థితుల్ని ఇరవై నాలుగు గంటలు ముందుగానే గుర్తిస్తున్నారు. కానీ ఎవరూ అలర్ట్ చేయడం లేదు. ముందుగా రైతుల్ని అకాల వర్షాల గురించి అప్రమత్తం చేసినట్లయితే ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ రంగం ఎప్పటి కప్పుడు కునారిల్లి పోవడానికి కారణం ఈ రంగాన్ని గురించి ఎవరూ పట్టించుకోకపోవడమే. పారిశ్రామిక వేత్తలు తమ వాణిని వి నిపించుకునేందుకు తమ ప్రతి నిధులనుఎంపీలుగా గెలిపించుకుంటూ ప్రత్యేక లాబీలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. గతంలో వ్యవసాయ రంగం తరఫున వాదించేవా రుండేవారు. ఇప్పుడు అందరూ రైతే రాజు అని జపం చేస్తూ పారిశ్రామిక వేత్తలకు సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం ఎవరికీ పట్టని అనాధలా మారిపోయింది. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా వ్యవసాయ మంత్రిత్వ శాఖలు ఏం చేస్తాయంటే రైతులకు ఇంత నగదు బదిలీ చేశామని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాయి. నిజానికి ఇచ్చేదేమీ ఉండదు.

వ్యవసాయం ప్రపంచంతో పోటీ పడేలా చేయడంలో ప్రభుత్వాలు విపలమయ్యాయి. రైతులకు ఎప్పటికప్పుడు ఓటు బ్యాంక్ కోసం డబ్బులు ఇస్తున్నాయి కానీ ప్రపంచ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్లుగా రైతుల్ని సిద్ధం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. వియత్నాం వంటి దేశాల్లో అత్యాధునిక పద్దతుల ద్వారా పెద్ద ఎత్తున సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తూంటే భారత్ లో మాత్రం నూర్పిడి యంత్రాలు వాడటమే గొప్ప అచీవ్ మెంట్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అంటే భారత్ వ్యవసాయ రంగంలో ఎదిగింది ఏమీ లేదు. మరి రైతులు ఎలా లాభాల బాటలోకి రాగలరు. ఈ రంగాన్ని ఉద్దరించేందుకు గతంలో రైతు నాయకులు నిజాయి తీగా అంకిత భావంతో కృషి చేసేవారు. ఇప్పుడు అలాంటివారు ఎవరూ లేరు.ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైనసమస్య కాదు. దేశమంతటా ఉంది. ముఖ్యంగా ఆహార ధాన్యాలను పండించే రాష్ట్రాల్లో కనిపించే ఉమ్మడి సమస్య. ఈ సమస్యపై పోరాటాలు చేసిన వారు రైతు నాయకులయ్యారు. వారిలో కొందరు జాతీయ నాయకులయ్యా రు. అయితే రైతుల సమస్య ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యగానే మిగిలిపోతోంది. ఇందుకు కేంద్రం వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ మంత్రులను సమావేశ పర్చి నిర్ణీత కాల పరిమితిలో అమలు జేయదగిన పథకా లు ప్రణాళిక లను అమలు జేయకపోవడమే. వారి రాజకీయాలు వారికి నడుస్తున్నాయి కాబట్టి రైతులేమైపోయినా పట్టించుకునే తీరిక వారికి ఉండటం లేదు.

రైతుల సమస్యలను చూపించి వారి కోసం పోరాడుతున్నట్లుగా అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. వారిని ఓటు బ్యాంక్‌గా మార్చుకున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పొందాయి. చాలా పార్టీలు రాష్ట్రాల్లో అధికారాన్ని కూడా పొందాయి. కానీ చేయగలిగినంత చేశాయా అంటే లేనే లేదని చెప్పాలి. ఎప్పటికప్పుడు వారికి పదో పరకో ఇవ్వడమే తాము చేసే గొప్ప సాయంగా ప్రచారం చేసుకుంటున్నాయి. మద్దతు ధర ఇవ్వడాన్ని కూడా తాము చేసే సాయంగా చెప్పుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వం రైతులు కష్టపడి పంట పండిస్తే ధాన్యం సేకరణ జరిపితే దాన్ని కూడా రైతులకు ఇచ్చిన సాయంగా ప్రచారం చేసుకుంటున్నాయంటే వారిని ఎంత తక్కువగా చూస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ప్రపంచమే కుగ్రామంగా మారిన తర్వాత అత్యధిక వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం పంపుకునే చాన్స్ ఉండేది. కానీ ఎందుకు వెళ్లడం లేదు.

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు బాగున్నారని చిరునవ్వు చిందిస్తున్నారని చెప్పుకుని ప్రచారం చేసుకుంటే బాగోదు. వారిని ఇంకా మోసం చేసినట్లవుతుంది. ఇప్పటికైనా రైతల గురించి ప్రభుత్వాలు పట్టించుకుని వారిని కాపాడితేనే రాజ్యం బాగుంటుంది. లేకపోతే ఆ నష్టం సమాజానికి ఉంటుంది. ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి రేపు ఉండవు కానీ రైతులు దేశానికి చేస్తున్న సేవ మాత్రం శాశ్వతం. వారిని కాపాడుకోవాలి ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. లేకపోతే ఇది దేశంలోనే కాదు ప్రపంచానికి ఆహారసంక్షోభం తెచ్చి పెడుతుంది.