సూడాన్ సంక్షోభం అచ్చంగా కేజీఎఫ్ కథే – సూడాన్ గోల్డ్ ఫీల్డ్స్ కోసమే వార్

By KTV Telugu On 20 April, 2023
image

కేజీఎఫ్ అనే సినమాలో కథ అంతా బంగారు గనుల ఆధిపత్యం కోసం సాగుతూ ఉంటుంది. అచ్చంగా అదే కథ ఇప్పుడు సూడాన్ సంక్షోభం. కాకపోతే కేజీఎఫ్ కల్పితం సూడాన్ సంక్షోభం నిజం. సూడాన్ లో ఉన్న బంగారు గనులపై ఆధిపత్యం కోసం రెండు ఆర్మీ విభాగాలు చేసుకుంటున్న యుద్ధమే ప్రస్తుత సూడాన్ సంక్షోభానికి కారణం. తూర్పు ఆఫ్రికా దేశం సూడాన్‌లో హింస చెలరేగుతోంది. విధ్వంసకర ఘర్షణల్లో 200 మందికిపైగా మరణించారు వేల మంది గాయపడ్డారు. రోజు రోజుకు ఇలాంటి బాధితుల సంఖ్య పెరుగుతోంది. అక్కడ పారా మిలిటరీ దళం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) సభ్యులు, సైన్యానికి మధ్య దేశ రాజధాని ఖార్టూమ్‌తోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. రెండు వర్గాలకూ కావాల్సినన్ని ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో వారిలో వారే యుద్ధం చేసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రజలకు కనీస అవసరాలు అందని పరిస్థితి ఏర్పడింది. తాగడానికి నీరు తినడానికి ఆహారం కరవైంది.

సైనిక స్థావరాలపై పట్టు కోసం సూడాన్​ ఆర్మీ పారా మిలటరీ బలగాల్లోని ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్ ​మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. రాజధాని ఖర్తూమ్​తో పాటు ఓందుర్​ మన్​ పశ్చిమ డార్ఫర్​ ప్రావిన్స్​ ఉత్తర డార్ఫర్ ప్రావిన్స్​ కస్సాలా ప్రావిన్స్​ అల్​ ఖదారిఫ్​ ప్రావిన్స్​లలో సూడాన్​ ఆర్మీ ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్ మధ్య తుపాకులు యుద్ధ ట్యాంకులతో పోరు జరుగుతోంది. ఈ రెండు సైనిక వర్గాలు ఒకదాని స్థావరాలను మరొకటి టార్గెట్​ చేసుకొని దాడులు చేసుకుంటున్నాయి. ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్ ​ను సూడాన్​ ఆర్మీలో విలీనం చేసేందుకు ఆర్మీ చీఫ్​ అబ్దెల్​ ఫత్తా బుర్హాన్​ చేసిన ప్రతిపాదన ఈ అంతర్యుద్ధానికి దారితీసింది. సైన్యంలో తమ గ్రూప్​ను విలీనం చేయరాదంటూ మహ్మద్​ హమ్దాన్​ దగాలో నేతృత్వంలోని ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్ తిరుగుబాటు చేశాయి. ఫలితంగా యుద్ధం ప్రారంభమయింది.

బ్రిటిష్ పాలన నుంచి 1956లో సూడాన్‌కు స్వాతంత్య్రం వచ్చింది. ఆ తర్వాత దేశంలోని ప్రాంతాల సరిహద్దుల సర్దుబాటులో చాలా వివాదాలు చెలరేగాయి. ఈ చమురు తవ్వకం నుంచే ఆదాయం వచ్చేది. 1980ల నాటికి దక్షిణ ప్రాంతాల్లో స్వాతంత్య్రం కోసం ఉద్యమం మొదలైంది ఇది తీవ్రరూపం దాల్చింది. దీంతో 2011లో రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్ ఏర్పడింది. సౌత్ సూడాన్ ఏర్పాటుతో చమురు తవ్వకాల నుంచి వచ్చే ఆదాయం మూడింట రెండొంతులను సూడాన్ కోల్పోయింది. దీంతో ఆర్థిక ఆహార సంక్షోభంలో ఇరుక్కుపోయింది. 1989 నుంచి నియంత అల్ బషీర్ సూడాన్ పరిపాలించారు ఈ కారణంగానే సంక్షేభం తలెత్తింది. 2019లో తలెత్తిన నిరసనలతో అల్ బషీర్ అధికారం కోల్పోయారు. 2019లో ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వం సైన్యం తిరుగుబాటుతో కుప్పకూలింది. అప్పుడు రెండు సాయుధ బలగాల నియంత్రిస్తున్న హమెడ్తీ అల్ బుర్హాన్‌ల చేతుల్లోకి దేశం వెళ్లింది. ఆ తర్వాత పౌర ప్రభుత్వం నడుస్తున్న సమయంలోనే జనరల్ బుర్హాన్ తిరుగుబాటు చేసి అధికారాన్ని దక్కించుకున్నారు. మరో పవర్ సెంటర్ గా ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్ ఉంది. కౌన్సిల్ ఆఫ్ జనరల్స్ పాలనలో ఉన్న సూడాన్‌లో ఇద్దరు మిలిటరీ నాయకుల మధ్య ఆధిపత్య పోరాటంతో సంక్షోభంలో పడింది. కౌన్సిల్ ఆఫ్ జనరల్స్ పాలనలో ప్రస్తుతం సూడాన్ ఉంది. వీరిలో ఒకరు ప్రస్తుత సూడాన్ అధ్యక్షుడు సైన్యాధిపతి అబ్దెల్ ఫత్తా అల్ బుర్హాన్. రెండో వ్యక్తి మొహమద్ హమ్దాన్ డగాలో. ఈయనను అందరూ హెమెడ్తీగా పిలుస్తారు. ఆర్ఎస్ఎఫ్‌కు చీఫ్‌గా హెమెడ్తీ కొనసాగుతున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య పోరాటంతోనే సూడాన్ అల్లకల్లోలం అవుతోంది.

సూడాన్‌లో ఈ అంతర్యుద్ధం వెనుక అన్ని కారణాల్లోనూ ఒక అంశం బంగారం. ఆఫ్రికా ఖండంలోని భారీ బంగారం నిల్వలున్న ప్రాంతాల్లో సూడాన్ ఒకటి. ఒక్క 2022లోనే సూడాన్ ప్రభుత్వం 2.5 బిలియన్ డాలర్లు విలువైన 41.8 టన్నుల బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేసింది. భారీగా బంగారాన్ని వెలికితీసే చాలా గనులు ప్రస్తుతం హెమెడ్తీ నేతృత్వంలోని ఆర్ఎస్ఎఫ్‌ నియంత్రణలో ఉన్నాయి. సూడాన్‌లో మాత్రమే కాదు పొరుగునున్న దేశాల్లోని బంగారాన్ని తవ్వి తీసి విక్రయించడంలోనూ ఆర్ఎస్ఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సూడాన్‌లో 40,000కుపైగా బంగారం గనులున్నాయి. ఇక్కడ దాదాపు 60 బంగారాన్ని శుద్ధిచేసే సంస్థలు పనిచేస్తున్నాయి. బంగారం గనులపై నియంత్రణ, 70,000 మంది జవాన్లు, 10,000 ట్రక్కులతో ఆర్‌ఎస్ఎఫ్ దేశాన్ని నడిపించే స్థాయికి వెళ్లింది. ఖార్టూమ్‌తోపాటు ఇతర నగరాలను నియంత్రించే శక్తి కేవలం ఆర్‌ఎస్ఎఫ్‌కే ఉంది. ఇప్పుడు ఈ విభాగాన్ని అర్మీలో విలీనం చేయమనడంతో తిరుగుబాటు చేసింది.

నిజానకిి 2021లో అంతర్యుద్ధానికి ముగింపు పలికి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటుచేస్తామని ఇద్దరు నాయకులూ ప్రకటించారు. ఆ కూటమి ఒప్పందంలో భాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి బంగారు గనుల నియంత్రణను అప్పగించాలని ఇద్దరు నాయకులూ నిర్ణయించారు. కానీ హమెడ్తీ అధికారం నానాటికీ పెరుగుతుండటంతో ఆర్‌ఎస్ఎఫ్‌పై అల్‌ బుర్హాన్ వర్గాల్లో అనుమానం పెరిగింది. శాంతి భద్రతల నియంత్రణకు ఆర్ఎస్ఎఫ్ బాధ్యతలను కూడా తమకు అప్పగించాలని అల్ బుర్హాన్ నేతృత్వంలోని సైన్యం కోరుతోంది. కానీ దీనికి హమెడ్తీ అంగీకరించడం లేదు. ఫలితంగా యుద్ధం జరుగుతోంది. ఇది ఎక్కడకు దారి తీస్తుందో చెప్పలేం కానీ అంతర్జాతీయ సమాజం కూడా ఏమీ చేయలేకపోతోంది.