ఆఫ్గనిస్తాన్‌లో అరాచకం రాజ్యమేలుతోంది. కఠినమైన ఆంక్షలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటినుంచి మహిళలు ఆంక్షల చట్రంలో ఇరుక్కుపోయారు. మహిళలు ఒంటరిగా బయటకు రావడానికి వీల్లేదని మగవారు తోడుగా ఉన్నా బురఖా తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసి కఠినంగా అమలు చేస్తోంది తాలిబన్ ప్రభుత్వం. అమ్మాయిల చదువులు, ఉద్యోగాలపైనా నిషేధం విధించారు. ఇటీవలే యూనివర్సిటీలలో స్త్రీలకు ప్రవేశంలేదని తేల్చిచెప్పింది. జిమ్ లు, పబ్లిక్ పార్కులు, అమ్యూజ్ మెంట్ పార్కులలోకి కూడా మహిళలను అనుమతించట్లేదు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆడవాళ్ల బొమ్మలపైనా ఆంక్షలు విధించారు తాలిబన్లు. బట్టల షాపుల్లో బయటకు కనిపించేలా అలంకరించిన మహిళల బొమ్మల ముఖాలు కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆ బొమ్మల ముఖాలపై బురఖా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దేశ రాజధాని కాబూల్ లోని ఓ బట్టల దుకాణంలోని షోకేస్‌లో పెట్టిన బొమ్మల ముఖాలకు ప్లాస్టిక్ కవర్, క్లాత్ బ్యాగ్ లను కప్పుతున్నట్లు ఆ షాపుల యజమానులు. గతంలో తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు దుకాణాలలో మహిళల బొమ్మలు ఉండేందుకే ఒప్పుకోలేదట. ఇప్పుడు కొంచెం నయం బొమ్మలు ఉన్నా ఫరవాలేదు కానీ వాటి ముఖాలు కనిపించవద్దన్నారు అని షాపుల యాజమానులు చెబుతున్నారు. ఇలాంటి కఠినమైన ఆంక్షలతో ఆఫ్గనిస్తాన్ మహిళలు ఇంటికే పరిమితమయ్యారు.