ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ వర్గీకరణను సమర్థించిన సుప్రీం సమర్థించడమే కాదు.. వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని కూడా చెప్పింది ధర్మాసనం. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పు వెల్లడించింది. నేటికీ.. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
అసలు.. ఈ వర్గీకరణ డిమాండ్ ఎప్పుడు మొదలైంది?
1994లో షెడ్యూల్డు కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో తెరమీదికొచ్చింది. ఏపీలోని ప్రకాశం జిల్లా, ఈదుమూడి గ్రామంలో మొదలైన ఉద్యమం.. ఆ తర్వాత కొన్నేళ్లలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించింది. ఈ ఉద్యమానికి.. ఎమ్మార్పీఎస్ నాయకత్వం వహించింది. దశాబ్దాల తర్వాత.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఎస్సీ వర్గీకరణ దేనికోసం?
ఈ ఉద్యమం మొదలైన తొలినాళ్లలో.. 59 కులాలు షెడ్యూల్డు కులాల జాబితాలో ఉన్నాయ్. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఎస్సీ జనాభా దాదాపు కోటీ 39 లక్షలు. వీరిలో.. మాదిగలు 67 లక్షల మందికి పైగా ఉంటే.. మాలలు దాదాపుగా 56 లక్షల మంది వరకు ఉన్నారు. అంటే.. మాలలతో పోలిస్తే.. మాదిగల జనాభా దాదాపు 11 లక్షలు ఎక్కువ. మొత్తం.. ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల జనాభానే 80 శాతం వరకూ ఉండొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయ్. వీరి తర్వాత.. పెద్ద సంఖ్య రెల్లి కులానిది. వీళ్లు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు.
సమాజంలో దారుణమైన అణచివేతను, అంటరానితనాన్ని, వివక్షను అనుభవించిన ఈ కులాలు.. నేటికీ అట్టడుగు స్థాయిలోనే మిగిలిపోయాయ్. అయినప్పటికీ, ఎస్సీల్లోనూ ‘ఎక్కువ’,’తక్కువ’ లున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే.. అణచివేయబడ్డ సమూహంలోనే.. అసమానతలకు సంబంధించిన అంశమిది.
ఉప కులాల వర్గీకరణతో మేలు జరిగేది ఎవరికి?
ఎస్సీలకు మొత్తంగా 15 శాతం రిజర్వేషన్ కోటా ఉంది. ఈ కోటాలో.. మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ.. 1970ల నాటి కాలంలోనే మొదలైంది. జనాభాపరంగా మాలలకన్నా.. మాదిగల సంఖ్య ఎక్కువైనప్పటికీ.. విద్య, ఉద్యోగ అవకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని.. 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది. ఈ విషయంలో.. మందకృష్ణ చెప్పిన లెక్కల ప్రకారం.. ఆనాటికి మాదిగలు 18 వేల ఉద్యోగాల్లో ఉండగా, వాటిలో 80 నుంచి 90 శాతం నాల్గో తరగతి ఉద్యోగాలే! మరోవైపు.. మాలలు అన్ని రకాలవి కలిపి.. 72 వేల ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే.. రిజర్వేషన్ ద్వారా ఎస్సీలకు లభించిన ఉద్యోగాల్లో.. దాదాపు 80 శాతం మాలలకు, దాని ఉపకులాల వారికి దక్కగా.. మాదిగ, దాని ఉపకులాలకు దక్కింది సుమారుగా 20 శాతం మాత్రమే.! రాజకీయ రంగంలోనూ.. ఈ తేడా స్పష్టంగా ఉంది. అందువల్ల.. ఎస్సీ కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి.. ఆయా కులాల జనాభా నిష్పత్రి ప్రకారం 15 శాతం ఎస్సీ రిజర్వేషన్ కోటాను పంచాలని.. ఇన్నేళ్లు ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేసింది. ఇది.. అనేక మలుపులు తిరుగుతూ.. చివరకి.. ఈ నాటికి మాదిగల పోరాటం ఫలించింది. సుప్రీం కోర్టు తీర్పుతో.. ఎస్సీ వర్గకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…