తమిళమ్మ అసలు సంగీతం..! – TAMILASAI

By KTV Telugu On 20 March, 2024
image

KTV TELUGU :-

తమిళిసై నిన్నటి దాకా తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్. ఇప్పుడు మాజీ గవర్నర్ స్థాయిలో రాజకీయాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని చూస్తున్నారు.  నిన్నటి పార్టీ బీజేపీలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తమిళనాట బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించడం కుదరదని తెలిసి కూడా ఆమె ఎందుకు రంగంలోకి దిగుతున్నారన్నది పెద్ద ప్రశ్నే. అందుకు కారణాలు లేకపోలేదు. తమిళిసై తెలివి తక్కువ వ్యక్తి అయితే కాదు కదా…

తమిళిసై  అంటే తమిళ సంగీతం అని అర్థం. అది జానపద సంగీతం. చూడటానికి ఆమె, ఆమె ఆహార్యం కూడా తమిళ జనపథం  లాగే అనిపిస్తుంది. ప్రముఖ వైద్యురాలిగా, రాజకీయవెత్తగా ఆమె ఎదిగినప్పటికీ  ఆమెకు రావాల్సినంత పేరు రాలేదన్న ఫీలింగ్ ఉంది. ఎన్నికల్లో  పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తమిళిసై 2019లో  తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు. అప్పటి  వరకు తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇంతకాలం తమిళిసై వర్సెస్ కేసీఆర్ జరిగిన  గలాటా, గలాభా ప్రతీ ఒక్కరూ చూశారు. ఇద్దరి మధ్య  బిల్లుల రాజకీయం తారా స్థాయికి చేరిన సందర్భాలూ ఉన్నాయి. గవర్నర్ కావాలనే  బిల్లులను  తొక్కి పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించిన సందర్భాలూ ఉన్నాయి. మరో పక్క  తన మాతృమూర్తి చనిపోయినప్పుడు ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించలేదని, పలు ప్రాంతాలను సందర్శించినప్పుడు కనీసం హెలికాప్టర్ కూడా సమకూర్చలేదని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. అయినప్పటికీ ఆమె రైలు మార్గంలో ప్రయాణించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అటవీ గ్రామాల్లో పర్యటించారు. గొత్తి కోయలతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇదీ ఒక కోణం ..

క్రియాశీల రాజకీయాలు తమిళిసైకు కలిసొస్తాయా.. గెలవడం అంత సులభం కాదని ఆమెకు తెలియదా.. అని ఎవరైనా  అడిగితే తమిళిసై వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్తున్నారని  చెప్పక తప్పదు.

తమిళిసై రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పోటీ చేశారు. నాలుగు సార్లు ఓడిపోయారు. ఆఖరిసారిగా 2019లో తూత్తుకుడి లోక్ సభా స్థానం  నుంచి పోటీ చేశారు. సీఎం స్టాలిన్ సోదరి కణిమొళిపై పోటీ చేసి పరాజయం పాలైన తర్వాతే ఆమెకు  గవర్నర్ పదవి దక్కింది.  అప్పుడామెకు రెండు లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ  ఎన్నికల కదనరంగంలో దిగుతున్న  వేళ… తమిళనాట బీజేపీ కొంచెం పుంజుకుందన్న చర్చ జరుగుతోంది. ఆమె దక్షిణ చెన్నై,  తిరునల్వేలి, కన్యాకుమారిలో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సర్వేల ప్రకారం  లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి రెండు నుంచి మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ గెలవబోయే నియోజకవర్గం తనది ఎందుకు కాకూడదన్నది తమిళిసై విశ్వాసం.  గెలిస్తే కేంద్రంలో పెద్ద పదవి వస్తుందన్న నమ్మకం. ఓడిపోయినా ఫర్యాలేదన్న   ఆలోచనతోనే ఆమె రంగంలోకి దిగుతున్నారు. ఓడిపోయినప్పటికీ ఇంతకాలం పార్టీకి చేసిన సేవలను గుర్తించి.. రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారన్న ఆలోచనతోనే తమిళిసై ఎన్నికల బరిలోకి దిగారని చెప్పుకుంటున్నారు…

తమిళిసై మంచి మాటకారి. మంచి లీడర్ కూడా. తమిళనాడు  ఇప్పుడిప్పుడే పేరు సంపాదిస్తున్న నాయకురాలు. అందుకే ఆమె  మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఒక క్రేజ్ కనిపిస్తోంది. దాన్ని ఆమె ఎలా వాడతారో చూడాలి. తమిళ ప్రజల్లో ఒక వర్గం మాత్రం ఆమె కోసం ఎదురుచూస్తోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి